ఊరూరా జెండా పండుగ
వరంగల్ సమావేశంలో టీఆర్ఎస్ నేతల సంకల్పం
కార్యాచరణ సిద్ధం
(వరంగల్)
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు వరంగల్, హన్మకొండ జిల్లాల్లోని పరకాల, నర్సంపేట, వర్ధన్న పేట, వరంగల్ (తూర్పు),
వరంగల్ (పశ్చిమ) నియోజక వర్గాల ఇంచార్జీలు, జిల్లా ఇంచార్జిలతో పాటు రాష్ట్ర పార్టీ పరిశీలకుల సమావేశం శుక్రవారం బిర్లా ఓపెన్ మైండ్స్ స్కూల్ లో జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవితమ్మ పార్టీ ఆవిర్భావ సభలో పూరించిన పాంచజన్య శంఖారావం ప్రజల్లోకి తీసుకు వెళ్ళడంతో పాటు ఊరూరా జెండా పండుగను విజయవంతం చేయాలనే సంకల్పతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ తో పాటు, మున్సిపాలిటీల అన్ని డివిజన్లు, నియోజవర్గ కేంద్రాలు, మండల కేంద్రం, మేజర్ గ్రామ పంచాయతీలలో కూడా జూన్ 2 నుంచి జెండా పండుగను జరపాలని, అన్ని చోట్ల పాత, కొత్త నాయకులతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని, ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టడం, పాంచజన్యం ప్రజల్లోకి తీసుకెళ్లాలని వచ్చే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గుర్తింపు, మండల, గ్రామస్థాయి నాయకుల ఎంపిక తదితర సంస్థాగత నిర్మాణం అంశాలతో పాట, కేంద్ర, రాష్ట్ర ప్రజావ్యతిరేక విధానాలపై ఆందోళనలు, నిరసనలు చేస్తూ ప్రజాక్షేత్రంలో బలంగా కవితమ్మ నాయకత్వం పై విశ్వాసం కల్పించాలని పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ పరిశీలకులు సయ్యద్ ఇస్మాయిల్, జిల్లా ఇంచార్జి నడిపెల్లి వెంకటేశ్వర రావు, నియోజక వర్గాల ఇంచార్జీలు మల్లేశ్, డాక్టర్ అనిల్ కుమార్, కిషోర్, అరుణ్, రవి, సుమన్ పాల్గొన్నారు.








