-కల్వకుంట్ల కవిత
ఇల్లందులో జాగృతి జనంబాట- (ఇల్లందు)
హిందూ, ముస్లింల ఐక్యతకు చక్కని నిదర్శనంగా నిలుస్తున్న హజ్రత్ నాగుల్ మీరా దర్గా విషయంలో ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ వాళ్లు ఇబ్బంది పెట్టడం సరికాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనంబాటలో భాగంగా ఇల్లందు సత్యనారాయణ పురం దర్గాను సందర్శించారు. అదే ప్రాంగణంలో ఉన్న సీతారామ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
” హజ్రత్ నాగుల్ మీరా దర్గాలో జరిగే ఉర్సు కార్యక్రమానికి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కానీ కనీస సౌకర్యాలు కూడా కల్పించటం లేదు. జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు దర్గా అభివృద్దికి కృషి చేయాలి. ఇక్కడే రాముల వారి ఆలయం కూడా ఉంది. ఇక్కడకు వచ్చిన వారంతా రాముల వారి ఆలయంతో పాటు దర్గాను సందర్శిస్తున్నారు. దర్గా వద్ద పర్మినెంట్ నిర్మాణాల కోసం మంత్రులు పర్మిషన్ ఇవ్వాలి.
ఆడవాళ్లకు ఇబ్బంది లేకుండా సౌక్యర్యాలు ఏర్పాటు చేయాలి. మిషన్ భగీరథ పైప్ లైన్ ద్వారా ఇక్కడ నీళ్లు ఇచ్చే ఏర్పాట్లు చేయాలి.”
“కొత్తగూడెం పర్యటనలో భాగంగా ఇల్లందులో చాలా మంది సమస్యలు చెప్పారు. రెండు రోజుల పాటు జిల్లాలో ప్రజల సమస్యలు తెలుసుకుంటాం. జనం బాటలో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. సర్పంచ్ ఎన్నికల్లో అసలు గుర్తులే ఉండవు. పరిచయాలను, మనిషిని చూసి ఓట్లు వేస్తారు.
గ్రామస్తులకు ఎవరు పనిచేస్తారో వారిని ప్రజలు గెలిపించుకుంటారు. గుర్తులు లేకుండా ఉన్న ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో పార్టీ స్థాయిని అంచనా వేయాల్సిన అవసరం లేదు. దీనికి కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్లు మేము గెలిచామంటూ గొప్పలకు పోతున్నారు. సర్పంచులు వచ్చాకైనా సరే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. లేదంటే ప్రజలే తిరగబడే పరిస్థితి ఉంటుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు మర్చి పోయింది.
పెన్షన్లు పెంచలేదు. ఫ్రీ కరెంట్ వస్తలేదు. భర్త చనిపోయిన వారికి పదేళ్లుగా పెన్షన్ రావటం లేదు. వారిని చూస్తే చాలా బాధగా ఉంది. వారికి ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలి.
సర్పంచ్ ఎన్నికలను పక్క పెట్టి ప్రజల కోసం పనిచేయాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సూచిస్తున్నా.”










