సికింద్రాబాద్ రైల్వే కోర్టులో హాజరు కానున్న టీఆర్ఎస్ చీఫ్

రైల్ రోకో కేసులో కల్వకుంట్ల కవితకు సమన్లు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైల్ రోకో చేసిన కల్వకుంట్ల కవిత

(హైదరాబాద్)

2025 నవంబర్ లో రైల్ రోకో నిర్వహించిన కేసులో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత బుధవారం సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరుకానున్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైల్ రోకో చేసిన కవితపై రైల్వే చట్టం కింద కేసులు నమోదు చేశారు. రైల్ రోకో కేసులో కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్ లోని రెండవ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులో హాజరుకావాలని సమన్లలో పేర్కొన్నారు. 2025 నవంబర్ 28న కామారెడ్డి జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో రైల్ రోకో చేపట్టారు.. తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించి పంపిన బీసీ బిల్లులకు వెంటనే ఆమోదం తెలుపాలని డిమాండ్ చేశారు. బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు ఉద్యమిస్తామని తేల్చిచెప్పారు. కల్వకుంట్ల కవితతో పాటు రైల్ రోకో చేస్తున్న టీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
కల్వకుంట్ల కవితతో పాటు టీఆర్ఎస్ నాయకులు చేపట్టిన రైల్ రోకో కారణంగా సిర్నపల్లి–ఇందల్వాయి రైల్వే స్టేషన్ల మధ్య నిజామాబాద్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న దేవగిరి ఎక్స్ ప్రెస్ ను నిలిపివేశారు. అలాగే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ రూట్ లో ప్రయాణిస్తున్న మరో గూడ్స్ రైలును నిలిపివేశారు.
రైల్ రోకో చేపట్టిన కల్వకుంట్ల కవితతో పాటు మరో 12 మంది నాయకులపై కామారెడ్డి రైల్వే ఏఎస్ఐ రవీంద్ర బాబు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా కవితతో పాటు 12 మంది టీఆర్ఎస్ నాయకులపై U/Sec.147&74(a) Railway Act కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని సికింద్రాబాద్ రైల్వేస్ సెకండ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాసెస్ కోర్టు జారీ చేసిన సమన్లలో పేర్కొన్నారు