బండి సంజయ్ ను మంత్రివర్గం నుండి తొలగించాలి

ఆయన కుమారుడి మీద నమోదైన పోక్సో (POCSO) కేసులో విచారణ పారదర్శకంగా జరగాలంటే ఆయన పదవిలో ఉండొద్దు

ప్రధాని మోడీకి తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత లేఖ

(హైదరాబాద్)

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ మీద నమోదైన పోక్సో (POCSO) కేసులో విచారణ పారదర్శకంగా జరగాలంటే ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగించాలంటూ ప్రధాని మోడీకి తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. బండి భగీరథ్ మీద అత్యంత తీవ్రమైన పోక్సో కేసు నమోదైనందున కేసు విచారణ పారదర్శకంగా జరగాలంటే బండి సంజయ్ పదవిలో ఉండకూడదని లేఖలో పేర్కొన్నారు. ఈ కేసులో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా స్వతంత్ర విచారణ జరిగేందుకు ప్రధాని మోడీ చొరవ చూపాలన్నారు. దేశంలో మైనర్ల రక్షణ కన్నా రాజకీయ ప్రయోజనాలు ఎక్కువ కాదని ప్రధాని గుర్తించాలన్నారు. బాధితురాలికి పూర్తి న్యాయం జరగాలన్నా, ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల ప్రజల్లో నమ్మకం కలగాలన్నా…విచారణలో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండొద్దని సూచించారు. రాజ్యాంగ నిబద్ధతను, నైతిక విలువలను కాపాడటం ప్రధానిగా మీ తక్షణ కర్తవ్యమని గుర్తించాలని కవిత అన్నారు. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు బండి సంజయ్ ను మంత్రివర్గం నుంచి తప్పించాలని మిమ్మల్ని కోరుతున్నాంటూ ప్రధానికి రాసిన లేఖలో కవిత తెలిపారు.

లేఖలో ప్రస్తావించిన అంశాలు

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడిపై పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (BNS), అలాగే అత్యంత తీవ్రమైన బాలల లైంగిక నేరాల నిరోధక చట్టం (POCSO) కింద ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదైంది. మైనర్ బాలికకు సంబంధించిన కేసు కావడంతో ఈ దర్యాప్తు లోఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా స్వతంత్రంగా విచారణ జరగాల్సిన అవసరం ఉంది.
బండి సంజయ్ ప్రస్తుతం దేశంలోనే అత్యంత కీలకమైన, చట్టాన్ని అమలు చేసే అధికారాలు గల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. చట్టపరంగా ఆయన కుమారుడిపై నేర నిరూపణ అనేది న్యాయస్థానం తేల్చాల్సిన విషయమే. కానీ ఆయన అదే పదవిలో కొనసాగడం వల్ల దర్యాప్తు ప్రక్రియ, సాక్ష్యాల సేకరణ, సాక్షుల రక్షణపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ కేసులో బాధితురాలికి పూర్తి న్యాయం జరగాలన్నా, ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల ప్రజల్లో నమ్మకం కలగాలన్న విచారణలో రాజకీయ జోక్యం ఉండకూడదు. రాజ్యాంగ నిబద్ధతను, నైతిక విలువలను కాపాడటం మీ తక్షణ కర్తవ్యం.

దేశంలోని మైనర్ల రక్షణ, న్యాయవ్యవస్థ సమగ్రత అనేది రాజకీయ ప్రయోజనాల కంటే మిన్న. అందుకే కేసు దర్యాప్తు , న్యాయస్థాన విచారణ పూర్తయ్యే వరకు బండి సంజయ్ కుమార్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి నుండి తక్షణమే తొలగించాలి.