పర్వతారోహణం

యాదాద్రి-భువనగిరి జిల్లాలో జాగృతి జనంబాటలో భాగంగా పర్యటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం వివిధ వర్గాల వారితో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. భువనగిరి ఫోర్ట్ వద్ద రాక్ క్లైంబింగ్ లో శిక్షణ పొందుతున్న విద్యార్థులను కలిసి వారి అనుభవాలు తెలుసుకున్నారు. పర్వతారోహణ శిక్షణకు అందుబాటులో ఉన్న సదుపాయాలు, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

వృత్తి కళాకారులు

భువనగిరిలోని కుమ్మరి వీధిలో మొల్లమాంబ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు కవిత.  ఈ సందర్భంగా కుమ్మరి వీధిలో కుమ్మరి వృత్తి పని చేసే వారితో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కులవృత్తులు కొనసాగించడానికి తర్వాతి తరాల వారు ఎక్కువ ఆసక్తి చూపడం లేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. వృత్తిని కొనసాగిస్తున్న వారిని కళాకారులుగా గౌరవించాల్సిన అవసరముందన్నారు. 

పేలుళ్లు ఆపండి

అంతకుముందు జియాపల్లి క్రషర్ పేలుళ్లతో ఇబ్బంది పడుతున్న స్థానికులను కవిత పరామర్శించారు. కష్టపడి నిర్మించుకున్న ఇండ్లు క్రషర్ల పేలుళ్ల కారణంగా దెబ్బతింటున్నాయని స్థానికులు కవితకు మొరపెట్టుకున్నారు. ఈ విషయంలో అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కవిత కోరారు.