ఉద్యమకారుల కోసం భూ పోరాటం
జులై 2న ఉప్పల్ భగాయత్ భూములు స్వాధీనం చేసుకుంటాం
-కల్వకుంట్ల కవిత
పోస్టర్ విడుదల చేసిన టీఆర్ఎస్ చీఫ్
(తెలంగాణ రక్షణసేన కార్యాలయం, హైదరాబాద్)
తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇచ్చే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన భూపోరాటానికి నడుం బిగించిందని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. జులై 2న ఉప్పల్ భగాయత్ లో భూపోరాటం చేసి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం ఉద్యమకారుల భూపోరాటం పోస్టర్ ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ వెంటనే ఉద్యమకారులను గుర్తించి వారికి ఇస్తామన్న భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మరో మారు కొంతమంది వ్యక్తులు, శక్తులు తెలంగాణవాదం మీద దాడి చేస్తూ తెలంగాణ స్ఫూర్తిని దెబ్బ తీసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అందుకే వాళ్ల కుట్రలను తిప్పికొట్టేలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం మనందరి చారిత్రక కర్తవ్యమన్నారు. ఉద్యమకారులకు మంచి జరగాలని భావించే వాళ్లంతా పెద్ద ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా యువత, మహిళలు ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొనాలని కవిత చెప్పారు. మీ భవిష్యత్ కోసం ఉద్యమకారులు వాళ్ల జీవితాలనే త్యాగం చేశారని గుర్తు చేశారు. కనుక వారికి మంచి చేసే కార్యక్రమంలో మనమంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.








