సర్వేలతో సర్కార్ కాలయాపన

రేవంత్ ప్రభుత్వం విఫలం

అనాలోచిత ప్రకటనలతో విద్యార్థుల అయోమయం

టీఆర్ఎస్ రాష్ట్ర నేతలు సయ్యద్ ఇస్మాయిల్, ఆర్వీఆర్ ప్రసాద్, లోక రవిచంద్ర

(టీఆర్ఎస్ భవన్, హైదరాబాద్) :

రేవంత్ సర్కార్ సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నదని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు సయ్యద్ ఇస్మాయిల్ అన్నారు. హైద్రాబాద్ టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయంలో  రాష్ట్ర నాయకులు లోక రవిచంద్ర, ఆర్ వి ఆర్ ప్రసాద్ లతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు విస్మరించి ఆరు గ్యారంటీలను గాలికొదిలేశారని ఆరోపించారు. ఇది సర్వేల ప్రభుత్వమా.. సంక్షేమం పట్టని ప్రభుత్వమా అనే సందేహం ప్రజల్లో వ్యక్తం అవుతుందన్నారు. పెన్షన్ పథకం అమలులో లబ్ధిదారులను భయానికి గురిచేసే చర్యలు మానుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. వృద్ధులు, వితంతుల వివరాల సేకరణ పేరుతో ఇబ్బందికి గురిచేయడం తగదన్నారు. వ్యవసాయ కమీషన్ చైర్మన్ కోదండరెడ్డి కూడా బాధ్యతల్లో ఉన్న విషయం మరిచి వ్యవహరిస్తున్నారని, సమస్య పరిష్కారం బాధ్యత గాలికి వదిలి కోతుల బెడద తీవ్రంగా ఉందని ఒప్పుకుని తమ బాధ్యతా రాహిత్యాన్ని  బయట పెట్టుకున్నారని అన్నారు. ప్రభుత్వం పెన్షనర్లకు సకాలంలో నగదు అందించాలని ఇబ్బందులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

ప్రభుత్వం గద్దె దిగాలి -ఆర్వీఆర్ ప్రసాద్

టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్వీఆర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం సీనియర్ సిటిజన్లను ఓట్ల కోసం వాడుకుని తన పబ్బం గుడుపుకుని వృద్ధులను గాలికొదిలేశారని విమర్శించారు. రూ. 4 వేలకు పెన్షన్ పెంచుతామని చెప్పి మోసం చేశారని చెప్పారు. మంత్రివర్గంలోని సభ్యులకేమైనా పెన్షన్ ఇస్తున్నారేమో అని ఎద్దెవా చేశారు. ధాన్యం కొనుగోళ్లు లేక రైతులు చచ్చిపోతుంటే పట్టించుకోని ప్రభుత్వం వెంటనే గద్దె దిగిపోవాలని డిమాండ్ చేశారు. విద్యార్తులు, రైతులు, మహిళలు ఇలా అన్ని వర్గాల వారిని దగా చేశారన్నారు. నేను ఎన్టీఆర్ శిష్యున్ని అని చెప్పుకునే వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులు చచ్చిపోతుంటే స్పందించకపోవడం దారుణమన్నారు. మీరు మంత్రిగా కోనసాగడం అనైతికమని ప్రసాద్ స్పష్టం చేశారు. రైతుకుటుంబం నుంచి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు సిగ్గు పడాలన్నారు. మీరు పట్టించుకోకపోవడం వల్ల రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్మాల్సి వస్తున్నదన్నారు. జవాబుదారీతనం లేని ఈ ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందన్నారు.

విద్యావ్యవస్థ అస్తవ్యస్తం -లోక రవిచంద్ర

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యార్థి లోకం గందరగోళానికి గురవుతున్నది. కేంద్రం ప్రవేశ పెట్టనున్న జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా మూడు భాషలు నేర్చుకోవడం తప్పనిసరి చేసింది. ఈ విధానాన్ని బీజేపీకి చెందిన నాయకులే వ్యతిరేకిస్తున్నారు. మూడు భాషల పద్ధతిని ఈ విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతిలో ప్రారంభించాల్సి ఉండగా ఈ సంవత్సరం నుంచే 9 వ తరగతి విద్యార్థులకు కూడా అమలు చేయాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నఫలంగా 9వ తరగతి విద్యార్థులకు అదనంగా మరో భాష నేర్చుకోవడం భారంగా పరిణమించనుంది. పదవ తరగతి బోర్డు పరీక్షల ముందు విద్యార్థుల చదువుకు ఇబ్బంది కలిగించే ఈ నిర్ణయం మంచిది కాదు. మరో వైపు జాతీయ నూతన విద్యావిధానానికి అనుగుణంగా తెలంగాణలో ఇంటర్ బోర్డును రద్దు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించి విద్యా వ్యవస్థను అయోమయానికి గురి చేశారు. అర్హత ఉన్న సిబ్బంది అందుబాటులో ఉన్నారా..లేదా అన్న ప్రాథమిక అంశాలను కూడా పరిశీలించకుండా ఇంటర్ బోర్డు రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం అనాలోచిత చర్య. సీఎం ప్రకటనను పరిగణలోకి తీసుకోకుండానే ఇంటర్ బోర్డు అడ్మిషన్లు తీసుకోవడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. సీఎం ఆదేశాలతో ఆ నోటిఫికేషన్ ను వారం పాటు నిలిపేశారు. ఇప్పటికిప్పుడు ఇంటర్ బోర్డు రద్దు సాధ్యం కాదన్న ఆలోచనతో సీఎం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ఇంటర్మీడియేట్ అడ్మిషన్లు ప్రారంభించారు. ఇంత గందరగోళంగా తెలంగాణలో విద్యావ్యవస్థ నిర్వహణ ఉండటం దారుణం. 

ఫీజు రీయంబర్స్ మెంటు చెల్లింపుల విషయంలో తెలంగాణ సీఎం అనుసరిస్తున్న విధానం అత్యంత వివాదాస్పదంగా మారింది. రాష్ట్రంలో 13 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన సుమారు రూ. 9 వేల కోట్లు పెండింగులో పెట్టి ఇటు కాలేజీ యాజమాన్యాలను, అటు విద్యార్థులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్నది. ధర్నాలు, ఆందోళనల తర్వాత ప్రభుత్వం కేవలం రూ.500 కోట్లు మాత్రమే విడుదల చేసింది. తాజాగా హైకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకుని విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకోవచ్చని సూచించింది. కోర్టు ఆదేశాలతో తాజా అడ్మిషన్లకు విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేశాక తిరిగి తీసుకోండని కాలేజీ యాజమాన్యాలు సూచిస్తున్నాయి.  ఈ విధానం వల్ల ఫీజులు కట్టలేని పేద, మధ్యతరగతి విద్యార్థులతో పాటు అమ్మాయిలు చదువుకు దూరమయ్యే ప్రమాదముంది.  ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో విద్యావ్యవస్థ అధ్వాన్నంగా మారుతుంది. ఫీజు రీయంబర్స్ మెంటు బకాయిలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రక్షణ సేన డిమాండ్ చేస్తున్నది. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తాం.