ఎల్లూరు పంపు హౌస్ సందర్శన – (కల్వకుర్తి)
పాలమూరు-రంగారెడ్డితో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని వెంటనే మరమ్మతు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని ఎల్లూరు పంపు హౌస్, డెలివరీ సిస్టర్న్ ను శనివారం పరిశీలించారు. ఎల్లూరు పంపు హౌస్ లో పగుళ్లు, మూడో మోటారు కొట్టుకుపోవడం, పంపు హౌస్ పూర్తిగా నీట మునగడం, రిపేర్లు సహా ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పాలమూరు-రంగారెడ్డి లోని మొట్టమొదటి ఎల్లూరు పంప్ హౌస్ ఒరిజినల్ గా 500 మీటర్ల అప్రోచ్ ఛానెల్, 50 మీటర్ల విడ్త్ తో ఉండాలని కవిత చెప్పారు. కానీ దీని వెడల్పును 20 మీటర్లకు తగ్గించి, పొడవును కూడా కుదించారన్నారు.




గతంలో 794 టీఎంసీల ఫ్లడ్ లెవల్ వరకు నీళ్లు డ్రాయింగ్ పాయింట్ నుంచి తీసుకునే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. కానీ దాన్ని 30 అడుగులకు పెంచి 824 మీటర్ల ఎత్తు వరకు పెంచారని వివరించారు. ఓపెన్ ఎండ్ పంప్ హౌస్ గా ఉండే దీన్ని కంప్లీట్ గా అండర్ గ్రౌండ్ క్లోజ్ ఎండెడ్ పంప్ హౌస్ గా మార్పిడి చేశారని విమర్శించారు.
ఇవన్నీ చేసినప్పుడు సహజంగానే వ్యయం తగ్గాలి.. అదే విధంగా ఎక్కువ నీళ్లు తీసుకునే అవకాశం ఉండాలన్నారు.
కానీ శ్రీశైలం డ్యాంలో నీళ్లు నిండుగా ఉంటేనే నీళ్లు తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారని కవిత తప్పు పట్టారు. అప్రోచ్ ఛానెల్ వెడల్పు తగ్గించటంతో నీళ్లు ఎక్కువగా తీసుకోలేని పరిస్థితి వచ్చిందన్నారు. పైగా అంతకుముందు రూ.3,224 కోట్ల అంచనా వ్యయం ఉంటే దాన్ని రూ.4,600 కోట్లకు పెంచారని ఆరోపించారు. అంచనా వ్యయం పెరిగినా నీళ్లు డ్రాయింగ్ చేసే కెపాసిటీ తగ్గిందని చెప్పారు. 824 మీటర్లకు ఎత్తు పెంచటంతో సంవత్సరం పొడువునా కృష్ణా నది నీళ్లను వాడుకోలేని పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఎవరి కోసం ఈ మార్పు చేయాల్సి వచ్చిందో స్పష్టం చేయాలన్నారు. పైగా క్లోజ్ ఎండెడ్ పంప్ హౌస్ గా చేయటంతో కల్వకుర్తి ఇరిగేషన్ స్కీమ్ లోని 3 వ మోటార్ దెబ్బతిన్నదని కవిత ఆరోపించారు. అది తగిలి ఐదవ మోటార్ కూడా దెబ్బతిన్నదని.. ఇప్పుడు ఇక్కడ మూడే మోటార్లు పనిచేస్తున్నాయని చెప్పారు. రిపేర్ చేద్దామంటే ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ కు నీళ్లిచ్చే మిషన్ భగీరథకు కనెక్ట్ అయి ఉందని తెలిపారు. దీంతో ఈ మోటార్లను కూడా రిపేర్ చేయలేని పరిస్థితి వచ్చిందని వివరించారు. కల్వకుర్తి లిఫ్ట్ లోని రెండు మోటార్లను అర్జెంట్ గా రిపేర్ చేసుకోవాలని కవిత సూచించారు.
మరిన్ని గ్రామాలు ముంపులో..
మరోవైపు ఆరున్నర టీఎంసీల కెపాసిటీ ఉన్న నార్లపూర్ రిజర్వాయర్ ను కూడా నాలుగు టీఎంసీలకు తగ్గించారని కవిత విమర్శించారు. బండ్ విడ్త్, హైట్ తగ్గించారు. అయినా సరే దాని వ్యాల్యు మాత్రం రూ. 740 కోట్ల నుంచి రూ. 960 కోట్లకు పెరిగిందని.. పనులు మాత్రం పూర్తి కాలేదన్నారు. ఇప్పటి వరకు ఫస్ట్ స్టేజ్ పనులు కూడా పెండింగ్ లో ఉన్నాయని కవిత చెప్పారు. కృష్ణానది మీద ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో పెండింగ్ లో ఉండేవి. తెలంగాణ వచ్చాక కూడా అవి నెవర్ ఎండింగ్ ప్రాజెక్టులుగానే మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ముందు ఈ పనులను పూర్తి చేయటంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. కల్వకుర్తి మోటార్లను రిపేర్ చేయాలని, ఎల్లూర్ పంప్ హౌస్ నిర్మాణం కంప్లీట్ చేయాలన్నారు. నార్లపూర్ లో గతంలో ఒక్క టీఎంసీ నింపినప్పుడే చాలా ఊర్లు ముంపునకు గురయ్యాయని, రెండు టీఎంసీలు నింపితే ఊర్లకు ఊర్లు మునిగే పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగా ఆ యా గ్రామాల వారికి ఆర్ అండ్ ఆర్ కాలనీ కట్టించటంతో పాటు పరిహారం ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. నార్లపూర్ పనులు పూర్తి చేస్తేనే పాలమూరు-రంగారెడ్డికి కాస్త లైఫ్ వచ్చినట్లు అవుతుందని చెప్పారు. ఎక్కువ రోజులు ప్రాజెక్టులు పెండింగులో ఉంచితే రేట్లు కూడా పెరిగి ప్రజాధనం వృథా అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.








