రూ.లక్ష కోట్ల విలువైన భూమిని బడాబాబులకు కట్టబెడుతున్న ప్రభుత్వం
బందిపోట్లుగా మారిన సర్కార్
ప్రాణం పోయినా సరే తెలంగాణలో ఇంచు భూమిని పోనివ్వం
కబ్జా చేసిన భూమిని పవన్ కళ్యాణ్ వెంటనే తిరిగి ఇచ్చేయాలి
ఆంధ్రా విష కోరల్లోంచి తెలంగాణను సాధించుకున్నాం.. కచ్చితంగా తెలంగాణ మా జాగీరే
-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
(తెలంగాణ రక్షణసేన భవన్, హైదరాబాద్)
తెలంగాణలో లక్ష కోట్ల విలువైన భూములను పెద్ద వాళ్లకు అప్పనంగా అప్పగించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
పేదవారికి అన్యాయం చేస్తూ పెద్దవారికి దోచి పెడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూదందా గురించి సాక్ష్యాధారాలతో సహా వరుసగా వెల్లడిస్తానని చెప్పారు. హైడ్రా అనే బూచి చూపి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు భూదందా చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వ భూదందా గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు వెల్లడిస్తానని కవిత తెలిపారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణసేన కార్యాలయంలో శనివారం కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ వనరులు, సంస్కృతి, అస్తిత్వం కాపాడేందుకే తెలంగాణ రక్షణసేన పార్టీ పెట్టామన్నారు. తెలంగాణ భూములను రక్షించేందుకు భూపోరాటాలు చేస్తామని అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లైనా న్యాయ పోరాటం చేస్తామన్నారు. తెలంగాణ ప్రాంత తరువాతి తరాల కోసం ప్రభుత్వ పెద్దల కోరల నుంచి భూములను కాపాడుతామని కవిత స్పష్టం చేశారు. అప్పులు పుట్టడం లేదంటూ ఉన్న భూములను అమ్ముకుంటూ పోతే భవిష్యత్ అవసరాలకు భూమి ఎట్ల అని ప్రశ్నించారు. హైడ్రా అనే సంస్థ కూకట్ పల్లిలోని మంజీర కాలనీకి నిన్న కూడా వెళ్లి పేదల భూములను ఖాళీ చేయించిందని చెప్పారు.
కానీ మూసీ నదికి మరకగా మారిన, రివర్ బెడ్ లోనే కడుతున్న శ్రీ ఆదిత్య బిల్డింగును మాత్రం టచ్ చేయటం లేదని తప్పుపట్టారు. గతంలో మేము ఆ బిల్డింగ్ వద్ద ధర్నా చేస్తే హైడ్రా వాళ్లు మా మీద దాడి చేసే ప్రయత్నం చేశారని తెలిపారు. కానీ మేము ఆధారాలు చూపించిన తర్వాత ఒక్క మాట మాట్లాడటం లేదని చెప్పారు. ఆ బిల్డింగ్ జోలికి ఇప్పటి వరకు హైడ్రా అధికారులు వెళ్లటం లేదన్నారు. శ్రీ ఆదిత్య బిల్డర్స్ వెనుక ఒక ఎంపీ ఉన్నాడని, ఆయన పేరు తర్వలోనే బయటపెడుతానని స్పష్టం చేశారు.
రేవంత్ అవినీతిలో హైడ్రా చిన్న పాయ
ప్రేమావతిపేట పెద్దచెరువులో ఏడు ఎకరాలను కబ్జా చేశారని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. దానికి సంబంధించిన ఇమేజ్ ను మీడియాకు ప్రదర్శించారు. కబ్జా భూమిలో నిర్మాణానికి 2021 లోనే పర్మిషన్ ఇచ్చారని తెలిపారు. 2023 నాటికి చెరువులోకి మరింత చొచ్చుకుని వచ్చారన్నారు. ఏడు ఎకరాలు అంటే ఏడు వంద కోట్ల విలువైన భూమి, దాని పైన 30 అంతస్తుల భవనం అంటే వేల ఎకరాల వ్యాపారం చేస్తున్నారని వెల్లడించారు. ఆ సంస్థను ముట్టుకునే దమ్ము హైడ్రాకు ఉందా అని సవాల్ చేశారు. టీఆర్ఎస్ తరఫున దీని మీద కచ్చితంగా ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అదే విధంగా అక్కడ ఉన్న గ్రామానికి సంబంధించి పాత నక్షాను కూడా మార్చారని, దాంట్లో తప్పులు ఉన్నా పట్టించుకోవటం లేదని దుయ్యబట్టారు. ఇక మెగా కంపెనీకి చెందిన ఐకాం అనే ఆయుధాల తయారీ సంస్థ నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఐదు ఎకరాలు కబ్జా చేసిందని ఆరోపించారు. సర్వే నంబర్ 59 లోని మేడి బావి, జాలు బావి చెరువుల వద్ద ఐదు ఎకరాలు కబ్జా చేశారంటూ అక్కడి మున్సిపాలిటీలో తీర్మానం చేశారని గుర్తు చేశారు. ఆ సంస్థపై చర్య తీసుకునే దమ్ముందా అని ప్రశ్నించారు? రేవంత్ రెడ్డి చేస్తున్న అవినీతిలో హైడ్రా చిన్న పాయ మాత్రమేనని తెలిపారు. శ్రీ ఆదిత్య వాళ్లు మూసీ గర్భంలో పెద్ద బిల్డింగ్ కడుతున్నారని, మూసీ గర్భశోకం ఎవరికీ మంచిది కాదన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అగ్లీబార్ అవకాశం లేదని ఇదే ఆఖరి బార్ అని కవిత స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని మరో 20 ఏళ్లు బొందపెట్టే విధంగా రేవంత్ రెడ్డి పనితీరు ఉందని ఎద్దెవా చేశారు.
ఇంచు భూమి కూడా పోనివ్వం
తెలంగాణ వనరులను, సంపదను, భూములను కాంగ్రెస్ సర్కార్ బందిపోట్ల మాదిరిగా దోచుకుంటున్నదని కవిత ఆరోపించారు. గతంలో ఈ అవినీతికి బీఆర్ఎస్ కిటికీలు తెరిస్తే కాంగ్రెస్ తలుపులే తెరిచిందని చెప్పారు. అప్పుడూ కేటీఆర్ పాలనే ఉంది… ఇప్పుడూ కేటీఆర్ పాలనే నడుస్తున్నదని విమర్శించారు. గతంలో కేటీఆర్ అంటే కేసీఆర్, తన్నీరు హరీష్ రావు, రామారావు… ఇప్పుడు కేటీఆర్ పాలన అంటే కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డిగా సాగుతున్నదని తెలిపారు. కచ్చితంగా తెలంగాణ వనరులను కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ప్రాణం పోయినా సరే ఇంచు భూమిని కూడా దోపిడీ కానివ్వమని హెచ్చరించారు. గతంలో ఫినిక్స్ సంస్థకు బీఆర్ఎస్ 50 ఎకరాల వరకు ధారాదత్తం చేస్తే ఇదే రేవంత్ రెడ్డి అప్పుడు వ్యతిరేకించాడని గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక మరో వంద ఎకరాలు కలిపి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. ఉద్యమకారులను గుర్తించే అఖిలపక్ష సమావేశానికి మమ్మల్ని పిలవకపోవటాన్ని వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నామని కవిత చెప్పారు. ఉద్యమకారులకు కచ్చితంగా భూమి ఇవ్వాల్సిందేనని సూచించారు. దాని కోసం ఉప్పల్ భగాయత్ లో వచ్చే నెల పోరాటం చేయబోతున్నామని వెల్లడించారు. నాదర్ గుల్ లో ఉన్న రెండు వందల ఎకరాల భూమిని కూడా ఉద్యమకారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కబ్జా చేసిన భూమిని వెనక్కు ఇవ్వాలి
తెలంగాణ వచ్చిన తర్వాత 11 రోజులు అన్నం తినకుండా బాధపడిన పవన్ కల్యాణ్ ఆ బాధలో ఇక్కడ భూములు కొన్నారని ఎద్దెవా చేశారు. కానీ అది కోడికుంట అనే చెరువులో 10 ఎకరాల శిఖం భూమినే కొన్నారని వివరించారు. సర్వే నంబర్ 706లో ఉన్న ఈ భూమి శిఖం భూమి అని ఇరిగేషన్ శాఖ నోటిఫై చేసిందని గుర్తు చేశారు. కానీ రిజిస్ట్రేషన్ లో చాలా తప్పులు చేశారన్నారు. మూడు ఎకరాలు మాత్రమే శిఖం అని మిగతాది మాగాణి అంటూ రిజిస్ట్రేషన్ చేశారని కవిత చెప్పారు. ఈ అంశం బయటకు వచ్చాక దీని గురించి తెలుసుకుంటే చాలా వివరాలు తెలిశాయన్నారు. శిఖం భూమి అని తేలితే భూమి వాపస్ ఇస్తా అని పవన్ చెప్పారు.. శిఖం భూములు కొన్న పవన్ కల్యాణ్ వెంటనే ఆ భూములను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలని సూచించారు. రైతులకు ఇచ్చిన విధంగా ఆయనకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. తెలంగాణ ప్రాంతీయవాదాన్ని పవన్ కల్యాణ్ ఉగ్రవాదంతో పోల్చడం అత్యంత దారుణమన్నారు. గద్దర్ కు కారు కొని ఇచ్చానని ప్రచారం చేసుకుంటూ తెలంగాణ మేధావులు, కళాకారులను అవమానిస్తున్నారని చెప్పారు. మీ సినిమాలకు వచ్చే ఇన్ కమ్ లో నైజాం ఏరియా నుంచే ఎక్కువగా వస్తుందని తెలిపారు. మీరు కొనుకునే భూములు, కార్లు కూడా మా తెలంగాణ ప్రజల కొన్న టికెట్ల ద్వారా వచ్చినవేనని గుర్తు చేశారు. కానీ గద్దరన్నకు కారు కొనిచ్చానని చెబుతూ పవన్ ఆయనను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు కళాకారుడిగా ఉంటూ మరొక కళాకారుడిని అవమానిస్తారా అంటూ మండిపడ్డారు. కుడిచేత్తో చేసే దానం ఎడమ చేతికి తెలియనివ్వద్దని అంటారని, కానీ ఎప్పుడో కొని ఇచ్చిన కారు గురించి ఇప్పుడు చెబుతారా అంటూ తప్పుపట్టారు.
జానపద కళాకారుల ట్యూన్స్ వాడుకొని వాళ్లకు రాయల్టీ ఇచ్చారా.. చిన్న కళాకారులను ఆదుకున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా సమైక్యవాదులు దాడులు జరుగుతూనే ఉన్నాయని కవి చెప్పారు. ఆంధ్రా విషకోరల్లో నుంచి తెలంగాణ సాధించుకున్నామని, కచ్చితంగా తెలంగాణ మా జాగీరే అని స్పష్టం చేశారు. రాజ్యాంగపరంగా ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చని.. కానీ నైతికత అనేది ఉంటుందని తెలిపారు. మా హక్కులు, వనరులను దోచుకున్న మీ మీద పోరాటం చేసి తెలంగాణ సాధించుకుంటే మళ్లీ మీ రాజకీయం ఇక్కడ ఎందుకని నిలదీశారు. మేము వద్దంటే వన్ సైడ్ లవ్ అంటూ బలవంతం చేస్తూ యాసిడ్ పోస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. ముందు ఆంధ్రా ప్రజలకు మేలు చేయండి.. మా పాలన మేము చేసుకోగలని తేల్చి చెప్పారు.
బీజేపీ నేతల కృషి శూన్యం
బీజేపీకి తెలంగాణలో లీడర్ లేక పవన్ కళ్యాణ్ తో రెండు ఓట్లు తెచ్చుకుందామని అనుకుంటున్నారని కవిత ఎద్దెవా చేశారు. పంజాబ్ లో మొత్తం గోధుమలు కొంటున్న కేంద్రం ఇక్కడ మాత్రం ధాన్యం కొనుగోలుకు ఎందుకు పరిమితులు విధిస్తోందని కవిత ప్రశ్నించారు.
దానిపై బీజేపీ ఎంపీలు ఎందుకు ప్రశ్నించరన్నారు. వచ్చేసారి ఎనిమిది మంది కాదు కదా ఒక్క ఎంపీ కూడా గెలవరని జోస్యం చెప్పారు. పాలమూరు బిడ్డ అయి ఉండి ఈ ముఖ్యమంత్రి 30 నెలలుగా పాలమూరు ప్రాజెక్టుపై రివ్యూ చేయలేదని నిలదీశారు. మేము వెంటబడి ధర్నాలు, ఆందోళనలు చేస్తే ఫస్ట్ టైమ్ రివ్యూ చేశారని తెలిపారు. కానీ ఆంధ్రాకు 260 టీఎంసీలు నీళ్లు తీసుకోండి అని చెబుతున్నారన్నారు. ఈ ముఖ్యమంత్రికి నీటి మీద అవగాహన లేదని, ఆ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ పెంచుకునే ప్రయత్నం చేయాలని సూచించారు.
గతంలో తుమ్మడిహెట్టిని అంగీకరించని మహారాష్ట్ర సీఎం వద్దకు వెళ్లి ఏదో చేస్తున్నాననే భ్రమలు కల్పిస్తున్నారని విమర్శించారు. పని చేస్తున్నట్లు నటిస్తున్నాడు కానీ పక్క రాష్ట్రంలో ఉన్న తన గురువైన ముఖ్యమంత్రిని మాత్రం కలవటం లేదని తెలిపారు. చంద్రబాబు నాయుడును కలిసి 200 టీఎంసీలు మనకు కావాలని అడగాలని సూచించారు. బనకచర్లకు రేవంత్ రెడ్డి అంగీకరిస్తే మనకు నీటి ద్రోహం చేసినట్లేనని స్పష్టం చేశారు. ఈ రేవంత్ కాంగ్రెస్ పార్టీని 20 ఏళ్లు బొంద పెట్టే పనులు చేస్తున్నాడని ఎద్దెవా చేశారు. భవిష్యత్ లో మనకు కృష్ణా నీళ్లు సరిపోవని, గోదావరిలో 200 టీఎంసీలు నీళ్లు కావాలని అడగాలన్నారు. లేదంటే తెలంగాణకు నీటి విషయంలో ద్రోహం చేసిన వాళ్లు అవుతారని స్పష్టం చేశారు.








