స్వర్ణకారులతో సమావేశం, వృత్తిని కాపాడాలంటూ పిలుపు | (భువనగిరి)
నాకు దేవుడు అవకాశం ఇస్తే పుస్తె మెట్టెలు స్వర్ణకారుల నుంచే కొనాలి అనే ఫైల్ పై మొదటి సంతకం పెడతానంటూ ప్రకటించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. వృత్తిపనిపై ఆధారపడి జీవిస్తున్న వారిని ఆదుకుంటామని చెప్పారు. భువనగిరి స్వర్ణకారవీధిలో స్వర్ణకారులతో బుధవారం సమావేశమైన కవిత వృత్తిపరంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.



రాష్ట్ర సాధనలో స్వర్ణకారులది ముఖ్యపాత్ర
” స్వర్ణకారుల సమస్యలన్నీ నాకు తెలుసు. భవిష్యత్ లో ఆ దేవుడు నాకు అవకాశం ఇస్తే ఎవ్వరైనా స్వర్ణకారుల నుంచే పుస్తె మట్టెలు కొనుగోలు చేసే ఫైల్ పై మొదటి సంతకం చేస్తా. స్వర్ణకారులకు, ఆడబిడ్డలకు కూడా బంగారం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఊళ్లల్లో పెరిగిన వాతావారణం నాకు గుర్తు ఉంది. ముక్కు పుడక చేయించాలన్నా మా నాన్నమ్మ చాలా సెంటిమెంటుగా స్వర్ణకారులను పిలిచేది. వాళ్లను గౌరవించి, మర్యాద చేసిన తర్వాతే ఆభరణాలు చేయించేది. స్వర్ణకారులు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. ఒక్క మాట అంటే కూడా పడరు.
వారి మనసు కూడా నిజంగా బంగారమే. తెలంగాణ సాధనలో కేసీఆర్ గారు తర్వాత జయశంకర్ గారే ముందుంటారు. కేసీఆర్ సార్, జయశంకర్ సార్ జోడి తెలంగాణ కోసం ఎలా పనిచేసిందో మనకు తెలుసు.
తెలంగాణ వచ్చాక బీసీల కోసం పనిచేస్తా అని జయశంకర్ సార్ చెప్పే వారు. అదే విధంగా నన్ను చాలా కష్టపడుతున్నావని మెచ్చుకునే వారు. కేసీఆర్ కూతురువు కనుక నీ కష్టాన్ని ఎవరు గుర్తించరని కూడా చెప్పేవారు.
అయినా సరే తెలంగాణ సంస్కృతి కాపాడటం కోసం పనిచేయాలని సూచించే వారు. డబ్బులు పోయినా, ఇంకేదైనా వస్తువు పోయినా సంపాదించుకోవచ్చు.
కానీ సంస్కృతి పోతే మాత్రం మళ్లీ సాధించుకోలేమని సార్ నాతో చెప్పేవారు. అందుకే మేము జాగృతిలో ఎప్పుడు కూడా జయశంకర్ సార్ ఫొటోనే పెట్టుకుంటాం. కానీ తమ్ముడు శ్రీకాంతాచారి తెలంగాణ కోసం అమరులవటం బాధాకరం. తెలంగాణ జాగృతిగా ఆత్మబలిదానాలు వద్దనే మేము కోరుకునే వాళ్లం. కచ్చితంగా పోరాడి మాత్రమే లక్ష్యాన్ని సాధించాలని భావించే వాళ్లం. కానీ శ్రీకాంతా చారి బలిదానం కారణంగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడింది.
రాష్ట్రం రావటంలో స్వర్ణకారులదే కీలక పాత్రగా ఉంది.”











