బడే భాయ్..ఛోటే భాయ్ కలిసే ఉన్నారు
రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ సీఎం
బండి రాజీనామా చేయాలి
ఎన్నికలు ఎప్పుడూ వచ్చిన సరే తెలంగాణ రక్షణ సేనదే అధికారం
-కల్వకుంట్ల కవిత
(వే 2 న్యూస్ కాంక్లేవ్, హైదరాబాద్)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీతో కొత్తగా కలిసేదేమీ లేదని ఆల్రడీ బీజేపీతో కలిసే పనిచేస్తున్నారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ సీఎం అన్నది ఎప్పుడో నిరూపితమైందని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో శుక్రవారం నిర్వహించిన వే 2 న్యూస్ కాంక్లేవ్ లో కవిత పాల్గొన్నారు. వివిధ అంశాలపై సూటిగా తన అభిప్రాయాలు చెప్పారు.
మహిళా నేతలకు నేను ఆదర్శం కావాలి
“తెలంగాణ ప్రజలకు మర్చిపోలేనంత మంచి చేశానని చరిత్రలో నా పేరు ఉండాలన్నదే నా కోరిక. ప్రజలకు మేలు చేసే పనులు చేయాలని అనుకొనే పార్టీ పెట్టాను. చుక్క రక్తం చిందించకుండా రాజ్యాంగం ద్వారా దేశంలో మార్పు తెస్తానని అంబేడ్కర్ అన్నారు. అదే విధంగా నేను కూడా రాజకీయ పార్టీ ద్వారా మంచి మార్పు తేవాలని వచ్చాను. కచ్చితంగా నన్ను ప్రజలు దీవిస్తారు, ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉంది. రాజకీయాల్లో కచ్చితంగా వ్యూహాలు ఉండాలి. నేను కేసీఆర్ వద్దే వ్యూహాలు నేర్చుకున్నాను. ఆడపిల్లలు రాజకీయాల్లో వచ్చి ఫెయిల్ అయితే వారికి ఏమీ చేతకాదని ముద్ర వేస్తారు. అందుకే కచ్చితంగా సక్సెస్ కావాలని నేను మంచి స్ట్రాటజీస్ తో ముందుకు వెళ్తున్నా. మన రాష్ట్ర మహిళలు, భారత మహిళ బరువు నా మీద ఉంది. నేను సక్సెస్ అయితే వాళ్లు ఇంకా ధైర్యంగా రాజకీయాల్లోకి వస్తారు. నేను ఏ సమస్య వచ్చినా సరే పాజిటివ్ గానే ఆలోచిస్తాను. ఆడపిల్లలు డిప్రెస్ కావద్దు. “
లిక్కర్ స్కాం బీజేపీ కుట్ర
“నా జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు, కఠిన పరిస్థితులు చూశాక నాలో చాలా మార్పు వచ్చింది. ఎవరికీ నచ్చకపోయినా సరే మనకు నచ్చింది చేయాలన్నది నేను గుర్తించాను. కేసీఆర్ చాలా గొప్ప మనిషి. ఇందులో నాకు ఎలాంటి వేరే అభిప్రాయం లేదు. రాదనుకున్న రాష్ట్రాన్ని ఆయన సాధించి పెట్టారు. ఉద్యమ కేసీఆర్ తో నాకు ఎలాంటి సమస్య లేదు. ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ తోనే నాతో పాటు చాలా మందికి సమస్య వచ్చింది. బీఆర్ఎస్ లో చాలా నిషితమైన పరిశీలనతో కూడిన అభిప్రాయాలు చెప్పేదాన్ని.
ఇంటర్నల్ గా నా అభిప్రాయాలు ఎప్పుడూ చెప్పేదాన్ని. కానీ నన్ను బయటకు వచ్చేలా చేశారు. దాంతో ఇక నేను నా అభిప్రాయాలు బహిరంగంగా చెప్పాల్సిన పరిస్థితి తెచ్చారు.
నేను చిన్ననాటి నుంచి కూడా ఎప్పుడు నిజమే చెప్పాలని నేర్చుకున్నా. ఆ నిజం కారణంగా నాకు నష్టం జరిగినా సరే నేను నిజమే చెబుతా. లిక్కర్ స్కామ్ పేరుతో బీజేపీ నన్ను కేజ్రీవాల్ ను బద్నాం చేయాలని చూసింది. అవినీతిపై పోరాటం చేసిన కేజ్రీవాల్ పై అవినీతి ఆరోపణలు చేసి ఆయనను ఇబ్బంది పెట్టింది. సంస్కృతి, సాంప్రదాయాల కోసం పోరాటం చేసిన నన్ను లిక్కర్ స్కామ్ అంటూ బద్నాం చేశారు. కానీ కోర్టు ఆ ఆరోపణలను డిస్మిస్ చేసింది. పైగా విచారణ చేసిన సీబీఐ అధికారిపై విచారణ చేయాలని ఆదేశించింది. సీబీఐ అధికారిపై విచారణ చేయాలని చెప్పటం దేశంలోనే మొదటిసారి. లిక్కర్ స్కామ్ అంశం వచ్చినప్పుడు మా అమ్మ వాళ్ల నుంచి నాకు సరైన సపోర్ట్ రాలేదు. కానీ మా అత్త వాళ్ల కుటుంబం మాత్రం నాకు సపోర్ట్ చేసి ధైర్యం ఇచ్చింది. మన మీద ఎలాంటి ఆరోపణలు వచ్చినా మన కుటుంబ సభ్యులు మనతో ఉంటే ఏదైనా సాధించవచ్చు. “
విద్య, వైద్యం ఫ్రీ
“మన దేశంలో 80 శాతం మంది 30 వేల లోపే సంపాదిస్తున్నారు. అందులో 70 శాతం ఆదాయం విద్య, వైద్యం కోసం ఖర్చు చేస్తున్నారు. వారి వద్ద సేవింగ్స్ అనేవే ఉండటం లేదు. అందుకే ప్రభుత్వం ఉచిత విద్య, వైద్యం అనేది ప్రైవేట్ లో అయినా సరే ఫ్రీ గా ఇవ్వాలి. రాష్ట్రంలో గుణాత్మకమైన మార్పు తేవాలన్న బలమైన సంకల్పంతోనే తెలంగాణ రక్షణ సేన పెట్టాం. గత ప్రభుత్వం గానీ ఈ ప్రభుత్వం గానీ రైతులకు ఏమాత్రం మంచి చేయటం లేదు.
వాళ్లు ధరణి అంటే వీళ్లు భూమాత అంటున్నారు. నేమ్ మారినా గేమ్ మాత్రం మారలేదు. వ్యవసాయం రంగంలో చాలా మార్పులు తీసుకురావల్సిన అవసరం ఉంది.
అదే విధంగా యువతకు ఉద్యోగాలు ఇవ్వటం మాత్రమే కాదు, వారిని ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తేవాలి. అందుకే మేము మన యువతను నమ్మి 2 లక్షల నుంచి 20 కోట్ల రూపాయల వరకు వారికి ఋణాలు ఇస్తాం. వారిని వ్యాపారాలు పెట్టేలా ప్రోత్సహిస్తాం. వారిలో నుంచి ఒక్క గూగుల్ లాంటి సంస్థ వచ్చినా చాలు.”
నాయకులను బద్నాం చేయకండి
“సోషల్ జస్టిస్ అంటే కులాలకు మాత్రమే కాదు, సమాజంలో అవకాశాలు పొందలేని అన్ని వర్గాలకు మేలు చేయటం. వికలాంగులు, మాజీ మావోయిస్టులు, మాజీ ఆర్మీ జవాన్లు, సీనియర్ సిటిజన్స్ ఇలా అన్ని వర్గాలకు మంచి చేయటమే సోషల్ జస్టిస్. అదే విధంగా అన్ని కులాల వారి ఆడబిడ్డలకు రాజకీయంగా ఎదిగేందుకు మంచి అవకాశాలు కల్పించాలి. జెన్ జీ అంటే ఈ కొత్త తరాన్ని మెప్పించటానికి రాజకీయ నాయకులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. వాళ్లు తలుచుకుంటే ప్రభుత్వాన్ని పడేయగలరన్నది నేపాల్ లో చూశాం. ఐతే జెన్ జీ కి మనం డాక్టర్లు, ఇంజనీర్లు అని కాకుండా రాజకీయాలు, సామాజిక అవగాహన కూడా చేయించాలి. మేము రాజకీయంగా ఏం చేసినా సరే అందులో మా కోర్ బిలీఫ్ ఉంటుంది. మా పార్టీ వరకు వచ్చే సరికి మా కోర్ బిలీఫ్ తెలంగాణయే. మేము ఏం పనిచేసినా సరే అంతర్లీనంగా తెలంగాణ ప్రయోజనాలుంటాయి. అయితే రాజకీయ నాయకులు ఏం చేసినా సరే వాళ్లు అవినీతిపరులు అన్నట్లు మీడియా చూపిస్తుంది. కానీ ఫండమెంటల్ గా ఏ నాయకుడు అవినీతిపరులు కారు. ఫ్యామిలీ జీవితాన్ని త్యాగం చేసి ప్రజల కోసం నిలబడే వ్యక్తులే రాజకీయ నాయకులు. ఈ దేశంలో ఏ పెద్ద మార్పైనా రాజకీయ పార్టీల కృషి కారణంగానే వచ్చింది. ప్రజాస్వామికంగా మనం అభిప్రాయాలు చెప్పే పరిస్థితి ఉండాలి. భిన్నమైన అభిప్రాయాలను తీసుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నది. ముందుగా ప్రాంతీయ వాదం తర్వాత జాతీయ వాదం ఉండాలని నేను కోరుకుంటా. అదే విధంగా జెన్ జీ, మహిళలు కూడా పాలిటిక్స్ లోకి రావాలని కోరుతున్నా.”
లక్ష్యం నెరవేరలేదు
“తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ల కోసం అన్నది అందరికీ తెలిసిందే. కానీ ఇప్పటికీ మనకు నీళ్ల విషయంలో అన్యాయం జరుగుతూనే ఉంది. బీఆర్ఎస్ లక్షా 89 వేల కోట్లు ఖర్చు చేస్తే…కాంగ్రెస్ ఇప్పటి వరకు 30 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కానీ తెలంగాణలో కొత్తగా 15 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు. ఆంధ్రాలో రాజకీయ నాయకులు మాత్రం వాళ్ల ప్రజల నీళ్ల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు. తెలంగాణ రాకముందు కన్నా కూడా వాళ్లు ఇప్పుడే నీళ్లు ఎక్కువగా వాడుకుంటున్నారు. నీళ్ల విషయంలో తెలంగాణ ప్రజలను ఇక్కడి రాజకీయ నాయకులు ఫెయిల్ చేశారు. మనం పెట్టిన ఖర్చుకు వచ్చిన నీళ్లకు సంబంధమే లేదు. తెలంగాణ వచ్చి 12 ఏళ్లు గడుస్తున్నప్పటికీ పాలమూరులో వలసలు ఆగలేదు. గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదని నేను అనటం లేదు. కానీ మనం వాడుకోవల్సిన నీళ్లను కూడా పూర్తిగా వాడుకోలేదు. గోదావరిలో 960 టీఎంసీలు వాడుకునే అవకాశం ఉంటే 250 టీఎంసీలు కూడా మనం వాడుకోలేదు. 30 నెలల్లో పూర్తి చేయాల్సిన పాలమూరు ప్రాజెక్టును 132 నెలలైనా చేయటం లేదు. 32 వేల కోట్ల రూపాయల అంచనాలు కాస్త ఇప్పుడు 85 వేల కోట్ల రూపాయలకు చేరాయి. పైగా పదేళ్లు నీళ్లు ఇవ్వకపోవటంతో రైతులు రెండున్నర లక్షల కోట్ల ఆదాయం నష్టపోయారు. ఇప్పటికీ గోదావరి నుంచి 4 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. “
బండి సంజయ్ రాజీనామా చేయాలి
“వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగిన సరే తెలంగాణ రక్షణ సేననే అధికారంలోకి వస్తుంది. మేము అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం. రాజకీయాల్లో ఇవ్వాళ ఉన్న పరిస్థితి రేపు ఉండదు. అప్పటి వరకు బలమైన నేతగా ఉన్న వ్యక్తులు కూడా ఒక్క సంఘటనతో డ్యామేజ్ అవుతారు. బీజేపీలో బండి సంజయ్ బలమైన నేతగా ఉండేవారు. కానీ వాళ్ల కుమారుడి మీద వచ్చిన ఆరోపణలతో ఒక్కసారిగా పరిస్థితి ఎలా మారిందో చూస్తున్నాం.
బండి సంజయ్ కుమారుడి మీద వచ్చిన ఆరోపణలపై రేవంత్ రెడ్డి ఎలా వ్యవహరిస్తున్నారో తెలంగాణ మహిళలు గమనిస్తున్నారు. నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉన్న కేసుల్లో కూడా అరెస్ట్ చేయకుండా బండి సంజయ్ కు రేవంత్ రెడ్డి మేలు చేసి పెడుతున్నాడు. కచ్చితంగా ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. అవసరమైనప్పుడు కచ్చితంగా తెలంగాణ మహిళలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారు. ఇవ్వాళ్టికి కూడా తెలంగాణలో రోజుకు మహిళలపై 7 రేప్ కేసులు నమోదవుతున్నాయి. బండి సంజయ్ కుమారుడి వ్యవహారంలో బాధితురాలి క్యారెక్టర్ ను తప్పు పట్టేలా మీడియాలో కథనాలు వేస్తున్నారు. మీడియా ట్రయల్ ద్వారా మహిళలకు నష్టం జరుగుతున్నది. ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయవద్దు. తన కుమారుడి మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రధానితో బండి సంజయ్ వేదిక పంచుకోవల్సింది కాదు. ఆయన కేంద్ర హోంమంత్రిగా పదవిలో ఉంటే విచారణ సజావుగా సాగదు. కనుక విచారణ పూర్తయ్యే వరకు పదవి నుంచి తప్పుకోవాలి. సమస్యను ఏ పార్టీ వాళ్లు హైలైట్ చేసినా అది మంచిదే. కానీ ప్రభుత్వం దీనిపై స్పందించాలి. విచారణ పూర్తయ్యే వరకు బండి సంజయ్ ను తప్పించాలని ప్రధానికి లెటర్ రాస్తాను.”
బడే భాయ్..ఛోటే భాయ్
“మోడీ, రేవంత్ రెడ్డి కలిసే ఉన్నారు. బడేభాయ్, చోటే భాయ్ కలిసే ఉన్నారు. అందుకే తెలంగాణకు ఇవ్వాల్సిన ప్రాజెక్టులు రాకపోయినా సీఎం స్పందించటం లేదు. అందుకే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీఎం కాదు, ఆర్ఎస్ఎస్ సీఎం అని నేను అంటాను. అమ్మతనంతో పాలన జరిగినప్పుడే సమస్యకు సరైన పరిష్కారం దొరుకుతుంది. అక్కగా కన్నా కూడా అమ్మగా ఆలోచిస్తే ఇంకా ఎక్కువ మంచి చేయవచ్చు. అందుకే నేను అక్క నుంచి అమ్మగా పరిణతి చెందాలని అనుకుంటున్నాను. మెంటల్లీ ఛాలెంజుడు పిల్లలకు ఈ ప్రభుత్వం కనీసం పెన్షన్ ఇవ్వటం లేదు. అలాంటి పిల్లల తల్లితండ్రులకు చాలా ఇబ్బందులు ఉంటాయి. అందుకే వాళ్ల కోసం మేము ప్రత్యేక కన్ సర్న్ చూపుతాం. కేర్ టేకర్స్ ను కూడా ఇస్తాం. ఆ విధంగా అమ్మగా ఆలోచిస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. లీడర్ ను ఎప్పుడూ కూడా జెండర్ బేస్డ్ గా చూడవద్దు. అన్ని వర్గాలు తనవే అని అనుకున్నప్పుడు మాత్రమే లీడర్ ఎదగగలడు. మన ఆలోచన విధానం మారితే అన్నీ మారుతాయి. మన లక్ష్యం పెద్దగా ఉండాలి. లీడర్ గా ఎదగాలని అనుకుంటే సింహంగా ఆలోచించాలి. నాకు ఎన్టీఆర్, కేసీఆర్, ఇందిరాగాంధీ, సుష్మాస్వరాజ్, మార్గరేట్ థాచర్ ఇష్టమైన నాయకులు. జ్యోతిరావు పూలే కూడా నాకు చాలా స్ఫూర్తినిచ్చిన నాయకులు. నేను కూడా వాళ్ల మాదిరిగా గొప్ప నాయకురాలిగా ఎదగాలని అనుకుంటున్నా. తమిళనాడులో విజయ్ గెలిచినట్లు తెలంగాణలో మేము కూడా గెలుస్తాం. మన రాష్ట్రంలో గొప్ప నాయకులు ఎవరు లేరు. రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన అన్ని మాటలు కూడా తప్పారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి వాళ్లు పార్లమెంటులో మన రాష్ట్రాన్ని అవమానిస్తున్నా పట్టించుకోలేదు. “








