ఆమన్ గల్ లో జనంబాట | (ఆమన్ గల్)

నాగర్ కర్నూల్ జిల్లా అమన్ గల్  గుర్రగుట్టం కమల్ నగర్ లో డంపింగ్ యార్డును తక్షణమే మరోచోటకు తరలించాలని 

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. డంప్ యార్డు దుర్వాసన కారణంగా స్థానికులు రోగాల బారిన పడుతున్నారని చెప్పారు. జాగృతి జనంబాటలో భాగంగా కవిత నాగర్ కర్నూల్ జిల్లాలో రెండో రోజు పర్యటన ప్రారంభించడానికి ముందు మైసిగండి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమన్ గల్ పట్టణంలోని డంపింగ్ యార్డును ఆమె పరిశీలించారు.  ఈసందర్భంగా కవిత మాట్లాడుతూ  జనావాసాల్లో పెద్ద డంపింగ్ యార్డును ఎలా పెడ్తారని ప్రశ్నించారు. దీన్ని తీసేయాలని ఆరేళ్లుగా ప్రజలు ధర్నాలు చేస్తూ దరఖాస్తులు ఇస్తున్నా పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఈ డంపింగ్ యార్డ్ కారణంగా ప్రజలు ఆరోగ్య పరంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇటీవలే ఒక బాలింత కూడా చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ప్లాస్టిక్ గుట్టలుగా పేరుకుపోయిందని, పర్యావరణం మీద ధ్యాస లేకుండా రోజూ చెత్తను కాల్చడం వల్ల విషవాయువులు ప్రబలి ప్రజలకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇక్కడి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఈ డంపింగ్ యార్డ్ సమస్యపై శ్రద్ధ పెట్టాలని కోరారు. అధికారులకు అప్లికేషన్ ఇచ్చినప్పటికీ వాళ్లు కనీసం పట్టించుకోవటం లేదని చెప్పారు. ఇక్కడికి 8 కిలోమీటర్ల దూరంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు కోసం రూ.1.20కోట్లు కూడా మంజూరు చేశారని కవిత వెల్లడించారు. చెత్తశాఖ మంత్రి ముఖ్యమంత్రే కనుక ఆయనను డిమాండ్ చేసో కమాండ్ చేసో ఈ సమస్య పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. జాగృతి జనంబాట ఫిబ్రవరిలో పూర్తి అవుతుందని, అప్పటి వరకు ప్రభుత్వానికి సమయం ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత మేమే ఈ డంపింగ్ యార్డ్ ను క్లీన్ చేస్తామని ప్రకటించారు. లేదంటే తాము హైకోర్టుకు వెళ్లైనా సరే ఈ డంపింగ్ యార్డ్ ను తొలగిస్తామన్నారు.