జూన్ 2 లోపు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి

ఉద్యమకారుల గుర్తింపు కమిటీ అనేది కాలయాపన కోసమే వేసిందే

కవిత ఒత్తిడితోనే ఆ మాత్రమైనా ప్రభుత్వంలో చలనం వచ్చింది

కమిటీలో ఒక్క మహిళకు కూడా స్థానం కల్పించకపోవటం మహిళలను అవమానించటమే

అది కాంగ్రెస్ కమిటీయే తప్ప ఉద్యకారుల కమిటీ కాదు – టీఆర్ఎస్ నేత మనోజ గౌడ్

(హైదరాబాద్) :

కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుల గుర్తింపు కోసం వేసిన కమిటీ కేవలం కాలయాపన కోసమేనని తెలంగాణ రక్షణ సేన నాయకులు మనోజ గౌడ్ అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతగాక కమిటీ పేరుతో టైమ్ పాస్ చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. శనివారం బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అన్ని హామీలను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 లోపు అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమకారులతో కలిసి తెలంగాణ రక్షణ సేన పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు. ఇచ్చిన హామీలు అమలు చేయటం చేతగాకనే కమిటీ పేరుతో డ్రామాలు చేస్తున్నారన్నారు.

కవిత ఒత్తిడితోనే కమిటీ

ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మొదటి నుంచి పోరాటం చేస్తున్నారని మనోజ గుర్తు చేశారు. పెద్ద ఎత్తున ఉద్యమకారులను కలవటంతో పాటు వారికోసం భూపోరాటలు కూడా చేశారని చెప్పారు. జూన్ 2 లోపు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కవిత గారు ఇచ్చిన అల్టిమేటంతోనే ప్రభుత్వం కమిటీ వేసిందన్నారు. ఐతే ఈ కమిటీ లో మహిళలకు గానీ కాంగ్రెసేతర ఇతర ఉద్యమకారులకు గానీ స్థానం కల్పించకపోవటం దుర్మార్గమన్నారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహిళలను రేవంత్ అవమానించాడన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ కమిటీయే తప్ప నిజంగా ఉద్యమకారుల గుర్తింపు కోసం వేసిన కమిటీ కాదని విమర్శించారు. ఈ కమిటీ పేరుతో సమయం వృథా చేయకుండా ఉద్యమకారులకు ఇస్తామన్న పెన్షన్లు, గుర్తింపు కార్డులు, స్థలానికి సంబంధించి జూన్ 2 ప్రకటన చేయాలని మనోజ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో టీఆర్ఎస్ మహిళ నేతలు అనిత చౌదరి, గీతా గౌడ్, స్వప్న పాల్గొన్నారు.