వివేకా ఖబడ్దార్..
టీఆర్ఎస్ నేతల అల్టిమేటమ్
(బంజారాహిల్స్ – తెలంగాణ రక్షణ సేన కార్యాలయం)
కల్వకుంట్ల కవితను చూస్తేనే బీఆర్ఎస్ కు వణుకు పుడుతోందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) నేతలు ఎద్దెవా చేశారు. కవిత గురించి బీఆర్ఎస్ నాయకులు కేపీ వివేకానంద మాట్లాడుతుంటే నవ్వొస్తోందన్నారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ 2009 లో మహాకూటమి నుంచి పోటీ చేసి ఓడిపోయాక.. చంద్రబాబు సంకలో చొచ్చిన వ్యక్తి వివేకానంద అని గుర్తు చేశారు. నీ నియోజకవర్గంలో ఎంత మంది ఉద్యమకారులకు అవకాశం కల్పించావో చెప్పాలని ప్రశ్నించారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంత మంది తెలంగాణ ఉద్యమకారులకు అవకాశం కల్పించావో చెప్పాలన్నారు.
గండి మైసమ్మ దగ్గర నిర్మించిన అమరుల స్థూపాన్ని ఇప్పటి వరకు ఎందుకు ఓపెన్ చేయలేదో స్పష్టం చేయాలన్నారు.
కవిత గురించి మట్లాడే నైతిక అర్హత లేదన్నారు. కొంపల్లి, సుచిత్ర, బాచుపల్లి, జీడిమెట్ల, భావురంపేటలో విలువైన కోట్లాది భూములు వివేకానంద ఆక్రమించుకున్నాడని శ్రీకాంత్ ఆరోపించారు. కేటీఆర్, హరీష్ రావు లకు బినామీగా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. ఎంతో మంది పేద, మద్య తరగతి వాళ్ల భూములు కొల్లగొట్టాడని దుయ్యబట్టారు. కవిత రాజకీయాలకు పనికిరారనడం తగదన్నారు. ఆమె ప్రజల్లోంచి వచ్చిన నాయకురాలని,
మీ మాదిరిగా విషం కక్కే రాజకీయాలు చేయరని శ్రీకాంత్ గౌడ్ స్పష్టం చేశారు. నీ వెనుక ఉన్న గుంటనక్కలు ఆడించినట్లు ఆడితే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు.
మీ నాయకుడు ప్రజల్లోకి రాడు.. బీఆర్ఎస్ పని, మీ నాయకుడి పని అయిపోయిందని తేల్చి చెప్పారు. ప్రజల సమస్యలపై అసెంబ్లీలో పోరాటం చేయాల్సిన మీ నాయకుడు ఎక్కడ ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు.
అసెంబ్లీకి రాని వ్యక్తి గురించి ప్రశ్నించవద్దా అని అడిగారు.
అసలు మీ పార్టీ నాయకులు ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. వెలుగుమట్లలో 750 మంది ఇళ్లను కూల్చుతుంటే మీ పార్టీ ఎక్కడ పన్నదన్నారు.
వికారాబాద్ వద్ద 1200 ఎకరాలు అసైన్డ్ భూములను ఆక్రమించుకుంటే మీ పార్టీ ఎక్కడుందని వివేకానందను నిలదీశారు. ప్రజా పోరాటాలు మరచిన బీఆర్ఎస్
కేవలం ట్విట్టర్, ఫొటోలకే పరిమితమవుతున్నారని విమర్శించారు. 26 ఏళ్ల మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఓ మూలకు చిన్న గదిలో పిడికెడు మందితో చేసుకున్నప్పుడే బీఆర్ఎస్ ఉనికి ఏంటో అర్థమైందని శ్రీకాంత్ గౌడ్ ఎద్దెవా చేశారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే తెలంగాణ రక్షణ సేన ధిక్కార స్వరాలమవుతుందన్నారు. కాళోజీ, దాశరథి, సమ్మక్క, సారలమ్మ, రాణి రుద్రమ్మ స్పూర్తితో ముందుకు కెళ్తామని చెప్పారు. వచ్చే రెండున్నరేళ్లు ప్రజాక్షేత్రంలో తిరిగి బీఆర్ఎస్ నేతల అరాచకాలను ప్రజలకు తెలుపుతామన్నారు. కచ్చితంగా అధికారంలోకి వచ్చి పాంచజన్యం హామీలను అమలు చేస్తామని శ్రీకాంత్ గౌడ్ స్పష్టం చేశారు.
ఏడిస్తే టికెట్ ఇప్పించాం: ఎత్తరి మారయ్య
ఎమ్మెల్యే కేపీ వివేకానందకు టీఆర్ఎస్ అధినేత్రి కవితను విమర్శించే స్థాయి లేదని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎత్తరి మారయ్య అన్నారు. ఎప్పుడైతే కవితను విమర్శించావో అప్పటి నుంచే నీకు కౌంట్ డౌన్ మొదలైందని వివేక్ ను హెచ్చరించారు. కుత్బుల్లాపూర్ లో వందలాది మంది ఉద్యమకారులుంటే ఒక్కరికైనా అవకాశం ఇచ్చావా అని ప్రశ్నించారు. మీ కుటుంబ సభ్యులు, అనుచరులకే అన్ని దోచి పెట్టావని విమర్శించారు. తన సొంత మనుషులను కూడా కాంగ్రెస్ పార్టీలోకి పంపిన వివేకానంద కవితకు వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేక ఇష్టానుసారం మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. నువ్వు విద్యావంతుడివైతే మీ జ్ఞానం ఎక్కడ పోయిందని, అజ్ఞానంతో ఎందుకు మాట్లాడుతున్నావని ప్రశ్నించారు. మూడుసార్లు ఎమ్మెల్యే అయితే ప్రజలకు ఏం చేశాడని, ఇక మళ్లీ గెలిచే అవకాశమే లేదన్నారు. మొన్నటి ఎన్నికల్లో టికెట్ రాదని తెలిసి బాధపడితే తామే టికెట్ ఇప్పించి గెలిపించుకున్న విషయం మర్చిపోయావా అంటూ ప్రశ్నించారు. ఇంకొకసారి కవిత మీద మాట్లాడితే ఊరుకోం ఖబడ్దార్ అంటూ మారయ్య హెచ్చరించారు.








