- బీఆర్ఎస్, బీజేపీ లు ప్రతిపక్షాలుగా వైఫల్యం చెందాయి
- తెలంగాణ ప్రాంత పరిరక్షణ, అస్తిత్వం, హక్కుల కోసం పోరాటానికే పార్టీ పెడుతున్నాం
- ఆంధ్రా ప్రజలంటే ద్వేషం లేదు. ఆంధ్రా రాజకీయ నాయకుల పెత్తనాన్ని మాత్రమే వ్యతిరేకించాం
- చేయని తప్పుకు నాలుగేళ్లు మానసికంగా వేధించారు
- భక్తులకు విశ్వాసం కలిగించేలా చర్యలు తీసుకోవాలి
-కల్వకుంట్ల కవిత
తిరుమల వెంకన్న దర్శనానికి అలిపిరి నుంచి కాలినడకన వెళ్లిన జాగృతి అధినేత్రి
(అలిపిరి, తిరుపతి)
ఎన్నికలు లక్ష్యంగా కాకుండా తెలంగాణ హక్కుల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తామని తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. రాజకీయ పార్టీ అంటే ఆ ప్రాంత ప్రయోజనాలు, ప్రజల మనోభావాలు, అస్తిత్వం, హక్కుల కోసం పనిచేయాలని, తాము త్వరలో ప్రారంభించే పార్టీ అదే దిశగా పనిచేస్తుందని వెల్లడించారు. తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం గురువారం తిరుపతి చేరుకున్న ఆమె అలిపిరి వద్ద మీడియాతో మాట్లాడారు. అలిపిరి మెట్ల మార్గంలో కుటుంబసభ్యులు, జాగృతి నాయకులు, కార్యకర్తలతో కలిసి తిరుమలకు కాలినడకన వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు. చేయని తప్పుకు జైలులో గడపాల్సి వచ్చిందని వెంకన్న స్వామి దయతో న్యాయం గెలిచి తాను నిర్దోషిగా బయటపడ్డానని కవిత చెప్పారు.


వెంకన్న ఆశీస్సులతోనే న్యాయం గెలిచింది
నేను చేయని తప్పునకు నాపై నాలుగేళ్లుగా అవాకులు, చెవాకులు వాగుతూ నన్ను, నా కుటుంబాన్ని తీవ్ర మానసిక వేదనకు గురిచేశారు. నిజాయితీగా ఉన్న మాకు దేవుని ఆశీస్సులు ఉండటంతో ఆ కేసును కోర్టు కొట్టివేసింది. స్వామి వారి ఆశీస్సులు తీసుకునేందుకు ఇవ్వాళ తిరుమల వచ్చాం. మా కుటుంబ సభ్యులు, జాగృతి కుటుంబ సభ్యులు, ఆంధ్రాలో మా శ్రేయోభిలాషులు కూడా వచ్చారు. కాలినడక స్వామి వారిని దర్శించుకునే మొక్కు ఉంది. తీర్చుకోవటానికి వచ్చాం. ఎప్పుడు తిరుమలకు వచ్చినా మాకు మంచి జరుగుతుంది. మూడు నెలల క్రితమే స్వామి వారి ఆశీస్సుల కోసం వచ్చాను. దేవుడి ఆశీస్సులతో కేసు కొట్టివేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో లీగల్ గా పోరాటం చేస్తాం.
నీతి, నిజాయితీ గా ఉండే వాళ్లకు తప్పకుండా దేవుని ఆశీస్సులు ఉంటాయి.
క్షేత్రస్థాయిలో పనిచేస్తాం
తెలంగాణ ప్రజలకు సేవ చేసే పార్టీని త్వరలోనే పెట్టబోతున్నాం. మా పార్టీకి స్వామి వారి ఆశీస్సులు తీసుకుంటాం. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా, భేదభావాలు లేకుండా మంచి చేసే పార్టీ పెడుతున్నాం. పార్టీ పెట్టిన తర్వాత కూడా కొత్త కార్యక్రమాలు చేపడతాం. మళ్లీ స్వామి వారి ఆశీస్సుల కోసం వస్తాం. ఆంధ్రా ప్రాంతంలోని ఆదినారాయణ, ప్రతాప్, కిషోర్ యాదవ్ తదితరులు జాగృతికి మద్దతు ఇస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మేము చాలా ఆలస్యంగా బరిలోకి దిగినప్పటికీ 40 స్థానాలు ఇచ్చారు. బీఆర్ఎస్, బీజేపీలు ప్రతిపక్షాలుగా పూర్తిగా వైఫల్యం చెందాయి. ఈ కారణంగానే ఒక్క హామీ నెరవేర్చకపోయినా సరే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలుచుకుంది. కచ్చితంగా ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీలు ఇప్పుడు ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేసినా సరే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. పూటకొక స్టాండ్ మార్చుకునే పార్టీలను ప్రజలు విశ్వసించరు. అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, మహిళలు, యూత్ ను బీఆర్ఎస్ పూర్తిగా విస్మరించింది. బీఆర్ఎస్ విస్మరించిన వర్గాల అజెండానే మేము ముందుకు తీసుకొని వెళ్తాం. కొత్తదనంతో ముందుకు వెళ్తేనే కొత్త పార్టీలకు మనుగడ ఉంటుంది. పెద్ద పెద్ద మాటలు చెప్పి ప్రజలకు క్షేత్ర స్థాయిలో సమస్యలు తీర్చకుండా ఉండే పార్టీ కాదు మాది. నిరంతరం ప్రజల్లో ఉంటూ మైక్రో లెవల్ లో ప్రజల సమస్యలపై పోరాడుతాం. తెలంగాణ ఫస్ట్, తెలంగాణ హక్కుల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తాం. హైడ్రా పెద్దలను కాపాడుతూ పేదలకు అన్యాయం చేస్తోంది. ఏ ప్రభుత్వమైనా పెద్దల కోసం పేదలకు అన్యాయం చేస్తోంది. ఈ పరిస్థితి మారాల్సిన అవసరముంది. నేను సిరిసిల్ల నుంచి పోటీ చేస్తానని నా కుమారుడు అనలేదు. అనని మాటలను మీడియా దయచేసి ప్రసారం చేయవద్దు.


భక్తుల మనోభావాలు దెబ్బతీయవద్దు
తెలంగాణ ప్రజలు అన్ని ప్రాంతాలు బాగుండాలని కోరుకునే మానవతావాదులు.
ఆంధ్ర ఆధిపత్యం, ఆంధ్రా రాజకీయ నాయకుల ఆధిపత్యాన్ని మాత్రమే మేము వ్యతిరేకించాం
ఆంధ్రా ప్రజలంటే మాకు ఎప్పుడూ ద్వేషం లేదు. రాజకీయ నాయకుల ఆధిపత్యంపై ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉంటాం. ఆంధ్రా, తెలంగాణలో ఎవరు కూడా ప్రజలపై ఆధిపత్యం చెలాయించ వద్దు. రెండు రాష్ట్రాలు విడిపోయాయి. ఎవరి బాటన వారు అభివృద్ధి చేసుకోవాలి. రాష్ట్రాలుగా మాత్రమే విడిపోయాం. ప్రజలుగా కలిసి ఉందామనే ఎప్పుడూ చెబుతున్నాం. తిరుమలలో కల్తీ లడ్డు విషయంలో తెలంగాణ ప్రజల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. వెంకటేశ్వర స్వామి వారికి దేశవ్యాప్తంగా భక్తులు ఉంటారు. టీటీడీ విషయంలో ప్రజలకు విశ్వసనీయత కలిగించేలా ఇక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.








