పెద్ద రైస్ మిల్లర్లతో ప్రభుత్వం, ప్రతిపక్షాలు కుమ్మక్కు

చిన్న రైస్ మిల్లర్లపై కేసులు పెడుతూ ఇబ్బంది పెడుతున్నారు

చిన్న రైస్ మిల్లర్లకు మేము అండగా ఉంటాం

-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

కవితతో రా రైస్ మిల్లర్ల భేటీ

(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్)

పెద్ద రైస్ మిల్లర్లతో ప్రభుత్వం కుమ్మక్కై చిన్న మిల్లర్లను ఇబ్బంది పెడుతున్నదని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. చిత్రంగా ప్రతిపక్షాలు కూడా పెద్ద రైస్ మిల్లర్లకే వంతపాడుతూ ప్రభుత్వంతో చేతులు కలిపిందని విమర్శించారు. బుధవారం హైదరాబాద్ లో కవితతో రా రైస్ మిల్లర్లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 

రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనకుండా ఇన్నాళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టిందని దుయ్యబట్టారు. 8 నుంచి 10 కిలోలు తరుగు పేరుతో రైతుల రక్త కన్నీరు కళ్ల చూసిందని మండిపడ్డారు. దాదాపు రూ.2 వేల కోట్లు అక్రమాలు చేశారని వెల్లడించారు. 

ఇప్పుడు మళ్లీ చిన్న రైస్ మిల్లర్లపై పడి వాళ్లను ఇబ్బంది పెడుతున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వందల కోట్లతో వ్యాపారం చేసే బాయిల్డ్ రైస్ మిల్లర్ల జోలికి ఈ ప్రభుత్వం వెళ్లటం లేదని చెప్పారు. వాళ్ల నుంచి దాదాపు రూ.4 వేల కోట్లు ప్రభుత్వానికి రావల్సి ఉన్నప్పటికీ వారిని ఏమీ అనటం లేదని తెలిపారు. కానీ రూ.10 లక్షల నుంచి కోటి రూపాయలు బకాయి ఉన్న చిన్న రైస్ మిల్లర్లను దొంగలను చూసినట్లు చూస్తున్నారని తప్పు పట్టారు. వారిపై ఎంక్వైరీ అంటూ కేసులు పెట్టి ముసుగులు వేసి అరెస్ట్ చేస్తున్నారన్నారు. ఈ బాధ తట్టుకోలేక కరీంనగర్ లో ఒక ఆడబిడ్డ సూసైడ్ చేసుకుందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. అయినా సరే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. 

పెద్ద మిల్లర్లతో బీఆర్ఎస్ కుమ్మక్కు

గత ప్రభుత్వం దిగిపోయే సమయంలో లక్షా 40 వేల టన్నుల దొడ్డు బియ్యం ఉండేవని, ఫిలిప్పీన్స్ కు అప్పుటి ప్రభుత్వం కిలో రూ.48 చొప్పున అమ్మిందని కవిత తెలిపారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు కిలోకు రూ. 24  అని టెండర్ పెట్టిందని విమర్శించారు. కొన్ని రోజులకే మళ్లీ రూ. 21.70 కే దాన్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. దానికి సంబంధించి కరీంనగర్ కు చెందిన ఒక రైస్ మిల్లర్ కు టెండర్ అప్పగించారని వెల్లడించారు. 

ఈ బియ్యానికి సంబంధించి కోర్టులో కేసు పెండింగులో ఉందని వివరించారు. అయినప్పటికీ 10 వేల టన్నులు ధాన్యాన్ని లిప్ట్ చేశారని తెలిపారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఏం చేస్తున్నారని, ఆయనకు సబ్జెక్ట్ అర్థం కావటానికే ఏడాది పట్టిందని కవిత తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పిల్లలను విపరీతంగా కొట్టిన ఆయన ఇప్పుడు మాత్రం చేతులు కట్టుకుని చూస్తున్నారన్నారు. ప్రభుత్వం చర్య కారణంగా గోడౌన్ల రెంట్, ఇంట్రెస్ట్ రూపంలో మిల్లర్లు చాలా నష్టపోయారని వివరించారు. పెద్ద మిల్లర్లకు ఇచ్చిన ఆ బియ్యం టెండర్ ను చిన్న రైస్ మిల్లర్లకు అదే రూ. 21.70 లకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెద్ద రైస్ మిల్లర్లతో కేటీఆర్, హరీశ్ రావు కుమ్మక్కై మాట్లాడటం లేదని విమర్శించారు. కానీ తాము మాత్రం చిన్న రైస్ మిల్లర్ల తరఫునే మాట్లాడతామని కవిత స్పష్టం చేశారు. 

వన్ టైం సెటిల్ మెంట్

చిన్న రైస్ మిల్లర్లకు వన్ టైమ్ సెటిల్ మెంట్ ఇవ్వాలని కల్వకుంట్ల కవిత కోరారు. మొత్తం పీడీఎస్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. పెద్ద మిల్లర్లే మంత్రుల కార్లలో తిరుగుతుంటే ఏం సందేశం ఇస్తున్నట్టన్నారు. పెద్ద రైస్ మిల్లర్ల మిల్లులో నాలుగు సీజన్లకు సరిపడా ధాన్యం ఉండాలని సూచించారు. దాదాపు 15 లక్షల టన్నుల ధాన్యానికి బదులుగా 5 లక్షల టన్నులు మాత్రమే ఉందన్నారు. ఏ రైస్ మిల్లుకు వెళ్లి చెక్ చేసినా ఇలాంటి ఎన్నో అక్రమాలు వెలుగు చూస్తాయన్నారు. కానీ చిన్న రైస్ మిల్లర్లపై కేసులు పెడుతున్నారని, ఒక చిన్న రైస్ మిల్లు పెట్టుకున్న దళిత మిల్లర్ పై పీడీ యాక్ట్ పెట్టారని తెలిపారు. నిజామాబాద్ లో కూడా ఓ పెద్ద రైస్ మిల్లర్ ఇలాగే అక్రమాలు చేస్తున్నాడని ఆరోపించారు. వాళ్లను వదిలి చిన్న రైస్ మిల్లర్లపై కేసు పెట్టటం సరికాదన్నారు. ఇప్పుడు ఉన్న రైస్ ను ఫిలిప్పీన్స్ కు పంపించాలని సూచించారు. పీడీఎస్ వ్యవస్థను బాగు చేసి… ప్రజలకు మంచి బియ్యం ఇవ్వాలని కవిత కోరారు.