మాతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవు
దాదాగిరి, గూండాగిరి చెల్లదు
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కు కల్వకుంట్ల కవిత హెచ్చరించిన
(తెలంగాణ రక్షణ సేన, ముషీరాబాద్)
చేతనైతే ప్రజాసేవలో పోటీపడండి..కానీ దాదాగిరి చేస్తామంటే ఊరుకోం.. మేము తిరగబడితే మీ జెండాలు కనబడవంటూ ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కు తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత వార్నింగిచ్చారు. మేము జెండా పండుగ చేసుకునేందుకు పోస్టర్లు వేసుకుంటే తీసేస్తున్నారంట.. మేమంటే అంత ఉలుకెందుకు అంటూ ప్రశ్నించారు. ముషీరాబాద్ దాయార మార్కెట్ చౌరస్తాలో మంగళవారం కవిత టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేతనైతే తమతో పాటు పనిలో పోటీ పడాలన్నారు. పార్టీ పెట్టిన రోజు నుంచి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నానని గుర్తు చేశారు. రెండు నెలల క్రితం పుట్టిన తమ పార్టీని చూసి ఎప్పటి నుంచో ఉన్న పార్టీలు భయపడుతున్నాయని ఎద్దెవా చేశారు. ఈ సారి అంటే ఊరుకున్నాం…మళ్లీ ఇలా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తనతో పెట్టుకుంటే పుట్టగతులుండవని హెచ్చరించారు కొత్తవాళ్లను రానివ్వకుండా ఉన్నవాళ్లు పనిచేయకపోతే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలన్నారు. ప్రజల దగ్గరకు వెళ్దాం.. మీరు ఏం చేస్తారో చెప్పుకోండి. మేము ఏం చేస్తామో చెబుతామని సూచించారు. హైదరాబాద్ లో, తెలంగాణలో పేదలు, మధ్య తరగతి ప్రజల జీవితాలు మారాలని చెప్పారు. మీ ఆడబిడ్డ పార్టీ టీఆర్ఎస్ కు ఒకసారి అవకాశం ఇచ్చి ఒక ఆడబిడ్డ రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూడండని కోరారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్ని డివిజన్లలో టీఆర్ఎస్ పోటీ చేసి గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ పోటీ చేస్తుందని వెల్లడించారు.

ఆడబిడ్డకు అవకాశమిచ్చి చూడండి
ఇప్పటికే తెలంగాణలో మూడు పెద్ద పార్టీలు ఉండగా ఇంకొక పార్టీ ఎందుకు అనే ప్రశ్న ప్రజలకు రావడం సహజమేనని కవిత అన్నారు. కానీ ఆ పార్టీలు, వాళ్ల జెండాలతో ప్రజలకు ఏం లాభం జరిగిందో ఒక్కసారి ఆలోచించాలన్నారు. అన్ని వర్గాలకు మంచి జరిగేందుకు మేము పసుపు, నీలం, ఆకుపచ్చ రంగులతో మా పార్టీ జెండాను రూపొందించుకొని కొత్త పార్టీగా ప్రజల ముందుకు వచ్చామని వివరించారు. తెలంగాణ వచ్చిన తర్వాత మన జీవితాలు మారిపోతాయని మనమంతా భావించామని, మహా అయితే అప్పుడు పదివేలున్న జీతం ఇప్పుడు 11 వేలకు పెరిగింది. కానీ అన్ని వస్తువుల రేట్లు.. ముఖ్యంగా స్కూల్ ఫీజులు భారీగా పెరిగాయని కవిత తెలిపారు. పేద, మధ్య తరగతి ప్రజలు విద్య, వైద్యం కోసం జేబులు గుల్ల చేసుకుంటున్నారన్నారు. నాణ్యమైన విద్య, వైద్యం ఫ్రీ గా అందితే అలాంటి కుటుంబాలకు ఎంతో మేలు చేసివాళ్లమవుతామని తెలిపారు. అందుకే తాను పాంచజన్యం పేరుతో ఐదు కీలక అంశాలను ప్రాధాన్యంగా పెట్టుకున్నానని వివరించారు.
కార్పొరేట్ స్థాయి విద్య, వైద్యాన్ని ప్రతి ఒక్కరికీ ఫ్రీ గా అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. యువతకు ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వటం లేదని, వారు స్వయం ఉపాధి పొందేందుకు ఆర్థిక సాయం కూడా చేయటం లేదని విమర్శించారు. కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ యువతను నమ్మి వారికి ప్రభుత్వమే రూ. 2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు ఋణాలు ఇవ్వడానికి నిర్ణయించామని వెల్లడించారు. అన్నం పెట్టే రైతులు కూడా బాగుండాలని…రైతును రాజును చేయాలని లక్ష్యం పెట్టుకున్నామని కవిత వివరించారు. ఇక అందరికీ సామాజిక న్యాయం అందాలని అన్ని కులాలు, మతాల వారికి రాజకీయంగా అవకాశాలు ఇవ్వనున్నామని చెప్పారు.
ఉద్యమకారులకు 250 గజాల స్థలం
తెలంగాణ ఉద్యమంలో ముషీరాబాద్, రాంనగర్ నుంచి ఎంతో మంది పోరాటం చేశారని కవిత గుర్తు చేశారు. కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టినా సరే వాళ్లు రాష్ట్రం కోసం పోరాటం చేస్తే వారికి ఏమీ మంచి చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ మాట నిలబెట్టుకోలేదన్నారు. వారి కోసం జులై 2 ఉప్పల్ భగాయత్ లో భూపోరాటం చేస్తున్నామని వెల్లడించారు. ముషీరాబాద్ లో రెండు సార్లు లక్ష్మణ్, రెండు సార్లు ముఠా గోపాల్ ఎమ్మెల్యేగా గెలిచారని.. కానీ ఇప్పటికీ తాగునీరు, డ్రైనేజీ కోసం కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లకు అవకాశం ఇస్తే వాళ్లు ప్రజలకు ఏమీ చేయలేదని చెప్పారు.








