ఫ్యూచర్ సిటీ పేరుతో బలవంతపు భూసేకరణ సరికాదు

ఫార్మా సిటీ భూములను రైతులకు తిరిగి ఇచ్చేయాలి

రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం

-తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల కవిత

(బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్, హైదరాబాద్)

భూ సేకరణ సహా అన్ని అంశాలపై ప్రభుత్వాలు నిజాలు దాచి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. గత బీఆర్ఎస్ సర్కారైనా..ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమైనా కనీసం ప్రజలకు నిజం కూడా చెప్పటం లేదని విమర్శించారు. ఫార్మా సిటీలో ఏం జరుగుతోంది అనే అంశంపై గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్  సమావేశంలో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పాల్గొని ఆందోళనకారులకు మద్దతు  ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వాల తీరును తీవ్రంగా తప్పు పట్టారు. భూములు కోల్పోయే రైతులకు అండగా ఉండి పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రత్యామ్నాయం చూపి రైతులను ఒప్పించాలి

ప్రభుత్వాలు మంచి మాటకు వినేలా లేవు. గత ప్రభుత్వం కూడా నిస్సిగ్గుగా ఇదే విధంగా అబద్ధాలు చెప్పింది. ఫార్మా సిటీ కోసం మొత్తం 13 వేల 5 వందల ఎకరాలు సేకరించామని చెప్పింది. కానీ అందులో కుందుకూరు మండలంలో 3500, యాచారంలో 6500 ఎకరాల అసైన్డ్ భూములను తీసుకున్నారు. రైతులు మేము పట్టా భూములను ఇవ్వమని చెప్పినప్పటికీ బలవంతంగా వారి భూముల తీసుకునే ప్రయత్నం చేశారు. కోర్టు స్టే ఇచ్చినప్పటికీ కూడా అబద్ధాలు చెబుతూ ముందుకు వెళ్లే కుట్ర చేశారు. ఇప్పుడు అదే అబద్ధాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెబుతున్నది. కోర్టు స్టే ఉన్నప్పటికీ మనం ఏమీ చేయకపోయే సరికి ప్రభుత్వానికి అలుసైంది. రావిలాలలోని గ్రీన్ ఫీల్డ్ లో కోర్టు స్టే ఉన్నప్పటికీ ఒక ప్రైవేట్ కంపెనీ పనులు ప్రారంభించింది. అంటే మనం గట్టిగా పోరాటం చేయకపోయే సరికి వాళ్లు ఇలా చేస్తున్నారు. 

ఫార్మా సిటీకి 13500 ఎకరాలు అని మొదట చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కోసం 30 వేల ఎకరాలు సేకరిస్తామంటున్నది. భూమి సేకరించి మా పేదవాళ్లకు ఏమి చేస్తారన్నది చెప్పటం లేదు? పొల్యుషన్ సంగతి చెప్పటం లేదు.. ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో చెప్పటం లేదు?

సేకరించిన భూమిని బిట్లుగా చేసి పెద్ద కంపెనీలకు ఇస్తారంట? ప్యూచర్ సిటీలో 6 లక్షల కోట్ల ఎంవోయూలు జరిగాయంటూ చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఒక్క కంపెనీ కూడా పనులు మొదలుపెట్టలేదు. 

Kavitha opposes Future City land acquisition, backs Telangana farmers, seeks return of Pharma City lands

భూసేకరణలో వివక్ష

ఇక్కడకు డేటా సెంటర్లు వస్తున్నాయని చెబుతున్నారు. కానీ వాటి వల్ల ఎంతో పొలుష్యన్ ఉంటుంది. డేటా సెంటర్ల ద్వారా పెద్ద శబ్దాలు వస్తాయి. అందుకే అమెరికాలో డేటా సెంటర్లను పెట్టేందుకు అనుమతించటం లేదు. అలాంటి డేటా సెంటర్లను మన వద్ద పెడుతారంట. వాటి కారణంగా ఎంత నష్టం జరుగుతుందో ఇప్పటి వరకు ఎవరూ అంచనా వేయలేదు. రైతుల దగ్గర భూములు తీసుకొని వాళ్లకు రూ.8 లక్షలు ఇస్తే…వారి బతుకుదెరువు సంగతేంటి? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో 31 ని రద్దు చేస్తామని చెప్పింది. కోర్టులో ఫార్మా సిటీనే కొనసాగిస్తామని సీఎం చెబుతున్నాడు. బయట మాత్రం మళ్లీ ఫ్యూచర్ సిటీ పేరుతో నాటకాలు ఆడుతున్నారు. అందుకే ఈ ప్రభుత్వాలకు నిజం చెప్పే ధైర్యం లేదని నేను అంటున్నా. 

ప్యూచర్ సిటీ విషయంలో ప్రభుత్వం ముందు అక్కడి ప్రజలతో మాట్లాడాలి. భూసేకరణలో కూడా చాలా వివక్ష కొనసాగుతోంది. కురిమెట్లలో భూస్వాముల భూముల జోలికి వెళ్లలేదు. వారికి 1600 ఎకరాలు ఉంటే వారి జోలికి వెళ్లలేదు. కానీ గిరిజనుల దగ్గర 350 ఎకరాలు తీసుకున్నారు. ఆ గిరిజనులు చాలా రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు. వారికి తెలంగాణ రక్షణ సేన మద్దతుగా ఉంటుంది. 

అబద్ధాల ప్రభుత్వాలు

ఫార్మా సిటీ భూముల విషయంలో ప్రశ్నించాలి, పోరాడాలి, పరిష్కరించాలి. ఈ మొండి ప్రభుత్వాలకు తగినట్లుగా మనం జగమొండిగా ఉండాలి. మనకు కచ్చితంగా పోరాటమే శరణ్యం, ఈ పోరాటంలో నేను ముందుంట. 

సమస్య పరిష్కారమయ్యే వరకు ఏం చేద్దామో మీరంతా ఆలోచించి చెప్పండి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు, ఉద్యమకారులకు కూడా నష్టం జరిగింది. ఆ ప్రభుత్వంలో నేను కూడా భాగస్వామిగా ఉన్నందుకు క్షమాపణ చెబుతున్నా. ప్యూచర్ సిటీలో బుల్లెట్ ట్రైన్ వస్తుందంటూ చెబుతున్నారు. కానీ ఇప్పటివరకు దేశంలో ఎక్కడ కూడా బుల్లెట్ ట్రైన్ రాలేదు. ఈ ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్ విషయంలో కూడా మనకు అబద్దం చెబుతోంది. ప్యూచర్ సిటీ కారణంగా కోర్ హైదరాబాద్ సిటీ డల్ అయ్యే పరిస్థితి ఉంది. ఫార్మాసిటీ భూముల విషయంలో రైతులకు మేలు జరిగే వరకు పోరాటం చేయటంలో మేము ముందుంటాం.

జిద్దుగా ఉండాలి

ప్రభుత్వాలు అబద్ధాలు చెప్పి జనాన్ని మోసం చేస్తున్నాయి.

ఎందుకంటే మొన్న జరిగిన కేబినేట్ సమావేశంలో రైతులు పండించే పంట కొనుగోలు చేసే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి అన్నారు. ఇది ఇన్ సైడర్ ఇన్ఫర్మేషన్. కానీ దీని గురించి ఏ మీడియా రాయలేదు. ప్రభుత్వం ధైర్యంగా ప్రజలకు నిజం చెప్పలేదు. ముగ్గురు మంత్రులతో మాత్రం ఓ కమిటీ వేశారు. ఈ కమిటీ ఈ ఏడాది మాత్రం కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. అంటే వచ్చే ఏడాది నుంచి కొనుగోలు చేయలేని పరిస్థితి ఉందని కూడా ప్రభుత్వం చెప్పటం లేదు. అటు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పల మీదనే రైతులు చనిపోతున్నారు. దాని మీద కూడా మనం ఏం పోరాటం చేయటం లేదు. మీటింగ్ లు మాత్రమే పెట్టుకుంటున్నాం. ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో కూడా ఇలాగే ఒక జీవో ఇచ్చారు. దాని గురించి తెలుసుకొని మనం ఉద్యమించే లోపే నిర్ణయాలు చేసేస్తున్నారు. అంటే ప్రభుత్వం తన ప్రజలతో కనీసం నిజం చెప్పే పరిస్థితిలో కూడా లేదు. ప్రస్తుతం ఏ వ్యక్తి, ఏ పార్టీ ఏ రంగులో ఉందో అర్థం కాని పరిస్థితి ఉంటోంది. కానీ అందరూ ఒకే వేదిక పైకి వచ్చి చేరుతున్నారు. కానీ ఏ పార్టీ ఎలా పోరాటం చేస్తుందో మాకు సంబంధం లేదు. కానీ మేము మాత్రం ప్రశ్నించాలి, పోరాడాలి, పరిష్కరించాలి అనే విధానంతో ఉన్నాం. మరి పరిష్కారం అంటే ఏ విధంగా చేయాలి? అంటే మనం జిద్దుగా ఉండాల్సిందే. ఇటీవల వెలుగుమట్లలో మేము బాధితుల సమస్యకు పరిష్కారం వచ్చే వరకు అక్కడే కూర్చున్నాం. దాంతో జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు దిగి వచ్చారు.