317 జీఓ సవరణ ఎప్పుడు

ఉద్యోగుల వెతలు తీర్చండి

-కల్వకుంట్ల కవిత

సీఎం కు బహిరంగ లేఖ

(హైదరాబాద్)

 జీవో 317 వల్ల కుటుంబాలకు దూరమై ఇబ్బందులకు గురవుతున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను వారి స్వస్థలాలకు బదిలీ చేస్తూ వన్ టైం రిలీఫ్ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగలేఖ రాశారు. బీఆర్ఎస్ హయాంలో నూతన జిల్లాల ఏర్పాటుతో ఉద్యోగుల బదిలీ చేపట్టారు. ఈ క్రమంలో స్థానికత నిర్ణయించడంలో తీసుకున్న ప్రామాణికత కారణంగా ఉద్యోగులు స్వంత జిల్లాలలకు దూరంగా విధులు నిర్వహించాల్సి వస్తున్నది. తాము అధికారంలోకి వచ్చాక ఈ తప్పును సవరిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా 317 జీఓ మీద ప్రభుత్వం ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఉద్యోగులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 

మీరిచ్చిన హామీయే

“తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత అప్పటికే వివిధ ఉమ్మడి జిల్లాల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సీనియారిటీ ప్రాతిపాదికన కొత్త జిల్లాల్లో పోస్టింగులు ఇచ్చారు. సీనియారిటీకి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఎనిమిదేళ్లు, అంతకన్నా తక్కువ సర్వీస్ ఉన్న ఉద్యోగులు, టీచర్లు ఆయా ఉమ్మడి జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఏదో ఒక జిల్లాకు అలాట్ అయ్యారు. ఇలా ఉద్యోగులను కొత్త జిల్లాల వారిగా సర్దుబాటు చేయడానికి తీసుకువచ్చినదే జీవో నం.317. 2021 డిసెంబర్ 6న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.317 ద్వారా వేలాది మంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే ఆ జీవోను రద్దు చేసి ఉద్యోగులకు వారి సొంత జిల్లాల్లో పోస్టింగులు ఇవ్వాలని కోరుతూ పీసీసీ అధ్యక్షుడి హోదాలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మీరు లేఖ రాసిన విషయం గుర్తు ఉండి ఉంటుందని భావిస్తున్నాం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే జీవో నం.317ను సమీక్షించి బాధిత ఉద్యోగులకు న్యాయం చేస్తామని మీరు హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ హామీని నొక్కి చెప్పారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో మీరు, ప్రస్తుత మీ మంత్రివర్గంలో ఉన్న పలువురు నాయకులు ప్రభుత్వ ఉద్యోగులను మానసిక క్షోభకు గురి చేస్తున్న జీవో నం.317 బాధితులకు న్యాయం చేస్తామని పలు సందర్భాల్లో హామీ ఇచ్చారు. జీవో నం.317 బాధితుల సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు అప్పటి సీఎస్ శాంతి కుమారి ఆధ్వర్యంలో సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ సబ్ కమిటీ నివేదిక ఏమయ్యిందో అర్థం కాని పరిస్థితి. శాంతి కుమారి కమిటీ ఇచ్చిన నివేదిక బయట పెడితే తప్ప జీవో నం.317 బాధితులు ఎంతమంది అనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. సబ్ కమిటీ తన నివేదిక సమర్పించి ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం దానిని బయట పెట్టకపోవడంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలి.”

జీవో నం.190తో లాభమేమి

“జీవో నం.317 బాధితులకు పరిష్కారం కోసమంటూ జీవో నం.243, 244, 245 జారీ చేసి మీ ప్రభుత్వం అభాసు పాలు అయ్యింది. లక్షల మంది ఉద్యోగులు మీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీ భవన్ ముట్టడికి తరలి వస్తుండటంతో వారిని బుజ్జగించడానికి జీవో నం.190ని జారీ చేశారు. అయినా జీవో నం. 317 బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయం జరగలేదు. ఇప్పటికీ వేలమంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కాంగ్రెస్ ప్రభుత్వంలోని ముఖ్యులను కలిసి తమ గోడు ఆలకించాలని వేడుకుంటున్నారు. జీవో నం.317 బాధితులు తమను స్థానికత ఆధారంగా తమ స్వస్థలాలకు ట్రాన్స్ ఫర్ చేయాలని కోరుతున్నా ఎలాంటి ఉపశమనం దక్కడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయట పడాలంటే వెంటనే మీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాంత కుమారి సబ్ కమిటీ నివేదికను బయట పెట్టాలి. జీవో నం.317 బాధితులకు వారు కోరుకున్న జిల్లాల్లో పోస్టింగులు ఇవ్వాలి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 20 వేల మందికి పైగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు రిటైర్ అయ్యారు. ఆయా ఖాళీ స్థానాల్లో నిరుద్యోగులకు ఏమాత్రం నష్టం కలుగకుండా అర్హులైన జీవో నం.317 బాధితులకు పోస్టింగులు ఇవ్వాలి. ఈమేరకు వెంటనే ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేయాలి. “

పాత నిబంధనే తేవాలి

“రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికతను గుర్తించేందుకు ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు నాలుగేళ్ల పాటు తెలంగాణలో చదువుకోవాలనే నిర్ణయం కూడా ఈ మట్టి బిడ్డలకు తీరని అన్యాయం చేసేది. గతంలో మాదిరిగా ఒకటి నుంచి పదో తరగతి వరకు ఏడేళ్ల పాటు తెలంగాణ లేదా సంబంధిత జిల్లాలో చదివితేనే స్థానికులుగా గుర్తిస్తామన్న పాత నిబంధనను మళ్లీ తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. 

తద్వారా ఎక్కువ మంది తెలంగాణ బిడ్డలకు స్థానిక కోటాలో విద్య, ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని తెలియజేస్తున్నాము. వెంటనే జీవో నం.317 బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయులకు వన్ టైం రిలీఫ్ కింద న్యాయం చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నాం. అలాగే స్థానికతను గుర్తించే నిబంధనల్లోనూ సమూల మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.”

ధన్యవాదములతో

కల్వకుంట్ల కవిత

అధ్యక్షురాలు, తెలంగాణ జాగృతి

లోక్ సభ మాజీ సభ్యురాలు