నెల రోజుల పాటు టీఆర్ఎస్ జెండా పండుగ
రాష్ట్ర రాజధాని నుంచి వార్డు స్థాయి వరకు పార్టీ జెండాలు ఆవిష్కరించాలి
పార్టీ శ్రేణులకు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పిలుపు
“తెలంగాణ రక్షణ సేన” పార్టీ భావజాలాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేందుకు ఈ నెల 20 నుంచి నెల రోజుల పాటు జెండా పండుగ నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఈ నెల 20 నుంచి జూన్ 20 వరకు నెల రోజుల పాటు రాష్ట్ర రాజధాని మొదలు జిల్లా కేంద్రాలతో పాటు నియోజకవర్గ, మండల కేంద్రాలు, గ్రామ స్థాయి వరకు పెద్ద ఎత్తున జెండా పండుగ నిర్వహించాలని సూచించారు. అన్ని వార్డుల్లోనూ టీఆర్ఎస్ జెండాలు ఎగురవేయాలన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ప్రకటించిన పార్టీ విధానాలను, పాంచజన్య లక్ష్యాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. రాష్ట్రం ఆవిర్భవించి 12 ఏళ్లు గడిచిన తర్వాత కూడా మన తెలంగాణ గడ్డ అనేక విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నదని,
తెలంగాణ ఉద్యమ నినాదాలైన నీళ్లు – నిధులు – నియామకాలను సాకారం చేసుకోవడంలోనూ వంచనకు గురయ్యామన్నారు.
వలస పాలన నాటి దుష్పరిణామాలను తెలంగాణ ప్రజలు ఇప్పుడు మళ్లీ ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తెచ్చుకుంటే మన బతుకులు మారుతాయని అనుకున్న ప్రతివర్గం అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నదని కవిత చెప్పారు. స్వరాష్ట్ర సాధనకు అవిశ్రాంతంగా ఉద్యమించిన మనం తెలంగాణ పునర్నిర్మాణం, సబ్బండ వర్గాల వికాసం కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని వివరించారు.
అందుకే తెలంగాణ రక్షణ సేన జెండాను ప్రతి వాడకు, పార్టీ సిద్ధాంతాలను ప్రతి గడపకు తీసుకెళ్లాల్సి ఉందని తెలిపారు.
పార్టీ ఆవిర్భావానికి మూడు నెలల ముందు నుంచే పెద్ద ఎత్తున పార్టీలో చేరిన నాయకులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ జాగృతి నాయకత్వం జెండా పండుగను విజయవంతం చేయాలని కవిత పిలుపునిచ్చారు.








