(తిరుపతి)

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు, ఆమె కుటుంబ సభ్యులు, జాగృతి నాయకులకు రేణిగుంట విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. మంగళ హారతి ఇచ్చి సంప్రదాయ బద్దంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు. తనపై తప్పుడు కేసు పెట్టి నాలుగేళ్లుగా వేధింపులకు గురి చేశారన్నారు. కానీ సత్యం తన వైపు ఉండటం, దేవుడి దయతో ఆ కేసును కోర్టు డిశ్చార్జ్ చేసిందన్నారు. వేంకటేశ్వర స్వామి అంటే తమకు ఎంతో నమ్మకమని, కాలి నడకన స్వామివారిని దర్శించుకోవాల్సిన మొక్కు ఉందని కవిత వెల్లడించారు.

కేసులో క్లీన్ చిట్ వచ్చిన సందర్భంగా తమ కుటుంబం, జాగృతి కుటుంబ సభ్యులు మొక్కు తీర్చుకోవటానికి వచ్చామని వివరించారు. ఆంధ్రాలో ఉన్న తమ శ్రేయోభిలాషులు, తమ మేలు కోరే వారంతా వచ్చి స్వాగతం పలికిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు.

త్వరలోనే తాము ఏర్పాటు చేయబోయే పొలిటికల్ పార్టీకి స్వామి వారి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతున్నానన్నారు.