డ్రైవర్ అశోక్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి
-టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
(హైదరాబాద్):
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను కొనుగోలు చేయాలని మంత్రికి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సూచించిన జగిత్యాల డిపో ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను విధుల నుంచి తప్పించడం దుర్మార్గమైన చర్య అని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం గురించి పెద్ద పెద్ద లెక్చర్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ… అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా పాతర వేస్తున్నదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ‘ప్రజాస్వామ్య పునరుద్ధరణ’ అంటూ ఏడో గ్యారంటీగా ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్.. నేడు ప్రజా సమస్యలపై ప్రశ్నించే సామాన్యుల పొట్ట కొడుతున్నదని ధ్వజమెత్తారు. ఒక సామాన్య డ్రైవర్‌పై ఇంత కక్షసాధింపు చర్యలకు దిగడం చూస్తుంటే ఇది ప్రజా ప్రభుత్వం కాదు, ఒక కర్కోటక ప్రభుత్వం అని స్పష్టమవుతున్నదన్నారు. విధుల నుంచి అన్యాయంగా తప్పించిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌ను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. లేదంటే టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.








