కాళేశ్వరం ప్రాజెక్ట్ మాదిరిగా పాలమూరు- రంగారెడ్డిని పరుగులు పెట్టించలేదు

ఏపీ కడుతున్నట్లే తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక కొత్త ప్రాజెక్ట్ కట్టాలి | (నాగర్ కర్నూలు)

ఎడ్యుకేషన్, ఇరిగేషనే తన విధానమని సీఎం చెబుతుంటారు కానీ ఆయనది డైవర్షన్, కరెప్షన్ పాలసీ అని తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత విమర్శించారు.  

ఆయన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కోసం రూ. 400 కోట్లు ఇచ్చిన అని చెబుతున్నారు. మరి అంత డబ్బు ఇస్తే ఒక్క తట్టెడు మట్టి కూడా ఎందుకు ఎత్తిపోయలేదని ప్రశ్నించారు. జాగృతి జనంబాటలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించిన కవిత శనివారం నాగర్ కర్నూల్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు.

హరీశ్ నిర్వాకంతో ప్రాజెక్టు నిర్వీర్యం

“పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ కోసం నీటి సోర్స్ ను శ్రీశైలం నుంచి ఎందుకు పెట్టుకున్నారో బీఆర్ఎస్, కాంగ్రెస్ చెప్పాలి. శ్రీశైలం అనేది ఉమ్మడి ప్రాజెక్ట్. కనుక ప్రతి దానికి మన జుట్టు కేంద్రం చేతిలో ఉన్నట్టే. శ్రీశైలం నుంచి నీటి సోర్స్ తీసుకోవటం అంటే పర్మినెంట్ గా జలవివాదానికి తెర తీసినట్టే. కనుక జూరాల నుంచి మనం వాటర్ సోర్స్ తీసుకోవాలి. 

ఆంధ్రా ప్రభుత్వం ఏ విధంగా అయితే నల్లమల్ల సాగర్ కడుతుందో.. తెలంగాణ ప్రభుత్వం కూడా మరొక ప్రాజెక్ట్ కట్టాలి. దాని కోసం మా జాగృతి తరఫున పోరాటం చేస్తాం. 

పాలమూరు-రంగారెడ్డి ఫస్ట్ పంప్ హౌస్ అయిన ఏల్లూరు పంప్ హౌస్ అనేది ఓపెన్ పంప్ హౌస్ గా ఉండేది. కానీ అప్పటి మంత్రి హరీష్ రావు కాంట్రాక్ట్ సంస్థతో కుమ్మక్కై దాన్ని అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ చేశారు. ఈ క్రమంలో చేసిన బ్లాస్టింగ్ తో 3 వ మోటార్, 5 మోటార్ పనిచేయకుండా అయిపోయాయి. హరీష్ రావు నిర్వాకంతో ఇవ్వాళ్టికి కూడా కల్వకుర్తి ఎత్తిపోతలలో మూడే మోటార్లు పనిచేస్తున్నాయి. కల్వకుర్తి ఎత్తిపోతల మిషన్ భగీరథతో కనెక్ట్ అయి ఉంది. దాన్ని రిపేర్ చేసినా సరే నీళ్లు రావు. ఎన్నికలకు ముందు కేసీఆర్ గారు నార్లపూర్ పంప్ హౌస్ స్టార్ట్ చేశారు. కానీ కాంగ్రెస్ వచ్చిన రెండేళ్లలో తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు. కృష్ణా నీళ్ల విషయంలో అప్పుడు పోతి రెడ్డి పాడు నుంచి 45 వేల క్యూసెక్కులు ఆంధ్రావాళ్లు తీసుకెళ్లే వాళ్లు. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 80 వేల క్యూసెక్కుల నీళ్లను తీసుకెళ్లారు. అంటే జలదోపిడీ డబుల్ అయ్యింది. ఆంధ్రా వాళ్లు 3 టీఎంసీ ల నీళ్లు తోడుకునేందుకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టుకుంటే మా జాగృతి కార్యకర్తలు ఎన్ జీటీలో కేసు వేశారు. మేము స్టే తెచ్చిన తర్వాతే అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఇన్ ప్లీడ్ అయ్యింది. బీఆర్ఎస్ ప్రభుత్వమే దీనిపై ఎందుకు కేసు వేయలేదో చెప్పాలి. ఆంధ్రా ప్రభుత్వం ఇప్పుడు బనకచర్ల పేరు మార్చి నల్లమల్ల సాగర్ కడుతామంటున్నారు. “

కృష్ణా నీటిని వాడుకోలేమా..

“కృష్ణాలో మనకు 550 టీఎంసీలు రావాలి. వాటిని  కృష్ణా పరివాహాక ప్రాంతంలో వాడుకునే ఆస్కారం ఉంటుంది. ఏదైతే 45, 45 టీఎంసీలు ఎక్సెస్ గా ఉందో 90 టీఎంసీల కోసం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ను బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది. కానీ కాళేశ్వరం పరుగులు పెట్టినట్లు పాలమూరు-రంగారెడ్డి పరుగులు పెట్టి ఉంటే రిజల్ట్ వేరే విధంగా ఉంటుండే. 

వట్టెం రిజర్వాయర్ కు సంబంధించి కాల్వలు, దాని వ్యవస్థ ఎక్కడ పూర్తి కాలేదు. 

తెలంగాణ వచ్చాక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 6 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని బీఆర్ఎస్ చెబుతోంది. కానీ మహబూబ్ నగర్ లో 25 లక్షల ఎకరాలు పంటలు పండే భూములున్నాయి. తెలంగాణ వచ్చిన 12 ఏళ్లలో కేవలం ఆరున్నర లక్షల ఎకరాలకే నీళ్లు ఇచ్చారు. ఇది కరెక్టేనా? దాన్ని ఏమందాం? ఎట్ల చూద్దాం? ఈ ప్రాజెక్ట్ మనం కట్టకపోవటం కారణంగా ఆ 45, లేదా 90 టీఎంసీల మీద మనకు హక్కు రాలేదు. ఆ ప్రాజెక్టులు మనం కట్టేసి ఉంటే ఆ నీళ్లను వాడుకునే హక్కు మనకు వస్తుండే. ఆంధ్రాలో చంద్రబాబు, లోకేష్ వరద నీళ్లకు మేము ప్రాజెక్టులు కడుతున్నామని చెబుతున్నారు. వరద నీళ్ల పేరుతో కట్టిన వాటికి కూడా నిజంగా ట్రిబ్యునల్ నీళ్ల వాటా కేటాయించినప్పుడు వాళ్లకు నీళ్లను కేటాయిస్తుంది. పాలమూరు-రంగారెడ్డి మనం కట్టి ఉంటే ఇప్పటికే మనకు 90 టీఎంసీ ల హక్కు వస్తుండే. ఇక కాంగ్రెస్ వచ్చి ఉన్న 45 టీఎంసీలే చాలంటూ వాళ్లు ఉత్తరం రాశారు. 

మనకు ఉన్న 550 టీఎంసీల్లో ఇంకా 45 టీఎంసీలను వీళ్లు పొగేట్టేశారు. వాటర్ ప్రాజెక్టుల కింద చూపించి మనం 90 టీఎంసీలకు పర్మిషన్లు తెచ్చుకున్నాం. కానీ కాంగ్రెస్ వచ్చాక ఆ హక్కును కూడా పొగేట్టింది. ఇది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి మాట్లాడితే నల్లమల్ల బిడ్డను అని చెప్పుకుంటారు. ఆయనది నాగర్ కర్నూల్ జిల్లాలోని కొండారెడ్డి పల్లెనే. మరి పాలమూరు-రంగారెడ్డి కోసం ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? పాలమూరు-రంగారెడ్డి లో 21 ప్యాకేజ్ లు ఉండే. ఇందులో మూడు ఎగరకొట్టేశారు. “

900 ఎకరాలు మాయం


“వట్టెం రిజర్వాయర్ కింద 9 వందల ఎకరాలు నల్ల మట్టిని తీసుకోవటానికి అప్పజెప్పారు. కానీ ఆ 9 వందల ఎకరాలు ఇప్పుడు ట్యాంక్ లో బండ్ లో లేవు. చెరువుల నుంచి నల్ల మట్టిని తీసుకొచ్చి రిజర్వాయర్ పోశారు.  మరి ఆ 9 వందల ఎకరాల భూమి ఏమైంది? ఆ భూమంతా కూడా కాంట్రాక్టర్ల చేతిలో ఉంది. ఆ కాంట్రాక్టర్లు తోటలు పెట్టుకొని గేట్లు పెట్టుకొని వారి సామ్రాజ్యాలుగా చేసుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో చాలా అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి అంటున్నారు. ఆయనకు దమ్ముంటే ఈ 9 వందల ఎకరాలను రైతులకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నా.”

పాలమూరు-రంగారెడ్డిని పక్కన పెట్టారు

“డిండి ప్రాజెక్ట్ కు సోర్స్ ఎక్కడ నుంచి తీసుకోవాలనే దానిపై పది కోట్లు ఖర్చుచేసి పదిసార్లు సర్వే చేశారు. 18 ప్యాకేజీల్లో కూడా నారాయణపేట్- కొడంగల్ అంటూ సీఎం కొత్త స్కీమ్ పెట్టుకున్నాడు. దానికి కూడా ఇన్ టేక్ పాయింట్ ను భీమాలో పెట్టుకున్నారు. ఇన్ టేక్ పాయింట్ జూరాల పెట్టుకుంటే ఎక్కువ నీళ్లు తీసుకునే అవకాశం ఉంటుంది. సీఎం ఈ జిల్లా బిడ్డ అయి కూడా ఎక్కువ నీళ్లు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ అలా చేయటం లేదు. 

అంటే తన గురువు చంద్రబాబు కోసం పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ లను కంప్లీట్ గా పక్కన పెట్టినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కేవలం ఆరున్నర లక్షల ఎకరాలకే నీళ్లు ఇచ్చినప్పటికీ బీఆర్ఎస్ కు 13 సీట్లు ఇచ్చారు. ఇక్కడి మెడికల్ కాలేజ్ కూడా చాలా జోక్. మొత్తం 40 ఎకరాల ల్యాండ్ లో ఎక్కువ శాతం అసైన్డ్ ల్యాండే ఉంది. తమ జీవనాధరమైన భూమిని రైతులు రాసిచ్చారంటూ చెబుతున్నారు. కానీ వాళ్ల పై దౌర్జన్యం చేసి వారి నోళ్లు మూయించి భూములను గుంజుకున్నారు. ఈ భూముల విషయంలో కలెక్టర్ కచ్చితంగా రివ్యూ చేయాలి.” 

రైలుకూతకు నోచుకోలేదు

” నాగర్ కర్నూల్ లో 1904 నుంచి కూడా రైలు కూత వినబడలేదు. గద్వాల-మాచర్ల రైల్ లైన్ ను ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. ఇక్కడి ఎంపీ ఆ ప్రాజెక్టును పూర్తి చేయించే బాధ్యత తీసుకోవాలి. తెలంగాణ వచ్చిన 12 ఏళ్ల తర్వాత కూడా నాగర్ కర్నూల్ కు రైలు రాకపోవటం దారుణం. ఇక్కడ రైలు మార్గం వస్తే ఈ జిల్లా అభివృద్ధి చెందుతుంది. నాగర్ కర్నూల్ లోని నాలుగు నియోజకవర్గాల్లో 36 శాతం అటవీ భూములే ఉన్నాయి. ఎన్నో వనరులు ఉన్న ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేయాల్సి ఉంది. డిబీర్స్ అనే సంస్థ 14 ఏళ్ల క్రితం ఇక్కడ మైనింగ్ చేస్తామంటే దాన్ని అడ్డుకున్నాం. సాంబశివుడు అన్నతో కలిసి నేను  ఇక్కడ మైనింగ్ చేయకుండా ఆపగలిగాం. రాష్ట్రం రాకముందు అనేక సార్లు ఈ ప్రాంతానికి నేను వచ్చాను. ఈ ప్రాంతంలో ఎన్నో మంచి కోటలు ఉన్నాయి. వాటిని మనం పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాల్సి ఉండే. ఇక్కడ కుంకుడు కాయలకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ మార్కెటింగ్ ను సరిగా చేయలేదు. ఈ ప్రాంతంలో ఉండే బిట్టు ఉడుత గురించి చేయాల్సినంత ప్రచారం చేయలేదు. రాష్ట్రంలో అడవులు ఉన్న జిల్లాల్లో జీసీసీలు సరిగా పనిచేయటం లేదు. ఐటీడీఏ నిధులను సరిగా ఉపయోగించకపోవటంతో చెంచులు చాలా అన్యాయం అవుతున్నారు. ఈ ప్రాంతం కళలకు కాణాచి. పద్మాలయ ఆచారి, గోరటి వెంకన్న, పాలోజి సత్యం గారి లాంటి కళకారులు ఉన్న ప్రాంతం ఇంది. క్వాడ్ మినరల్స్ ద్వారా వచ్చే ఆదాయం జిల్లాకు రావటం లేదు. ఈ ప్రాంతం శ్రీశైలానికి ముఖద్వారం, ఇక్కడి మల్లెల తీర్థం ఎన్నోసార్లు వచ్చాను. నాగర్ కర్నూల్ లో మల్లెల తీర్ధాన్ని తెలంగాణ ఊటీగా చెప్పుకోవచ్చు. 

కానీ ఈ జిల్లాలో అక్షరాస్యత 54 శాతమే ఉండటం దురదృష్టం. జిల్లాలో అక్షరాస్యతను పెంచేందుకు ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులు కృషి చేయాలి. “

అడ్వాన్సులిచ్చినా పనులేవి

“నారాయణ పేట్ – కొడంగల్ కోసం మేఘా సంస్థ, పొంగులేటి సంస్థలకు వెయ్యి కోట్ల చొప్పున అడ్వాన్స్ లు ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో అడ్వాన్స్ గా ఇచ్చే సంస్కృతి లేకుండే. కానీ ఈ ముఖ్యమంత్రి అడ్వాన్స్ గా డబ్బులు ఇచ్చారు. పాలమూరు- రంగారెడ్డిలో కొంచెం పనిచేస్తే పూర్తి అయ్యే దానికి మీరు డబ్బులు ఇవ్వలేదు. ఇక ఏపీ జలదోపీడీ చాలదన్నట్లుగా కర్ణాటక ప్రభుత్వం కూడా ప్రాజెక్ట్ ల హైట్ పెంచుతుందంట? అప్పుడు మనకు అప్పర్ తుంగభద్ర నుంచి నీళ్లు రావు. జురాల మీదే ఆధారపడాలి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పటికీ ఈ ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడటం లేదు. కల్వకుర్తి, డిండి ఎత్తిపోతల ద్వారా అచ్చంపేట నియోజకవర్గానికి పెద్దగా మేలు జరగలేదు. డిండి నుంచి కల్వకుర్తికి కృష్ణా నీళ్లు రావటం లేదు. నాగర్ కర్నూల్ లో 73 వేల 4 వందల ఎకరాలకు నీళ్లు రావాల్సి ఉంటే చుక్క నీళ్లు రాలేదు. “

మైనార్టీలకు ప్రాధాన్యం

“నాగర్ కర్నూల్ లో రింగ్ రోడ్డు పూర్తి చేయాల్సిన అవసరముంది. దుందుభిలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఇసుక దోపీడి ఇప్పుడు మరింత ఎక్కువ అయ్యింది. సీఎం ఫోటోలు పెట్టుకొని మరీ ఇసుక దోపిడీ చేస్తున్నారు. నేను బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు తలసరి ఆదాయం గురించి మాట్లాడితే వివాదం చేశారు. కానీ అప్పుడు, ఇప్పుడు కూడా అదే విషయం చెబుతున్నా. హైదరాబాద్ లో తలసరి ఆదాయం రూ. 10 లక్షలు ఉంటే…వికారాబాద్, నాగర్ కర్నూల్ లో లక్షా 28 వేలు ఉంది. వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగాల్సినప్పటికీ అది జరగటం లేదు. అభివృద్ధి, ఆర్థిక వృద్ధిలో అందరికీ అవకాశాలు రావాలి. జాగృతి పోరాటమంతా కూడా సామాజిక తెలంగాణ సాధన కోసమే. మేము 80 శాతం పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లకే ఇస్తాం. మైనార్టీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో, రాజకీయ పదవుల్లో అన్యాయం జరుగుతోంది. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ల కోసం మేము పనిచేస్తాం. మైనార్టీలకు పెట్టిన బడ్జెట్ లో సగం కూడా ఖర్చు చేయటం లేదు. 

మైనార్టీల్లో ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులకు సరైన వాటా ప్రభుత్వం ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయటంలో ఫెయిల్ అయ్యింది. మేము జనం బాటలో తెలుసుకున్న సమస్యలపై కమిటీలు వేసి పోరాటం చేస్తాం. గోకరాం, ట్రిఫుల్ ఆర్ బాధితులను కూడా కలిసి వారి సమస్యలు తెలుసుకుంటాం. జనంబాట ద్వారా ప్రజల్లోకి వెళ్తుంటే పేదల పట్ల జరిగిన ఆకృత్యాలు తెలుస్తున్నాయి. గతంలో రైతులకు బేడీలు వేసి వాళ్లను ఇబ్బంది పెట్టారు. చాలా ప్రాజెక్టుల కోసం పెద్దల భూములను కాపాడేందుకు పేదల భూములను బలి పెట్టారు. కారుకోండ రిజర్వాయర్ పూర్తైనప్పటికీ నీళ్లు నింపలేదు. చాలా రిజర్వాయర్ల వద్ద నీళ్లు ఎగదన్నుతూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వట్టెం ప్రాజెక్ట్ నిండితే నీళ్ల ఊట ఉంటుందని ప్రజలు భయపడుతున్నారు. కారుకొండలో ఊరు పక్కన నిమ్మ వస్తోంది. వారందరికీ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.”