కొత్తగూడెం ఆసుపత్రి సందర్శన (కొత్తగూడెం)

కొత్తగూడెంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వైద్య సేవలు పెంచాల్సిన అవసరముందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సార్వజనీన ఆస్పత్రిని  ఆమె సందర్శించారు. రోగులు, డాక్టర్లు, వైద్య సిబ్బందితో మాట్లాడి ఆస్పత్రిలో ఉన్న సదుపాయాలు, సమస్యలు, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆధునిక సౌకర్యాలతో కొత్త ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని కోరారు.

సౌకర్యాలు పెరగాలి

” కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి లో బెెడ్లు, మందులు, వసతుల కొరత ఉన్న సరే డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది పేషెంట్లకు సేవలు అందిస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి రావల్సిన సౌకర్యాలు లేకపోవటంతో ఇబ్బందులు ఉన్నాయి. కొత్తగూడెం లాంటి ప్రాంతానికి 650 పడకల హాస్పిటల్ అవసరం ఉంది. కానీ ఇక్కడ పాత హాస్పిటల్ నే విస్తరించుకుంటూ పోయారు. ఇక్కడ సరైన సౌకర్యాలు లేవు. కార్డియాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ లాంటి వాటికి ఎంజీఎంకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. కొత్తగూడెంలో 750 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి మంత్రులు కృషి చేయాలి. పిడియాట్రిక్ విభాగంలో తొమ్మిది మంది డాక్టర్లు అవసరమైతే ఇద్దరే ఉన్నారు. ఎక్స్ రే, ఎమ్ఐఆర్ స్కాన్ లు పెట్టేందుకు కూడా స్థలం లేదు. కేర్ టేకర్స్, సెక్యూరిటీ, శానిటేషన్, స్వీపర్లు, క్లీనర్లు కలిపి 250 మంది ఉన్నారు. వాళ్లకు ఉద్యోగ భద్రత లేదు. కనీసం హెల్త్ పాలసీ కూడా లేదు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి వారంతా పనిచేశారు. కానీ ఎలాంటి ఎదుగుదల వారికి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడున్న ముగ్గురు మంత్రులు హాస్పిటల్ విషయంలో చొరవ తీసుకొని పనిచేయాలి.”