-జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి
12న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభకు పెద్ద ఎత్తున తరలిరావాలి
(హైదరాబాద్)
ఈ నెల 12న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభకు భారీ సంఖ్యలో తెలంగాణ వాదులు హాజరై విజయవంతం చేయాలని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి పిలుపునిచ్చారు. బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో నిర్వహించే ఆత్మగౌరవ సభలో పాల్గొనాలని తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారితో పాటు, అమరవీరుల కుటుంబాలకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో సోమవారం జాగృతి నాయకులు దండెం ఆనందం, పాండురంగారెడ్డి, శశిధర్, లింగం తదితరులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో సుదీర్ఘంగా కొనసాగి లక్ష్యాన్ని సాధించిన ఉద్యమం తెలంగాణ ఉద్యమమన్నారు. దేశంలో మరెన్నో ఉద్యమాలు జరిగినా అవన్నీ కూడా లక్ష్యాన్ని చేరకుండానే మధ్యలోనే ఆగిపోయాయి.. కానీ తెలంగాణ ఉద్యమం మాత్రం 1950లో నిజాం నుంచి విముక్తి కోసం మొదలై వలస పాలన అంతం వరకు అదే స్ఫూర్తితో కొనసాగిందన్నారు.
2001లో ప్రారంభమైన మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఇంటి నుంచి ప్రజలు పాలు పంచుకున్నారు.. ప్రపంచానికే ఒక మోడల్ గా నిలిచేలా తెలంగాణ ఉద్యమాన్ని చేశారన్నారు. ఎంతో మంది వీరులు తమ ప్రాణాలను బలిపెట్టారని, అమర వీరులు, ఉద్యమకారులు పరపీడన నుంచి విముక్తి కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. తెలంగాణ అంటే ఒక రాష్ట్రం మాత్రమే కాదు.. వందల మంది అమరవీరులు, ఉద్యమకారుల కృషి ఫలితమన్నారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు ఏమైనా అవకాశాలు దక్కాయా అని ప్రశ్నించారు. అమరుల కుటుంబాలకు ఆదరణ దక్కిందా అన్నది అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉందని నవీన్ ఆచారి తెలిపారు.
కుల సంఘాలు, మేధావులు, అన్ని వర్గాల వారు 12న జరిగే సమావేశంలో పాల్గొనాలని కోరారు. మరొకసారి ఉద్యమం నాటి సంగతులను పంచుకోవడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై జరిగే చర్చలో అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమకారులు, అమరవీరులు లేకుండా తెలంగాణ లేదు.. వారందరినీ గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.








