సీఎం ప్రమేయంతో జీహెచ్ఎంసీలో అవినీతి

అనుచరులకు నామినేషన్ పద్ధతిలో టెండర్లు కట్టబెడుతున్న సీఎం

బ్లాక్ మెయిల్ దందా ఆపకపోతే ఈడీకి ఫిర్యాదు చేస్తాం

కాళేశ్వరం ఫెయిల్ అయ్యిందని చెప్పేందుకు ఎనిమిదిన్నర లక్షల ఎకరాలు ఎండబెట్టిన కర్కోటక ప్రభుత్వం ఇది

2011 జనాభా లెక్కల ప్రతిపాదికన మహిళా బిల్లు అంటే మోసం చేయటమే

-తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

(హైదరాబాద్) :

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీని అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. టెండర్లు లేకుండానే కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్ట్ లను తన అనుచరులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దాదాపుగా రూ.1148 కోట్లు కాంట్రాక్టులను నామినేషన్ పద్దతిలో ఇచ్చారని కవిత చెప్పారు. జీహెచ్ఎంసీ, హెచ్ ఎండీఏలో జరుగుతున్న అవినీతిపై శుక్రవారం బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రూ.5 లక్షలకు మించి ఉండే ఏ పని అయినా సరే టెండర్లు పిలవాల్సి ఉన్నా నిబంధనలు ఉల్లంఘిస్తూ కోట్ల రూపాయల పనులను టెండర్లు లేకుండానే కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఇది తెలంగాణ స్టేట్ ఫైనాన్షియల్ కోడ్ ను ఉల్లంఘించటమేనని చెప్పారు. టెండర్లు లేకుండా కాంట్రాక్ట్ ఇవ్వవద్దని 2023 లో ఏర్పాటైన కమిటీ కూడా స్పష్టం చేసిందని కవిత గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 480 కోట్ల రూపాయల పనులను ఇదే విధంగా కట్టబెడితే.. రేవంత్ రెడ్డి సర్కార్ దాన్ని కొనసాగిస్తూ రూ.1,148 కోట్ల పనులను తన అనుచరులకు నామినేషన్ పద్దతిలో ఇచ్చిందని చెప్పారు. ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. నామినేషన్ పద్దతిలో ఇచ్చిన పనులను వెంటనే రద్దు చేసి టెండర్ల ద్వారా కాంట్రాక్ట్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నామినేషన్ పద్దతిలో ఈ ప్రభుత్వం పిలిచిన డిపార్ట్ మెంట్లలో స్కిల్డ్ లేబర్ ఉంటే వారికి కూడా జీతాల్లో అన్యాయం చేస్తున్నారన్నారు. 23 వేలకు పైగా వారికి జీతాలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 13 వేలు ఇస్తున్నారని చెప్పారు. మొక్కల పెంపకాలు, పంపకాలు, కొనుగోళ్లలో కూడా భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని కవిత ఆరోపించారు. ఔటర్ రింగ్ రోడ్డు కు సంబంధించిన ఓ కంపెనీ పై వేసిన సిట్ ఏమైందని కవిత ప్రశ్నించారు. ముఖ్యమంత్రితో సిట్టింగ్ అవటంతో ఆ సిట్ ను పత్తా లేకుండా చేశారా అని అనుమానం వ్యక్తం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డును కాంట్రాక్టర్ కు అప్పగించి…అక్కడి మెయింటెనెన్స్ ను ప్రభుత్వం చేస్తుండటం అత్యంత దారుణమని విమర్శించారు.

ఈడీకి ఫిర్యాదు చేస్తాం

జీహెచ్ఎంసీ అంటే గుంపు మేస్త్రీ అవినీతికి అడ్డా అన్నట్లు ఈ విభాగాన్ని తయారు చేశారని కవిత మండిపడ్డారు. హెచ్ఎండీఏ పరిధిలో 35 వేల కోట్ల రూపాయల విలువైన భూములను అమ్మేసి.. హైదరాబాద్ అభివృద్ధికి రూపాయి కూడా ఖర్చు చేయలేదని చెప్పారు. పైగా తన అవినీతిని మరింత పెంచుకునేందుకు ఈ ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ అంటూ హంగామా చేస్తున్నారన్నారు. హైడ్రా పేరుతో ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారులను హడలెత్తించటమే కాకుండా స్క్వేర్ ఫీట్ కు 150 రూపాయలంటూ వారి వద్ద వసూలు చేస్తున్నారని కవిత విమర్శించారు. వీటికి సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. వెంటనే ఈ బ్లాక్ మెయిల్ దందా ఆపకపోతే ఈడీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

Kavitha speaks at press conference alleging GHMC corruption and nomination tenders in Telangana

కమీషన్ల కోసం కాళేశ్వరం మరమ్మత్తులు

కాళేశ్వరం ప్రాజెక్ట్ మరమ్మత్తులు చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావటాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. అయితే కమీషన్ల కక్కుర్తి కోసం కాకుండా చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు. కాళేశ్వరం ఫెయిల్ అయ్యిందని చెప్పేందుకు ఎనిమిదిన్నర లక్షల ఎకరాల భూమిని ఎండబెట్టిన కర్కోటక ప్రభుత్వం ఇది అని విమర్శించారు. కేవలం కమీషన్ల కోసమే కాళేశ్వరం మరమ్మత్తులను ఈ ప్రభుత్వం చేపడుతున్నట్టుగా తాను భావిస్తున్నానని అన్నారు. కాళేశ్వరం ప్రయోజనాలను రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

బీజేపీది మోసపూరిత వైఖరి

మహిళ రిజర్వేషన్ల బిల్లు విషయంలో బీజేపీ మోసపూరితంగా వ్యవహరిస్తోందని కవిత ఆరోపించారు. బిల్లు అమలుకు 2011 జనాభా లెక్కలను ప్రతిపాదికగా తీసుకోవటం అన్యాయమన్నారు. 2027 జన గణనలో బీసీ గణన కూడా చేపట్టనున్న నేపథ్యంలో అప్పటి వరకు వేచి ఉండాలన్నారు. ఇప్పటికే లోక్ సభ ఎన్నికలు సహా, 12 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు అన్యాయం జరిగిందని చెప్పారు. 2027 జన గణన తర్వాతనే మహిళ బిల్లు అమలు చేయాలని…అదే విధంగా ఓబీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై బీసీ మహిళలంతా కూడా పోరాటానికి సిద్ధం కావాలని కవిత పిలుపునిచ్చారు. మహిళ రిజర్వేషన్ డ్రాఫ్ట్ బిల్లును కూడా తాము పరిశీలిస్తామని చెప్పారు. అవసరమైతే ఢిల్లీకి కూడా వెళ్తామన్నారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తన గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎవరో మద్దతిస్తే బతుకుతానని మాట్లాడటమంటే అది పురుషాహంకారమేనని మండిపడ్డారు. తాను తెలంగాణ ఉద్యమంలో రాటుదేలి ప్రజల మధ్యలో పనిచేశానని చెప్పారు. ఇప్పుడు కూడా ప్రజల కోసం పనిచేసేందుకు వచ్చానని స్పష్టం చేశారు. తెలంగాణ మహిళలు స్వయంప్రతిపత్తితో సొంతంగా ఆలోచించే సత్తా ఉన్నవాళ్లని అన్నారు.

సభ ఏర్పాట్ల పర్యవేక్షణకు 21 కమిటీలు

ఈ నెల 25 న జరగనున్న పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్ల పర్యవేక్షణకు 21 కమిటీలు వేశామని కవిత చెప్పారు. ఒక్కో కమిటీలో 30 మంది సభ్యులుంటారన్నారు. అదే విధంగా 500 మంది వాలంటీర్లు ఉంటారన్నారు. ట్రాఫిక్ సమస్యలు, సభ ఏర్పాట్లకు ఎలాంటి ఆటంకాలు లేకుండా వారంతా కో ఆర్డినేట్ చేసుకుంటారన్నారు. సభ ఏర్పాట్ల వివరాల కోసం కమిటీ మెంబర్లను సంప్రదించాలని సూచించారు.