ఆర్ఎస్ ప్రవీణ్.. జబర్దస్త్ స్కిట్స్ బంద్ చెయ్
బాధితురాలి ప్రైవసీకి భంగం కలిగించవద్దంటే మా పార్టీ అధినేతను టార్గెట్ చేస్తావా?
పొలిటికల్ డ్రామాలు ఆపి నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచు
-టీఆర్ఎస్ నేతలు చిలుక ప్రవీణ్, సూరారపు కృష్ణవేణి
(హైదరాబాద్)
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫామ్ హోస్ నుంచి వచ్చే స్క్రిప్టులు చదువుతూ రోజుకో జబర్దస్త్ స్కిట్ చేస్తున్నాడని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) నేతలు చిలుక ప్రవీణ్, సూరారపు కృష్ణవేణి మండిపడ్డారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడి పోక్సో కేసులో నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన తమ పార్టీ అధినేత కవితను టార్గెట్ చేస్తారా అని ప్రశ్నించారు. ఈ సంఘటనలో బాధితురాలికి న్యాయం జరగాలన్న ఆకాంక్ష బీఆర్ఎస్ లో ఏమాత్రం కనిపిచటం లేదన్నారు. నిందితున్ని అరెస్ట్ చేసి.. బాధితురాలి ప్రైవసీని కాపాడాలని కవిత మాట్లాడితే ఆమెపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు చేయటం ఆశ్చర్యం కలిగిస్తున్నదన్నారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో బాధితురాలిని బద్నాం చేసైనా తమ రాజకీయ పబ్బం గడపాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని చెప్పారు. నిజంగా బాధితురాలికి న్యాయం జరగాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్ ఇంటి ముందు ధర్నా చేయాలన్నారు.
పొలిటకల్ డ్రామాలే
బండి సంజయ్ కుమారుడి కేసులో బాధితురాలికి న్యాయం జరగాలని, ఆమె ప్రైవసీని కాపాడాలని ఒక అమ్మ మాదిరిగా తమ నాయకురాలు కల్వకుంట్ల కవిత ఆలోచించారని చిలుక ప్రవీణ్ అన్నారు. ఈ క్రమంలోనే నిందితుడు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. బాధితురాలిని బజారుకీడ్చవద్దని కవిత మంచి సూచన చేస్తే బీఆర్ఎస్ నేతలు ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. బాధితురాలికి న్యాయం చేయాలన్న ఉద్దేశం కన్నా కూడా రాజకీయ ప్రయోజనాలు పొందాలన్న ఉద్దేశమే బీఆర్ఎస్ లో ఎక్కువగా కనిపిస్తున్నదని చెప్పారు. ఈ క్రమంలోనే సందర్భం లేకుండా తమ నాయకురాలు కవితపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణలు చేశారని ప్రవీణ్ అన్నారు. మంచి ఉద్దేశంతో బాధితురాలి తరఫున మాట్లాడిన కవితపై ఎందుకు ఆర్ఎస్ ప్రవీణ్ విమర్శలు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నిజంగా బాధితురాలికి న్యాయం చేయాలనుకుంటే నిందితుడిని దాచిందెవరో మీకు తెలియదా అని ప్రశ్నించారు. నిందితుడిని దాచిన వారిపై, అదే విధంగా నామమాత్రం సెక్షన్స్ పెట్టిన పోలీసులపై ఒత్తిడి పెంచాల్సింది పోయి కవిత గారిని ఎందుకు టార్గెట్ చేశారో చెప్పాలన్నారు. బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి ఇంటి ముందు, బండి సంజయ్ ఇంటి ముందు ధర్నా చేయాలని సూచించారు. అంతేకానీ పోస్టర్లు వేసి, మెట్రోలో ప్రచారం చేయటం ద్వారా బాధితురాలికి న్యాయం ఎలా జరుగుతుందో చెప్పాలన్నారు. ఫామ్ హౌస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ లను చదువుతూ రోజుకో జబర్దస్త్ స్కిట్స్ వేయటం ఆర్ఎస్ ప్రవీణ్ గారు మానుకోవాలనిసూచించారు. గత వారం రోజులుగా బీఆర్ఎస్ చేస్తున్న డ్రామాల ద్వారా కేసులో ఏమైనా పురోగతి వచ్చిందా అని ప్రశ్నించారు. ముందు నిందితుడిని పట్టుకోవాలంటూ ప్రభుత్వంపై పోలీసులపై ఒత్తిడి పెంచాలని బీఆర్ఎస్ ను డిమాండ్ చేశారు. కవిత గారికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఆమెపై సందర్భం లేకుండా బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు. మీ రాజకీయ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారన్నారని సందర్బం వచ్చినప్పుడు కచ్చితంగా బీఆర్ఎస్ కు బుద్ది చెప్తారన్నారు.
అప్పుడెందుకు మాట్లాడలేదు?
బీఆర్ఎస్ నాయకుడు సంతోష్ దగ్గర ఉండే ఒక వ్యక్తి ఓ మహిళ జర్నలిస్ట్ మరణానికి కారణమైతే ఆర్ఎస్ ప్రవీణ్ అప్పుడెందుకు మాట్లాడలేదని టీఆర్ఎస్ నాయకురాలు సూరారపు కృష్ణవేణి ప్రశ్నించారు. ఆ వ్యక్తిపై పోక్సో కేసు కూడా పెట్టారని గుర్తు చేశారు. పోక్సో కేసు నిందితుడు స్వేచ్ఛగా తిరుగుతున్నది ప్రవీణ్ కుమార్ కు కనిపిచంటం లేదా అని నిలదీశారు. మహిళ జర్నలిస్ట్ చనిపోతే బీఆర్ఎస్ కు చెందిన ఆ టీవీ యాజమాన్యం కూడా ఆమెను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బండి సంజయ్ కుమారుడి పోక్సో కేసులో బాధితురాలికి న్యాయం జరగాలన్నదే తమ పార్టీ ఉద్దేశమని చెప్పారు. ఇలాంటి సంఘటనలను రాజకీయాలకు తాము వాడుకోమని…ప్రజా సమస్యలపై కొట్లాడుతామని అన్నారు.








