పాలసీలు చేయాల్సిన ప్రభుత్వమే కార్మికులను మభ్య పెడుతున్నది
-టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
“టీఆర్ఎస్ బాయిబాట” కార్యక్రమంలో భాగంగా కాసిపేట మైన్ 1 సందర్శన
కార్మికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న టీఆర్ఎస్ చీఫ్
(మందమర్రి)
ప్రభుత్వానికి సింగరేణిని కాపాడాలనే చిత్తశుద్ధి ఉంటే సింగరేణికి బకాయి ఉన్న రూ. 50 వేల కోట్లను వెంటనే చెల్లించాలని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వంలో సర్వసామాన్యంగా జరగాల్సిన పనులకు కూడా పోరాటం చేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ బాయిబాట కార్యక్రమంలో భాగంగా కవిత సోమవారం మందమర్రిలోని కాసిపేట మైన్ -1 పరిశీలించి కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాలసీలు చేయాల్సిన సీఎం, డిప్యూటీ సీఎం లే వినతి పత్రాలిస్తూ సింగరేణి కార్మికులను మభ్య పెడుతున్నారని విమర్శించారు. సింగరేణిలోని మెడికల్ బోర్డు పెట్టకపోతే హైదరాబాద్ లోని సింగరేణి భవన్ ను ముట్టడించామని గుర్తు చేశారు. హైదరాబాద్, ఢిల్లీలో ఉండి మనకు బొగ్గు బావులు తేవల్సిన సీఎం, డిప్యూటీ సీఎం లు మీకే వినతి పత్రాలు ఇస్తున్నారని చెప్పారు. మనకు ఐటీ సమస్య లేకుండా, నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు పెట్టాల్సిన పనులు ఈ ప్రభుత్వం చేయటం లేదని విమర్శించారు. చేయాల్సిన పనులు చేయకుండా ఇక్కడకు వచ్చి కార్మికులను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. కానీ కార్మికుల వెంట ఉండి నిరంతరం పోరాటం చేసే వారెవరో అందరికీ తెలుసన్నారు. కార్మికులకు ముఖ్యంగా హక్కుగా రావల్సిన డిపెండెంట్ ఉద్యోగాల కోసం పోరాటం చేయాల్సి ఉందని కవిత చెప్పారు. సింగరేణికి బొగ్గు బావులు తెచ్చుకుంటే దాదాపు లక్ష ఉద్యోగాలు ఇవ్వవచ్చన్నారు. కానీ అన్నింటినీ ప్రైవేట్ పరం చేయాలని, అండర్ గ్రౌండ్ మైనింగును రద్దు చేయాలని ప్రయత్నిస్తున్నారని కవిత ఆరోపించారు. టీఆర్ఎస్ కార్మికుల కోసం హెచ్ఎంఎస్ తో కలిసి పోరాటం చేస్తుందని వెల్లడించారు. రానున్న ఏ ఎన్నికల్లోనైనా, పోరాటాల్లోనైనా హెచ్ఎంఎస్ తో కలిసి టీఆర్ఎస్ సంయుక్తంగా పోరాడుతుందని స్పష్టం చేశారు. హెచ్ఎంఎస్ అధ్యక్షులు రియాజ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పోరాటం చేస్తున్నారని తెలిపారు. మనకు ఢిల్లీ స్థాయిలో పనులు కావాలంటే జేబీసీసీలో పోరాడాలని పిలుపునిచ్చారు. రియాజ్ అందులో సభ్యులుగా ఉండి సింగరేణి కార్మికుల కోసం కొట్లాడుతున్నారన్నారు.


పాంచజన్యంతో కార్మికులకు వరం
వారం రోజుల పాటు నిర్వహించే బాయిబాట కార్యక్రమం కాసిపేట నుంచే మొదలుపెట్టామని కవిత చెప్పారు. తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా అవతరించామని, సింగరేణి బిడ్డల ఆశీర్వాదం కోసం ఇక్కడకు వచ్చామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేశామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ కలిసి పనిచేశామని తెలిపారు. తాను ఎక్కడ ఉన్నా అనునిత్యం కార్మికుల పక్కనే ఉండి పోరాటం చేశానని కవిత అన్నారు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ పెంచే ప్రయత్నం చేస్తున్న సింగరేణి కార్మికుల భద్రతను పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఇప్పుడున్న కార్మికుల్లో చాలా మంది యువకులు ఉన్నారని తెలిపారు. వారి పిల్లలు చదువుకునేందుకు సరైన స్కూళ్లు, వైద్యం కోసం సరైన హాస్పిటళ్లు లేవన్నారు. అన్నింటిల్లో ప్రైవేట్ ను తీసుకొచ్చి వైద్యాన్ని మరింత ఖరీదు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అందుకే తెలంగాణ రక్షణ సేన పాంచజన్యం అనే ఐదు కీలక అంశాలతో ముందుకు వచ్చిందని వెల్లడించారు. కార్పొరేట్ స్థాయి విద్య, వైద్యాన్ని పూర్తిగా ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఇవ్వగలిగే స్థాయిలో ఉండి కూడా ఇవ్వటం లేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ పెట్టిన తర్వాత సింగరేణిలో ఇదే తన మొదటి యాత్ర అని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి సింగరేణి కార్మికుల దీవెనార్తి ఉండాలని కవిత కోరారు.
గోదావరికి వందనం
బాయిబాట కార్యక్రమంలో మొదటి రోజు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మందమర్రి ఏరియాలోని కాసిపేట 1 మైన్ వద్ద గేట్ మీటింగ్ కు వెళ్తూ గోదావరిఖని శివారులో గోదావరి నది వద్ద ఆగి పరిశీలించారు. ఈ సందర్భంగా నదిలో నాణేలు వేసి నదీమతల్లికి మొక్కుకున్నారు.








