బీఆర్ఎస్ వెన్నులో వణుకు పుట్టించిన టీఆర్ఎస్

తెలంగాణ అస్తిత్వాన్ని గాలికొదిలేసినోళ్లా ఒరిజినల్ గురించి మాట్లాడేది

ఆ పార్టీ ముమ్మాటికీ సోషల్ మీడియా పార్టీనే

కవితనే టీఆర్ఎస్ కు నిజమైన హక్కుదారు.. ఆమె లేకుంటే 2009లో కేసీఆర్ ఎంపీగానే గెలిచేవారు కాదు.. తెలంగాణ వచ్చేది కాదు

బీఆర్ఎస్ నాయకులకు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుల కౌంటర్

(హైదరాబాద్) :

తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) ఏర్పాటుతో బీఆర్ఎస్ నాయకుల వెన్నులో వణుకు పుట్టించిందని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. కవిత ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ తో ఆ పార్టీ నాయకులు మతి తప్పి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆదివారం టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎల్. రూప్ సింగ్, రంగు నవీన్ ఆచారి, సయ్యద్ ఇస్మాయిల్, గొంగళ్ల రంజిత్ కుమార్, మంచాల వరలక్ష్మీ, నరేశ్ ప్రజాపతి మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ పేరుతో కవిత పార్టీ పేరు ప్రకటించగానే బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఒరిజినల్, డూప్లికేట్ అంటూ చేసిన పోస్టులు పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్ కు కవితక్కే హక్కుదారు : నవీన్ ఆచారి

టీఆర్ఎస్ కు నిజమైన హక్కుదారు కవితక్కనే అని రంగు నవీన్ ఆచారి అన్నారు. బీఆర్ఎస్ వదిలేసిన తెలంగాణవాదాన్ని కవిత భుజాన ఎత్తుకున్నారని గుర్తు చేశారు. అధికారం వచ్చిన వెంటనే తెలంగాణవాదాన్ని, ఉద్యమకారులను వదిలేసిన చరిత్ర మీది కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సభలకు జనాన్ని సమీకరించిన వ్యక్తులను కొట్టి చంపించిన కడియం శ్రీహరిని పార్టీలోకి తెచ్చుకొని ఉప ముఖ్యమంత్రిని చేసింది మీరు కాదా అని నిలదీశారు. తెలంగాణవాదులను లాఠీలతో కొట్టించిన వారికి మంత్రి పదవులు ఇచ్చిన మీరా తెలంగాణ వాదం గురించి మాట్లాడేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాలు, తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ విగ్రహం పెట్టేందుకు ఏమీ ఇబ్బంది వచ్చిందంటూ బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. మీ పార్టీ కోసం తెలంగాణవాదాన్ని చంపేసిన మీరా ఒరిజినల్ అని మాట్లాడేది అంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణవాదులు, అస్తిత్వాన్ని అవమానించినందుకు బీఆర్ఎస్ నేతలు సిగ్గుపడాలన్నారు. 

తెలంగాణవాదం లేదని చెప్పిన జీవన్ రెడ్డిని పార్టీలోకి తెచ్చుకొని ఏం సంకేతం ఇస్తున్నారని ప్రశ్నించారు. తమది నక్సలైట్ల ఆర్థిక విధానానికి దగ్గరి విధానం అని చెప్పి.. అధికారంలోకి వచ్చిన తర్వాత నవ యువకులు శృతి, సాగర్ లను నక్సలైట్ల పేరుతో చంపింది నిజం కాదా అని ప్రశ్నించారు. సిద్ధాంతం వేరైతే మన పిల్లలని కూడా చూడకుండా చంపేస్తారా అని విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉండి ట్యాంక్ బండ్ పై తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేయలేకపోయారని అన్నారు. స్థలం కేటాయిస్తే జాగృతి నుంచి తామే విగ్రహం ఏర్పాటు చేయిస్తామని ప్రతిపాదనలు ఇచ్చినా ఆ రోజు పట్టించుకోలేదన్నారు. అధికారికంగా ఒక్కటంటే ఒక్క తెలంగాణతల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయలేని వాళ్లు ఒరిజినల్ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని, అమరుల ఆశయాలను కాపాడే గొప్ప అడ్మినిస్ట్రేషన్ ను కవిత ప్రజల ముందుకు తీసుకువస్తారని తెలిపారు. 

TRS leaders speak at Telangana Jagruthi office in Hyderabad targeting BRS over Telangana identity debate

బీఆర్ఎస్ నాయకులకు బుద్ది చెప్తాం : రూప్ సింగ్

టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారినప్పుడే తెలంగాణ సమాజం మిమ్మల్ని తిరస్కరించిందని తెలంగాణ రాష్ట్ర సేన నాయకులు రూప్ సింగ్ అన్నారు. పెయిడ్ బ్యాచ్ ద్వారా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయాలని చూస్తే తగిన బుద్ది చెబుతామని బీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు.

K. Kavitha backed by TRS leaders amid political clash with BRS in Telangana

తెలంగాణవాదంపై హక్కు ఏనాడో కోల్పోయారు : గొంగళ్ల రంజిత్ కుమార్

తెలంగాణ అస్తిత్వ పొరను వదిలేసి.. బీటీ బ్యాచ్ ను పోగు చేసిందే బీఆర్ఎస్ నేతలని తెలంగాణ రాష్ట్ర సేన నాయకులు గొంగళ్ల రంజిత్ కుమార్ విమర్శించారు. తెలంగాణ మీద ఏనాడో హక్కు కోల్పోయిన మీకు ఒరిజినల్ అంటూ మాట్లాడే హక్కు లేదన్నారు. అసలు తెలంగాణ ఉద్యమంలో కవిత పాత్ర ఏంటో తెలియక కొంతమంది పిల్ల బచ్చాలు సోషల్ మీడియాలో పేట్రేగిపోతున్నారని మండిపడ్డారు. 2009లో మహబూబ్ నగర్ ఎంపీగా కేసీఆర్ ను గెలిచేందుకు కవితక్కనే కారణమన్న విషయం మీ అధినాయకుడిని అడిగి తెలుసుకోవాలన్నారు. కేసీఆర్ సచ్చుడో – తెలంగాణ వచ్చుడో అని శపథం చేసి నెలన్నరకు పైగా ఢిల్లీలో కేసీఆర్ ఇంటికి పరిమితమైనప్పుడు కవితక్క ఆస్కార్ ఫెర్నాండేజ్ తో మాట్లాడి సోనియాగాంధీ అపాయింట్‌మెంట్ ఇప్పిచ్చారని గుర్తు చేశారు. ఆ మీటింగ్ ఏర్పాటు చేయించి ఉండకపోతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పరిస్థితి ఏమిటో ఉద్యమ నాయకుడిని అడిగి తెలుసుకోవాలన్నారు. బీఆర్ఎస్ ముమ్మాటికీ సోషల్ మీడియా పార్టీనే.. ఆ పార్టీ నాయకులు ఇప్పుడే ఇంత ఆగమైతే ముందుంది వాళ్ల పరిస్థితి ఏమిటో అర్థమవుతుందన్నారు. దెబ్బ తిన్న పులి గర్జన ఏ విధంగా ఉంటుందో ముందు ముందు తెలుస్తుందని హెచ్చరించారు.

Press meet in Hyderabad where TRS leaders respond to BRS controversy over original party claims

ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి ఇంకో లెక్క : సయ్యద్ ఇస్మాయిల్

తెలంగాణవాదం ఎత్తుకొని టీఆర్ఎస్ పేరుతో కవిత ప్రజల ముందుకు రావడాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారని తెలంగాణ రాష్ట్ర సేన నాయకులు సయ్యద్ ఇస్మాయిల్ అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసం కొత్త ప్రయత్నం మొదలైందని అన్నారు. ఇది తట్టుకోలేక తమ అనుచరగణంతో విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సోషల్ మీడియా పునాదులపై నిర్మించుకున్న భవనాలు ఇక నేలకూలటం తథ్యమని చెప్పారు. ఇక నుంచి తెలంగాణవాదంపై, కవితపై ట్రోల్స్ చేయాలంటే ఒళ్లు దగ్గరపెట్టుకోవాల్సిన పరిస్థితి తీసుకొస్తామని హెచ్చరించారు. ఇప్పటి వరకు ఒక లెక్క. ఇక నుంచి మరో లెక్క ఉంటుందన్నారు.

Telangana political tension as TRS leaders defend Kavitha and attack BRS leadership

తెలంగాణ వ్యతిరేకి కవిత గురించి మాట్లాడటమా? : మంచాల వరలక్ష్మీ

టీఆర్ఎస్ ఆవిర్భావాన్ని జీవన్ రెడ్డి విమర్శించటం హాస్యస్పదంగా ఉందని తెలంగాణ రాష్ట్ర సేన నాయకురాలు మంచాల వరలక్ష్మి అన్నారు. గతంలో కేసీఆర్ పై  అవాకులు, చెవాకులు పేలిన జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ తమ పార్టీలోకి చేర్చుకొని ఒరిజినల్, డూప్లికేట్ అని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. తెలంగాణ గాలికి వదిలేసి పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చుకున్నోళ్లకు.. తెలంగాణ ఆత్మను ఆవిష్కరించేందుకు కొత్త పార్టీతో ముందుకు వస్తున్న కవితకు పోలికే లేదన్నారు. ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచిన వారిని నడిరోడ్డు మీదకు వదిలేసిన మీకు ఒరిజినల్ అని మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. తన తండ్రిపై కవిత విమర్శలు చేసిందని మాట్లాడుతున్న వారు మారిన కేసీఆర్ గురించి మాట్లాడరనే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. 

Telangana political tension as TRS leaders defend Kavitha and attack BRS leadership

మీది టీఆర్ఎస్సా, బీఆర్ఎస్సా? : నరేశ్ ప్రజాపతి

అసలు మీరు టీఆర్ఎస్సా, బీఆర్ఎస్సా ముందు చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సేన నాయకులు నరేష్ ప్రజాపతి ప్రశ్నించారు. కేటీఆర్ ఇన్ స్టా అకౌంట్ లో టీఆర్ఎస్ అని, ట్విట్టర్ అకౌంట్ లో బీఆర్ఎస్ అని పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. తమ పార్టీ ఏంటో వారికే క్లారిటీ లేదని విమర్శించారు. తాము టీఆర్ఎస్ అనే పేరుతో పార్టీ పెడతామని తెలిసి మళ్లీ తమ పార్టీ పేరును టీఆర్ఎస్ గా మార్చుతామని చెప్పింది మీరు కాదా అని ప్రశ్నించారు. అమరుల కుటుంబాలను, ఉద్యమకారులను, తెలంగాణ ప్రజలను మోసం చేసిన మీరా ఒరిజినల్ అంటూ మాట్లాడేది అని విమర్శించారు. ఇక నుంచి తెలంగాణ వాదం, తెలంగాణ అస్తిత్వాన్ని రక్షించేది కవితక్క అని స్పష్టం చేశారు.