(బీఆర్కే భవన్, హైదరాబాద్)

తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న సాగు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కోరారు. రాష్ట్రంలో విత్తన పంటలు సాగు చేస్తున్న రైతుల సమస్యలను శనివారం బీఆర్కే భవన్ లో తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, సభ్యులను కలిసి వివరించారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ… రైతులు 60 రకాల విత్తనాలను పండిస్తూ ‘సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా’ గా తెలంగాణను చేసేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. కానీ వారికి 2007 లో పాసైన కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనే చట్టం ప్రకారం ఉండాల్సిన హక్కులు ఉండటం లేదని వివరించారు. రైతుకు మేలు చేసే విధంగా ఆ చట్టాన్ని వాడకోవటం లేదన్నారు. ముఖ్యంగా పత్తి విత్తన రైతులకు ఇచ్చే అడ్వాన్సుకు కూడా ఇంటరెస్ట్ తీసుకుంటూ భూములు రాయించుకుంటున్నారని రైతు కమిషన్ సభ్యులకు తెలిపారు. 

జిల్లా కలెక్టర్లు, వ్యవసాయాధికారులు రైతుల పక్షాన నిలవటం లేదని కవిత విమర్శించారు. చట్టంలో ఉన్న లోటు పాట్లను సరిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. 

చాలా మంది సీడ్ పండిస్తున్న రైతులు మన రాష్ట్రంలో ఉన్నందున మంచి సీడ్ చట్టం రావాల్సి ఉందన్నారు. రైతు కమిషన్ ఛైర్మన్ గా సీడ్ పండించే రైతులకు మంచి జరిగేలా చూడాలని కోదండరెడ్డిని కోరారు. 

Kavitha demands justice for seed cotton farmers in Telangana

కరీంనగర్ లో వరి విత్తనాలు పండిస్తున్న రైతులకు ఎకరానికి రూ.75 వేలు ఇస్తున్నారని కవిత తెలిపారు. కానీ గద్వాల్ లో విత్తన పత్తి పండించే రైతులకు అడ్వాన్స్, పెస్టిసైడ్స్ కు ఇచ్చే డబ్బులకు కూడా భూమి తనఖా పెట్టించుకుంటున్నారని ఆరోపించారు. పైగా 250 గ్రాముల తరుగు కూడా తీస్తున్నారని తెలిపారు. కరీంనగర్ లో వరి సీడ్ పండించే రైతులకు ప్రొక్యూర్ చేసిన తర్వాత మిగిలిన వాటిని కమర్షియల్ గా అమ్ముకునే ఫ్రీడమ్ ఉందన్నారు. కానీ గద్వాల్ లో సీడ్ పత్తి రైతులను మల్టీ లెవల్ లో మోసం చేస్తున్నారని విమర్శించారు. సీడ్ పత్తి ఆర్గనైజర్స్, మీడియేటర్లు రైతులను పట్టి పీడిస్తున్నారని కవిత చెప్పారు. ఎకరానికి ఎంత ఇస్తారో చెప్పిన తర్వాత పంట వచ్చినా రాకపోయిన రైతులకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంట రాకపోతే రైతులు పడే మానసిక ఆందోళనను కూడా పట్టించుకోవాలని చట్టంలో ఉందని గుర్తు చేశారు. కానీ కంపెనీలు, ఆర్గనైజర్లు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గద్వాల్ జిల్లాలో పరిస్థితిని తాము ప్రత్యక్షంగా చూశామన్నారు. కరీంనగర్ లో వరికి ఎకరానికి 75 వేలు ఇచ్చినట్లే, గద్వాల్ లో రైతులకు కూడా ఇప్పించాలని కోరారు. సీడ్ ఇచ్చిన తర్వాత అది ఫెయిల్ అయితే దానికి రైతుకు సంబంధం ఉండకూడదని సూచించారు. కంపెనీ వాళ్లు ఇచ్చే సీడ్ ఫెయిల్ అయితే దానికి కంపెనీయే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. కానీ మీరు సరిగా నాటలేదంటూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. పైగా గద్వాల్ జిల్లాలో 10 వేల మంది సీడ్ పత్తి రైతులకు రూ. 2 వందల కోట్లు రావాల్సి ఉందన్నారు. రైతు కమిషన్ జోక్యం చేసుకుని రైతులకు మంచి జరిగేలా చూడాలని కవిత కోరారు. మోస్ట్ పాయిజన్ పెస్టిసైడ్స్ కూడా మన రాష్ట్రంలో బ్యాన్ కాలేదని కమిషన్ దృష్టికి తెచ్చారు. కనీసం వాటిని లిమిటెడ్ గా అమ్మేలా చర్యలు తీసుకోవాలన్నారు.