రాజకీయ ప్రాధాన్యం తగ్గిస్తే మరో తెలంగాణ ఉద్యమం తప్పదు
మహిళ బిల్లులో బీసీ సబ్ కోటా ఉండాల్సిందే
-కల్వకుంట్ల కవిత
(తెలంగాణ జాగృతి కార్యాలయం, బంజారాహిల్స్)
పార్లమెంటులో ప్రవేశబెట్టబోయే మహిళ బిల్లుకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయటం పెద్ద కుట్ర అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డీ లిమిటేషన్ బిల్లును కాల్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. భారత పార్లమెంటులో గురువారం మూడు బిల్లులు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కవిత ఒక ప్రకటన విడుదల చేశారు.
వేర్వేరు అంశాలను ముడిపెట్టొద్దు
పార్లమెంట్ లో ఇవ్వాళ మహిళ రిజర్వేషన్ల బిల్లుపై చర్చ జరగనుందని, ఇది కచ్చితంగా మహిళలకు చాలా ముఖ్యమైన రోజని కల్వకుంట్ల కవిత చెప్పారు. అదే విధంగా నియోజకవర్గాల పెంపుపై కూడా చర్చ చేయనున్నారని, కానీ మహిళ బిల్లును ఇప్పటికే పాస్ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు డిలిమిటేషన్ బిల్లును మహిళా రిజర్వేషన్ బిల్లుకు లింక్ చేస్తూ కేంద్రం కుట్ర చేస్తోందని విమర్శించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ అనేవి రెండు వేర్వేరు అంశాలని కవిత స్పష్టం చేశారు. మహిళల భుజంపై తుపాకి పెట్టి డీ లిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం భావిస్తోందని మండిపడ్డారు. నియోజకవర్గాలను బ్లాంకెట్ గా 50 శాతం పెంచుతామని కేంద్రం చెబుతోందన్నారు. చూడటానికి ఇది కరెక్టే అనిపించినప్పటికీ చాలా నష్టం జరగుతుందని తెలిపారు. బిహార్ లాంటి రాష్ట్రంలో పెరిగిన సీట్లతో పోల్చుకుంటే మనకు చాలా తక్కువ సీట్లు ఉంటాయని కవిత చెప్పారు. ఈ పద్ధతిలో బిల్లు పాసైతే కచ్చితంగా తెలంగాణ రాజకీయ ప్రాధాన్యం తగ్గుతుందని హెచ్చరించారు. ప్రస్తుతం పార్లమెంటులో తెలంగాణకు 3.13 శాతం ప్రాతినిధ్యం ఉందని తెలిపారు. డీ లిమిటేషన్ కు ఏ ప్రాతిపదికన తెచ్చినా సరే తెలంగాణకు 3.13 శాతం వాటా తగ్గొద్దని సూచించారు. లేదంటే తెలంగాణ ప్రజలు మరో తెలంగాణ మాదిరి ఉద్యమం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికే కేంద్రం నుంచి రావల్సిన నిధులు రావటం లేదని, ఏ ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా మన రాజకీయ ప్రాధాన్యం తగ్గిస్తే మరింత నష్టపోవాల్సి ఉంటుందన్నారు. మహిళా బిల్లుకు డీ లిమిటేషన్ ను లింక్ చేయటం కాదని, మహిళా బిల్లుకు బీసీ సబ్ కోటాను లింక్ చేయాలని డిమాండ్ చేశారు.
కాశీ పర్యటనకు బయల్దేరిన కల్వకుంట్ల కవిత
ఈనెల 25న రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవడానికి గురువారం ఉదయం కాశీ బయలుదేరి వెళ్లారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని సాయంత్రం హైదరాబాద్ కు తిరిగి రానున్నారు.








