గోకారం నిర్వాసితులకు జాగృతి మద్దతు



జాగృతి జనంబాటలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిండి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఎర్రవెల్లి-గోకారం నిర్వాసితుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ 1500 ఎకరాల భూములు రైతుల నుంచి సేకరించి కేవలం 2000 ఎకరాలకు నీళ్లిచ్చే పథకం అర్థరహితమని స్పష్టం చేశారు. గోకారం చెరువును అభివృద్ధి చేస్తే అంతకు మించి లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రవహిస్తున్న కృష్ణానది ద్వారా 25 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే అవకాశమున్నా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గానీ, ఇప్పటి కాంగ్రెస్ సర్కార్ గానీ దృష్టి పెట్టలేదని కవిత విమర్శించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పెండింగులో ఉన్న ప్రాజెక్ట్ లు పూర్తి చేసినా చాలా ఎకరాలకు నీళ్లు వచ్చేవన్నారు. కనీసం పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదని దుయ్యబట్టారు.



ప్రయోజనం లేని ఈ ప్రాజెక్టు కోసం ఇక్కడి ప్రజలు తమ నిరసనగా సర్పంచ్ ఎన్నికలను బాయ్ కాట్ చేసి వెల్లడించారని తెలిపారు. అయినా ఇక్కడి ఎమ్మెల్యే గానీ ప్రతిపక్షాలు గానీ స్పందించలేదు. కనీసం ఎన్నికల కమిషనర్ కూడా స్పందించకపోవటం దారుణమని విమర్శించారు. ఓటు హక్కు ఉన్న ప్రజలను పట్టించుకోలేదంటే ఎర్రవెల్లి వాసులు మనుషులు కాదా అని ప్రశ్నించారు. ఈ అంశాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వరకు తీసుకెళ్తానని హెచ్చరించారు. ఇంతకన్నా అందంగా ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిరసన తెలుపగలరా అని ప్రశ్నించారు. ఒకటి రెండు రోజుల్లో స్పందించకపోతే ఇరిగేషన్ మంత్రి, ముఖ్యమంత్రిని కూడా నిలదీద్దామని కవిత పిలుపునిచ్చారు.








