పేదల ఇండ్లు కూల్చి పెద్దలకు హైడ్రా మద్దతా..

-కల్వకుంట్ల కవిత

(నార్సింగి)

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు.

నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి అక్రమంగా నిర్మిస్తున్న భవనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానికులతో కలిసి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి కవిత ధర్నా చేశారు. హైడ్రా బుల్డోజర్లు అక్కడికి వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని బైఠాయించిన కవితను అరెస్ట్ చేసిన పోలీసులు.. కవితతో పాటు పలువురు జాగృతి నాయకుల అదుపులోకి తీసుకున్నారు. అంతకు ముందు నార్సింగిలో ఆందోళనకు దిగిన కవిత ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా ప్రజల నివాసాలు తొలగిస్తామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, పేదల ఇండ్లు కూల్చేసే హైడ్రాకు ఈ అక్రమ వెంచర్ కనిపించడం లేదా అని నినాదాలు చేశారు. భారీసంఖ్యలో జాగృతి కార్యకర్తలు కూడా ఈ ఆందోళనలో పాల్గోన్నారు. 

హైడ్రా కంటికి కనిపించలేదా

 మూసీ నదిలోనే భారీ అంతస్తుల భవనాలను కడుతుంటే హైడ్రాకు కనబడటం లేదా అని కవిత ప్రశ్నించారు. ఆక్రమణలంటూ కుత్బుల్లాపూర్ లో పేదల ఇళ్లను, ఖమ్మంలోని వెలుగుమట్లలో పేదల ఇళ్లను, మూసీలో కూడా ఎంతో మంది పేదల ఇళ్లను కూల్చేశారని విమర్శించారు. కానీ మూసీలో కడుతున్న ఈ బిల్డింగ్ మాత్రం హైడ్రా రంగనాథ్ కు, ప్రభుత్వానికి కనబడటం లేదని దుయ్యబట్టారు. రంగనాథ్ ఫోన్ చేస్తే కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఉన్నానని చెప్పారన్నారు. ఆయన బుల్డోజర్లు తెచ్చే వరకు కూడా మేమంతా ఇక్కడే ఉంటామని స్పష్టం చేశారు. జనంబాటలో భాగంగా చెరువులు, నదులు అక్రమించి కట్టిన బిల్డింగుల గురించి ఫిర్యాదు చేశామని వివరించారు. కానీ ఇప్పటి వరకు ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదన్నారు. అదే ఖమ్మంలోని వెలుగుమట్లలో 600 మంది పేదల ఇళ్లు కూల్చేశారని విమర్శించారు. త్వరలోనే ఖమ్మం కూడా వెళ్తామని కవిత తెలిపారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో సిటీలోని మధు రిడ్జ్ అపార్ట్ మెంట్ వాళ్లను కూడా ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. ఎంతో మంది మధ్య తరగతి వాళ్లు కష్టపడి అక్కడ అపార్ట్ మెంట్లు కొనుక్కున్నారని, దాదాపు 20 ఏళ్ల క్రితం కట్టిన ఆ అపార్ట్ మెంట్ వాళ్లను ఇబ్బంది పెడుతున్నారని దుయ్యబట్టారు. కానీ ఇక్కడ ఇప్పుడిప్పుడే కడుతున్న, ఎవరికీ నష్టం లేని బిల్డింగును మాత్రం ఆపటం లేదని తెలిపారు. మాకు ప్రైవేట్ వాళ్లతో ఎలాంటి పంచాయితీ లేదన్నారు. ప్రభుత్వంతోనే మా పంచాయితీ అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ బిల్డింగుల నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చారని కవిత ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆరు నెలల పాటు ఈ నిర్మాణాలను ఆపారని,  కానీ ఆ తర్వాత లంచాలు తిని మళ్లీ నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చారని విమర్శించారు. న్యాయం అందరికీ ఒకే విధంగా ఉండాలన్నదే మా పోరాటమని కవిత తెలిపారు. కచ్చితంగా మూసీని, తెలంగాణ వనరులను పరిరక్షించుకుంటామని స్పష్టం చేశారు. హైడ్రా చీఫ్ రంగనాథ్ వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని, అక్రమ కట్టడాన్ని కూల్చాల్సిందేనని డిమాండ్ చేసిన కవితతో పాటు పలువురు డాగృతి నాయకులను అరెస్ట్ చేసి నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

పోలీసుల దౌర్జన్యం

పోలీసులు బలప్రయోగంతో మిమ్మల్ని అరెస్ట్ చేయడం అన్యాయమని కల్వకుంట్ల కవిత విమర్శించారు. తనతో పాటు జాగృతి నాయకులను అరెస్ట్ చేసి నార్సింగి స్టేషన్ కు తరలించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మూసీ నది మధ్యలో పెద్దవాళ్లు కడుతున్న బిల్డింగులను వదిలిపెట్టి పేదవాళ్ల బిల్డింగులు కూలగొడుతున్నారని ఆరోపించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిందని.. దానినే కాంగ్రెస్ కొనసాగిస్తోంది.. పెద్దల పక్షాన్నే ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పడానికి ఇదే నిదర్శనమని దుయ్యబట్టారు. మూసీ రివర్ బెడ్ లో ఉన్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. అదే వెలుగుమట్లలో పేదలు వేసుకున్న గుడిసెలను బలవంతంగా కూల్చేశారని విమర్శించారు. హైదరాబాద్ శివారుల్లో పేదల ఇండ్లను కూల్చేసినందుకు ఈ ప్రభుత్వం తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బుధవారమైనా హైడ్రా బుల్‌డోజర్లు ఇక్కడికి వస్తేనే.. రంగనాథ్ స్పందించి చర్యలు తీసుకుంటేనే ఈ ప్రభుత్వం పేదల పక్షాన ఉన్నదని మేం భావిస్తాంమని కవిత స్పష్టం చేశారు. ఇతర నిర్మాణాలకు మూసీ ఒడ్డు నుంచి 30 మీటర్ల దూరం ఉండాలనే నిబంధనలు విధిస్తున్న ప్రభుత్వం కొందరు పెద్దల భవనాలు 5 మీటర్ల దూరంలోనే ఉన్నా అనుమతులు ఇస్తున్నారంటే ఎంతటి అక్రమాలు జరుగుతున్నాయో తేలిపోతున్నదని వెల్లడించారు. ఈ అక్రమ నిర్మాణాలపై జాగృతి న్యాయపోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.