ఫిరాయింపు ఎమ్మెల్యేలు నైతికత చాటుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి

 పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో తెలంగాణ అసెబ్లీ స్పీకర్ తీర్పు చాలా దారుణంగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఇది కచ్చితంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేయటమేనని దుయ్యబట్టారు. 

కొత్తగూడెం ఎంజీ రోడ్డులోని మార్కెట్ లో తెలంగాణ జాగృతి నియోజకవర్గ ఇన్ ఛార్జీ జగదీశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ జాగృతి జెండాను రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు తమ చిత్తశుద్ధిని చాటుకోవలసిన అవసరముందని స్పష్టం చేశారు.

అప్రజాస్వామికం

” పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పట్ల స్పీకర్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని మేము భావించాం. కానీ పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ గారి తీర్పు చాలా దారుణంగా ఉంది. ఇది కచ్చితంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేయటమే. ఆ ఎమ్మెల్యేలు పార్టీ మారారని అందరికీ తెలుసు. కానీ ఆధారాలు లేవని స్పీకర్ అంటున్నారు. ఇది కచ్చితంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేయటమే. పార్టీ మారిన నేతలు కచ్చితంగా నైతికతను ప్రదర్శించాలి. పార్టీ మారితే పదవిని వదిలే నియ్యత్ ఉండాలి. కానీ స్పీకరే వారికి వత్తాసు పలుకుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వారిని కాపాడుతోంది. నేను బీఆర్ఎస్ ను వదిలాక ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాను. కానీ శాసన మండలి ఛైర్మన్ గారే ఇప్పటి వరకు నా రాజీనామా మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు లేని పరిస్థితి తీసుకొచ్చారు. స్పీకర్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. “

కాంగ్రెస్ హామీల ఊసేలేదు

”  జాగృతి జనంబాటలో భాగంగా కొత్తగూడెెం జిల్లాలో రెండు రోజులు పర్యటిస్తాం. జిల్లాలో సమస్యలు తెలుసుకొని బాధితులతో మాట్లాడుతాం. తెలంగాణ వచ్చాక జిల్లాలో ఏం అభివృద్ది జరిగింది.. ఇంకా ఏం జరగాల్సి ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తాం. మహిళలకు రూ. 2,500 ల ఊసేలేదు. దాని కోసం కనీసం అధ్యయనం చేయటం లేదు. పెన్షన్లు పెంచుతామన్నారు. కానీ ఇప్పటి వరకు పెంచలేదు. ఎన్నికల సమయంలో రైతు బంధు వేసి ఓట్లు అడగటం కాదు. ఇచ్చిన హామీలు అమలు చేయాలి. పంచాయితీ ఎన్నికలు అయిపోయాయి. మా మహిళలమంతా మీ వెంట పడుతాం. గ్రూప్ లలో లేని వారికి కూడా బతుకమ్మ చీరలు  ఇవ్వాలి. గ్రూప్ లలో లేని మహిళల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వద్దా అని అడుగుతున్నా.”

Kalvakuntla Kavitha speaking during Jagruthi Janam Bata tour in Kothagudem district

ప్రైవేటీకరణను అడ్డుకుంటాం

” కొత్తగూడెంలో కచ్చితంగా జాగృతి జెండాను ఎగురవేస్తాం. నిరంతరం మేము ప్రజల మధ్యనే ఉంటాం. సింగరేణిని ప్రైవేట్ వాళ్లకు అప్పగించే కుట్ర చేస్తున్నారు. కనీసం బొగ్గు బ్లాకులు కూడా కేటాయించటం లేదు. హైదరాబాద్ లో సింగరేణి భవన్ ను మేము ముట్టడిస్తే మెడికల్ బోర్డు పెట్టారు. కానీ అసలు ఎందుకు మెడికల్ బోర్డు పెట్టారో కూడా తెలియని పరిస్థితి. డిపెండెంట్ ఉద్యోగాల్లో గతంలో ఎప్పుడు లేని విధంగా అన్యాయం చేశారు. తెలంగాణ వచ్చాక వేలాది మందికి నేనే డిపెండెంట్ ఉద్యోగాలు ఇప్పించాను. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం డిపెండెంట్ ఉద్యోగాలు లేకుండా చేస్తోంది. సింగరేణిలో హాస్పిటల్, స్కూల్ వ్యవస్థను వెంటనే బాగుచేయాలి. సింగరేణి కార్మికుల కోసం నేను నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాను.”