కడిగిన ముత్యంలా వస్తానని చెప్పా..అదే జరిగింది

-కల్వకుంట్ల కవిత

(బీఆర్కే భవన్, హైదరాబాద్)

నేతల అహంకార ధోరణి కారణంగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైందని, కానీ నెపం తన మీద వేసి తనను బద్నాం చేశారని తెలంగాణ జాగృతి అధినేత్రి, మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తనపై తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల ఆ పార్టీ కోలుకోలేని దెబ్బ తిన్నదన్నారు. ఆ రోజే ఆ తప్పుడు ప్రచారాన్ని ఆపి ఉంటే బీఆర్ఎస్ కు ఈ గతి పట్టేది కాదన్నారు. రైతుల సమస్యలపై శనివారం రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, సభ్యులను కలిసి వినతిపత్రం అందజేసిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అనంతరం ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుపై మీడియాతో మాట్లాడారు. 

చేయని తప్పుకు క్షోభ అనుభవించాను

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ తప్పుడు కేసును కొట్టి వేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుకు భారత న్యాయ వ్యవస్థకు ధన్యవాదాలు. మొదటి నుంచి ఇది తప్పుడు కేసు.. కడిగిన ముత్యంలా బయటకు వస్తాను అని నేను చెప్పాను. ఇవ్వాళ కోర్టు తీర్పుతో అదే జరిగింది. అసలు వాదనలే ఫాల్స్ అని కోర్టు స్పష్టం చేసింది. కేసులో ఉన్న వారందరికీ క్లీన్ చిట్ ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నాం. 

కానీ ఐదున్నర నెలలు నేను పిల్లలకు, కుటుంబానికి దూరంగా ఉన్నాను. ఎంతో బాధ, అవమానాలు, వ్యక్తిత్వ హననాన్ని ఎదుర్కొన్నాను. ఎన్ని కోట్లు ఇచ్చినా సరే ఆ అవమానం తీరేది కాదు, ఆ సమయం మళ్లీ తిరిగి రాదు. ఈ కేసు విషయంలో మా కుటుంబానికి అన్యాయం జరిగిందన్నది వాస్తవం. కేసు ప్రతి హియరింగ్ కు ఇక్కడున్న కార్యకర్తలే వచ్చి నాకు నైతిక స్థైర్యం ఇచ్చారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా అమ్మనాన్నలకు, అత్తమామాలకు, నా భర్త తో పాటు వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. మీరు ఇచ్చిన బలంతోనే పిల్లలు లేకపోయినా సరే కన్నీళ్లు దిగమింగుకొని కర్తవ్యాన్ని గుర్తుచేసుకుంటూ ముందుకు కదిలాను. 

బీఆర్ఎస్ అండగా నిలువలేదు

 ఐతే కోర్టు తీర్పు తర్వాత కేటీఆర్ ట్వీట్ చూశాను. ఒకవైపు కంగ్రాట్స్ చెబుతూనే మరో వైపు పార్టీ ఓటమిని ఈ కేసే కారణమనేలా ఆయన ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తూ పార్టీ ఓటమికి ఈ కేసే కారణమనే ట్విస్ట్ ఇచ్చే ప్రయత్నం  చేస్తున్నారు. అసలు ఈ కేసు నా మీద పెట్టింది ఎందుకోసం? బీఆర్ఎస్ పై కక్ష సాధింపు కోసం కాదా అని కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నా. నేను జైలుకు వెళ్లాక కేసీఆర్, కేటీఆర్ సహా పెద్ద నాయకులెవరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? అప్పుడు మాత్రం నేను ఒంటరిగా వాటిని ఎదుర్కొవాలా? కనీసం సోషల్ మీడియా సపోర్ట్ కూడా లేదు. అత్యంత పవిత్రంగా తొమ్మిది రోజులు అన్నం తినకుండా బతుకమ్మ ఎత్తుకొని జాతి సంస్కృతిని తెలిపిన బిడ్డను నేను. 

అలాంటిది బతుకమ్మ ప్లేస్ లో లిక్కర్ బాటిల్ ఎత్తుకున్నట్లు బీజేపీ సోషల్ మీడియా నన్ను అవమానిస్తుంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా ఏమైంది? ఆనాడే అలాంటి తప్పుడు ప్రచారాలను ఎదుర్కొంటే బీఆర్ఎస్ కు ఈ గతి పట్టేదా? బీజేపీ వాళ్లు మాట్లాడిందే…

బీఆర్ఎస్ వాళ్లు మాట్లాడుతున్నారంటే వాళ్లిద్దరూ ఒక్కటే. బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందో నీతిగా నిజాయితీగా ఆలోచించండి. ఓటమిని నా మెడలో వేయాలనే తాపత్రయం ఎందుకు? బీఆర్ఎస్ అంత వీక్ గా ఉందా? ఒక వ్యక్తి తప్పు చేస్తే ఓడిపోయే స్థితిలో బీఆర్ఎస్ ఉందా?

బీఆర్ఎస్ తప్పు తెలుసుకోవాలి

 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నా పేరు ఎక్కడా చర్చల్లో లేదు. బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవటానికి నేను కారణమా? ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకపోవడం, దోపిడీ దార్లకు టికెట్లు ఇవ్వవద్దు అని మొత్తుకున్న సరే ప్రజలకు మీదకు రుద్దటం అనే అంశాలను అప్పుడు చర్చలో ఉన్నాయి. కోర్టు తీర్పును మీకు అనుకూలంగా మలుచుకొని పార్టీ ఓటమిని నా మెడలో వేయాలని చూస్తున్నారు. కేటీఆర్  వాస్తవాలు గ్రహించాలి. ఇప్పటికైనా తప్పులు ఎక్కడ జరిగాయో సమీక్షించుకోవాలి. నిజాలను అంగీకరించి ప్రజలకు జవాబుదారిగా ఉండాలని కేటీఆర్ కు సూచిస్తున్నా. నేను కేసుల్లో ఉన్నప్పుడు పార్టీ, పార్టీ సోషల్ మీడియా నాకు సపోర్ట్ ఎప్పుడు చేసింది. ఈ కేసు వల్లే ఓడిపోయినట్లు ఇవ్వాళ అడ్డమైన రాతలను సోషల్ మీడియాలో రాస్తున్నారు. నిజంగా ఈ కేసులో వెనకాల ఏం జరిగిందో కేటీఆర్ కు తెలియదా. పార్టీ ఓటమిని నా మెడకు వేయాలని చూస్తే ప్రజలు కూడా హర్షించరు. దయచేసి నిజాలు చెప్పండి. ఆనాడే ధైర్యంగా నేను తప్పు చేయలేదని చెప్పాను. నిజామాబాద్ లో నేను ఓడిపోయినప్పుడు కూడా ప్రజా తీర్పును శిరసావహించా. కారణాలు వెతకలేదు. కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత ఢిల్లీలో ఎన్నికలు జరిగాయి. కానీ తెలంగాణలో మాత్రం  అసెంబ్లీ ఎన్నికల తర్వాత నేను అరెస్ట్ అయ్యాను. కానీ ఈ కేసు కారణంగా అంటూ ఫ్యాక్ట్ ను ట్విస్ట్ చేసే ప్రయత్నం మీ సోషల్ మీడియా ఆర్మీ ద్వారా చేస్తున్నారు. కానీ ఇప్పుడు అలా ఏది పడితే అది మాట్లాడితే చెల్లదు. 

ప్రజా పోరాటమే నా పంథా

నాకు మీ మాదిరిగా ఆర్మీ లేదు. ఇక్కడున్న పిడికెడు మందితోనే నేను ప్రజల పక్షాన పోరాటం చేస్తాను. ఒక ఆడబిడ్డ కష్టంలో ఉన్నప్పుడు అడ్డమైన టైటిల్స్ పెట్టిన అడ్డగాడిదలకు తగిన సమయంలో బుద్ధి చెప్పాలని ప్రజలను చేతులెత్తి కోరుతున్నా. నేను ప్రజాసేవ చేసేందుకు ఈ కేసులు ఏ మాత్రం నాకు అడ్డంకావు. కేసు తీర్పు రాగానే కార్యకర్తలతో సంబరాలు జరుపుకొని వెంటనే రైతుల సమస్యలపై పోరాటంపై దృష్టి పెట్టాం. గద్వాల్, నిజామాబాద్, ఖమ్మం రైతుల బాధలను రైతు కమిషన్ కు తెలియజేశాం. కచ్చితంగా మేము పార్టీ పెట్టాలనుకున్న సమయంలో ఈ తీర్పు రావటమంటే ప్రకృతి సహకరించి మాకు ఆశీర్వాదం ఇస్తున్నట్లే భావిస్తున్నాం. రెండు నెలల్లో నేను పార్టీ పెట్టబోతున్నా. దేవుడు ఆశీర్వాదంతోనే ఈ తీర్పు వచ్చిందని భావిస్తున్నా.