తుంగభద్రలో మన వాటాకు తూట్లు పొడుస్తున్న రేవంత్

ఆర్డీఎస్ చుట్టు కర్ణాటక చేపట్టే ప్రాజెక్టులతో మనం నీటి హక్కును కోల్పోతాం

ఆర్డీఎస్ మీద నిర్మించే ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి సీఎం వెళ్లవద్దు

-కల్వకుంట్ల కవిత

(తెలంగాణ రక్షణసేన, బంజారాహిల్స్)

కర్ణాటక  ప్రభుత్వం తుంగభద్రపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల కారణంగా తుంగభద్ర నదిలో మన వాటా హక్కును శాశ్వతంగా కోల్పోతామని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి చంద్రబాబు, డీకే శివకుమార్ లను కూర్చొబెట్టుకోని మన రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాడని విమర్శించారు. సీఎం కర్నాటక పర్యటన నేపథ్యంలో గురువారం కవిత ప్రత్యేక వీడియో విడుదల చేశారు. వాస్తవానికి కర్ణాటకకు ఆర్డీఎస్ లో 1.20 వాటా నీళ్లు మాత్రమే ఉన్నాయని, కానీ 10 టీఎంసీల నీళ్లు వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నదని చెప్పారు. తెలంగాణ సాధించుకొని 12 ఏళ్లు గడిచినా కూడా మనం పూర్తిస్థాయిలో కృష్ణా, తుంగభద్రలో మన నీటిని వాడుకోలేదని చెప్పారు. ఆర్డీఎస్ ప్రాజెక్ట్ నడిగడ్డను బతికించి…ఉమ్మడి మహబూబ్ నగర్ కు ఉపయోగపడే ప్రాజెక్టని తెలిపారు. ఆర్డీఎస్ లో మనకు 16 టీఎంసీల వాటా ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో గానీ తెలంగాణ వచ్చిన తర్వాత గానీ 6 టీఎంసీల కన్నా ఎక్కువ వాడుకోలేదని వివరించారు. మన నీటిని పూర్తిస్థాయిలో వాడుకునేందుకు ఆర్డీఎస్ చుట్టుపక్కల రిజర్వాయర్లను బలోపేతం చేయాల్సి ఉందన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆనాడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ సర్కార్ దాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. దీంతో నడిగడ్డకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతూనే ఉందని తెలిపారు. మనకు ఆర్డీఎస్ లో 16 టీఎంసీలు వచ్చినట్లే ఏపీకి సుంకేశుల నుంచి 16 టీఎంసీల వాటా ఉందని కవిత చెప్పారు. కానీ వాళ్లు దాన్ని 32 టీఎంసీలు చేసుకోని విచ్చలవిడిగా నీటిని వాడుకుంటున్నారని వివరించారు. మనం మాత్రం ఆ పనిచేయలేదన్నారు. మనం మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టులు కట్టుకునే లోపే కర్ణాటక తుంగభద్ర మీద మూడు ప్రాజెక్టులు కడుతున్నదని వెల్లడించారు. కురిడి, కల్పగల్ గ్రామాల్లో 2 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లు నిర్మిస్తున్నదని చెప్పారు. ఆర్డీఎస్ కు 15 కి.మీ.ల ఎగువన చిక్కాలపర్వి వద్ద 2.50 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బ్యారేజీ నిర్మిస్తున్నదని వివరించారు. ఆర్డీఎస్ కు  దిగువన రాయచూరు జిల్లాలోని చిక్కమంచాల సమీపంలో 5 టీఎంసీల కెపాసిటీతో మరో బ్యారేజి నిర్మిస్తున్నదని తెలిపారు. 

నడిగడ్డకు గుదిబండ

మొత్తంగా ఆర్డీఎస్ కు ఎగువన, దిగువన కలిపి 10 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా కర్ణాటక ప్రాజెక్టులు చేపడుతున్దినదని కవిత వివరించారు. అందుకే ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి వెళ్లొద్దని.. బదులుగా ప్రొటెస్ట్ రూపంలో ఒక లేఖ రాయాలని సూచించారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీ గానీ, రేవంత్ రెడ్డి గాని అధికారంలోకి రారని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రక్షణసేన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశంపై చర్యలు తీసుకుంటే మీ ముఖ్యమంత్రే మా ప్రాజెక్ట్ లకు అంగీకారం తెలిపారని కర్ణాటక వాదిస్తుందని చెప్పారు. సీఎం రేవంత్ చేసే ఈ పని నడిగడ్డ ప్రజలకు అతిపెద్ద గుదిబండగా మారుతుందని హెచ్చరించారు. అందుకే సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గరకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని సూచించారు. అందరం కలిసి కేంద్రంతో మన నీటి వాటా హక్కుల కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు. కృష్ణా, తుంగభద్రలో మన వాటాను కాపాడుకుందామన్నారు. రాష్ట్రానికి శాశ్వతంగా తాగు, సాగు నీరు వచ్చేలా చేసుకుందామన్నారు. ఉమ్మడి మహబాబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాను కాపాడుకోవాలంటే సీఎం ఆ కార్యక్రమానికి వెళ్లవద్దని చెప్పారు. ఒకవేళ వెళితే అదే స్టేజీ మీద బనకచర్ల కట్టమని ఏపీ సీఎంతో చెప్పించండని కవిత సూచించారు. ఈ మూడు ప్రాజెక్టులు రద్దు చేసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రితో చెప్పించాలని కోరారు. అంతేగానీ తెలంగాణ నీటి హక్కును కోల్పోయే ప్రమాదకరమైన పనికి మద్దతివ్వవద్దని కవిత హెచ్చరించారు.