ఉద్యమకారులకిచ్చిన హామీలు నెరవేర్చాలి
జూన్ 2న ప్రకటించాలి
లేదంటే జులై 2 నుంచి రాష్ట్రవ్యాప్త భూపోరాటం
తెలంగాణ ఉద్యమకారుల హెచ్చరిక
తెలంగాణ రక్షణ సేన చీఫ్ తో సమావేశం
(హైదరాబాద్)
అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమలు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించాలి. ఈ మేరకు జూన్ 2న సీఎం ప్రకటన చేయకుంటే తెలంగాణ ఉద్యమకారులంతా ఏకమై రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల సమయంలో తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, అమరవీరుల కుటుంబాలకు పింఛన్, ఇంటికో ఉద్యోగం ఇస్తామని రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఎన్నికల హామీలు నమ్మి గెలిపిస్తే గద్దెనెక్కాక కాంగ్రెస్ హామీలు మరిచి ఉద్యమకారులను అవమానించారు. తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11 ఉద్యమకారుల సంఘాలు సోమవారం టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవితతో సమావేశమయ్యారు. ఇప్పటికే ఉద్యమకారుల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కవిత మరోసారి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జూన్ 2న ఉద్యమకారుల హామీలపై స్పష్టమైన ప్రకటన చేయకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళన తప్పదని చెప్పారు. ఉద్యమకారులకు తక్షణమే ఇంటిస్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జులై 2 నుంచి ఉద్యమకారుల భూపోరాటంతో రాష్ట్రంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
సోమవారం కల్వకుంట్ల కవితతో తెలంగాణ ఉద్యమకారుల పోరాటసమితి అధ్యక్షులు మల్లూరి అనిల్ కుమార్, కుప్ప శ్రీనివాస్ గౌడ్, మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు సామ అంజిరెడ్డి,కాశబోయిన యాకన్నపెరుమాల్ల రాజేశ్, తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర జేఏసీ అధ్యక్ష కార్యదర్శులు రామగిరి ప్రకాశ్, బీరకాయల మధుసూదన్, తీన్మార్ సుల్తానా, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భోగె పద్మ, మట్ట రాజయ్య, తెలంగాణ ఉద్యమకారుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పూస శ్రీనివాస్, బీఎస్ మాణిక్యమ్మ, తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కోరె సాయిరాం, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం-2 అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కుమారస్వామి, మాదాసు శ్రీనివాస్, తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధన సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మూల ప్రభాకర్, లావుడ్య రవినాయక్, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమితి అధ్యక్షుడు కాశబోయిన యాకన్న, అమరవీరుల ఉద్యమకారుల సంఘం ప్రతినిధి జ్యోతిరాజ్, తెలంగాణ ఉద్యమ లెక్చరర్ల ఫోరం ప్రతినిధి కోడిమ్యాల కృష్ణ సమావేశమయ్యారు.








