రైతుల బాధ పట్టని ముఖ్యమంత్రి

రెండున్నరేళ్లుగా వ్యవసాయశాఖపై రివ్యూ చేయలేదు

ధాన్యం కొనకుండా రైతులకు వేధింపు

ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు

ప్రభుత్వానికి టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరిక

సచివాలయం వద్ద ధర్నా, అరెస్ట్ చేసిన పోలీసులు

(హైదరాబాద్):

రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల అత్యంత దుర్మార్గపూరితంగా వ్యవహరిస్తుందంటూ టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం కారణంగా వరి కుప్పలపైన రైతులు చనిపోతున్నారని, ఆ సంఘటనలు చూస్తుంటే బాధనిపిస్తుందన్నారు. రైతులు పండించిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని, తరుగు పేరుతో అన్యాయం చేయవద్దంటూ రాష్ట్ర సచివాలయం వద్ద ధర్నా నిర్వహించారు. టీఆర్ఎస్, శ్రేణులు, మహిళలు, రైతులు ఈ ధర్నాలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నా సరే ఈ ముఖ్యమంత్రి పట్టించుకోవటం లేదన్నారు. రెండున్నరేళ్లుగా వ్యవసాయ శాఖపై కనీసం రివ్యూ చేయలేదని మండిపడ్డారు. ధర్నాకు దిగిన కవిత సహా రైతులు, మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళలు, రైతులు అని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించారు. కవితను అరెస్ట్ చేసి ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ కు తరలించి అనంతరం విడుదల చేశారు. 

వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

రాష్ట్ర వ్యాప్తంగా రైతులు వరికుప్పలపై చనిపోతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని కవిత ప్రశ్నించారు. రైతుల దుఖం మామూలుగా లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. 48 డిగ్రీల ఎండలో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడుతుంటే వారికి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదన్నారు. అత్యంత కర్కోటక, అమానవీయ ప్రభుత్వం ఇది అంటూ మండిపడ్డారు. కనీసం రైతులు పండించిన పంటను కూడా కొనుగోలు చేయలేని చేతగాని దద్దమ్మ సర్కార్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలనే తాము సచివాలయం ఎదుట వడ్లు పోసి నిరసన తెలిపామని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేయకపోగా తరుగు పేరుతో రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్నవడ్లకు బోనస్ ఎగ్గొట్టేందుకే గ్రేడ్ ఏ ధాన్యాన్ని గ్రేడ్ బీ అని రిజిస్టర్ చేస్తున్నారని చెప్పారు. కలెక్టర్లు కూడా రైతులకు అన్యాయం చేస్తున్నారని కవిత ఆరోపించారు. ఇక నైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని రైతుల సమస్యలను పట్టించుకోవాలన్నారు. లేదంటే రేపటి నుంచి అన్ని జిల్లాల్లో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. వడ్లు, జొన్నలు, పొద్దు తిరుగుడు సహా అన్ని పంటలను చివరి గింజ వరకు కొనుగోలు డిమాండ్ చేశారు. చనిపోయిన రైతు కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వాలని, రైతుల గోసను ముఖ్యమంత్రి పట్టించుకోవాలని సూచించారు. దళారుల చేతిలో మోస పోకుండా చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మీద రివ్యూ చేసి రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనాలని కవిత డిమాండ్ చేశారు.