సీఎం రాజీనామా చేయాలి
-టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు
(షాబాద్, రంగారెడ్డి జిల్లా)
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల పరిధిలో జరిగిన దారుణ హత్యల ఘటనకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ రక్షణ సేన డిమాండ్ చేసింది. పార్టీ రాష్ట్ర నాయకులు నరేష్ ప్రజాపతి, పడాల మనోజ గౌడ్ శనివారం చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ ను కలిసి తెలంగాణ రక్షణ సేన తరఫున వినతిపత్రం అందజేశారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా వేగవంతమైన దర్యాప్తు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. పోక్సో కేసులో నిందితుడు రాజ్ కుమార్ బెయిల్ పై వచ్చి బాధితులపై దాడి చేయడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని వెల్లడిస్తున్నదని పేర్కొన్నారు. బాధితులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పోక్సో కేసు పెట్టిందన్న కోపంతో బాధితురాలితో పాటు వారి కుటుంబ సభ్యులను, తన సొంత కుటుంబ సభ్యులను కూడా హతమార్చడం చాలా విచారించదగ్గ విషయమన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి న్యాయం జరిగేలా చూడాలని టీఆక్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. నిందితున్ని తక్షణమే అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ముస్తఫా, లావణ్య బండారి, శివశంకర్, నవీన్, అన్వర్ ఖాన్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.








