ఆస్ట్రేలియాలో టీఆర్ఎస్ జెండా పండుగ
తెలంగాణ రక్షణ సేనకు మద్దతుగా బ్రిస్బేన్ లో భారీ కార్ ర్యాలీ
(బ్రిస్బేన్, ఆస్ట్రేలియా):
తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క స్థాపించిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ సభ తర్వాత.. తొలిసారిగా విదేశీ గడ్డపై పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ఉత్సవాలు నిర్వహించాయి. ఆస్ట్రేలియాలోని ప్రముఖ నగరం బ్రిస్బేన్లో శ్రీకర్ రెడ్డి, విజయ్ కోరబోయిన ఆధ్వర్యంలో ‘కార్ ర్యాలీ’, ‘జెండా పండుగ’ కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహించారు. పార్టీ ఆవిర్భావం అనంతరం విదేశాల్లో జరిగిన మొట్టమొదటి అధికారిక కార్యక్రమం కావడంతో బ్రిస్బేన్ లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా బ్రిస్బేన్ నగరంలోని ప్రవాస తెలంగాణ కుటుంబాలు, స్థానిక తెలుగు ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ మద్దతుదారులు వచ్చారు. పార్టీ జెండాలతో అలంకరించిన కార్లతో నగర వీధుల్లో నిర్వహించిన కార్ ర్యాలీ అందరినీ ఆకట్టుకుంది. జై తెలంగాణ, జై కవితక్క అనే నినాదాలతో బ్రిస్బేన్ వీధులు మారుమోగాయి.
కవితక్కకు మద్దతు
అనంతరం ఏర్పాటు చేసిన జెండా పండుగ వేడుకల్లో భాగంగా పార్టీ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య నిర్వహకులు శ్రీకర్ రెడ్డి, విజయ్ కోరబోయిన మాట్లాడుతూ.. కవితక్క ఆశయాలకు అనుగుణంగా, తెలంగాణ అస్తిత్వాన్ని, హక్కులను కాపాడడమే ధ్యేయంగా ఏర్పడిన తెలంగాణ రక్షణ సేనకు ప్రవాస భారతీయుల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. విదేశాల్లో ఉన్నప్పటికీ పుట్టినగడ్డపై ఉన్న ప్రేమతో, పార్టీ బలోపేతానికి తామంతా శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు.









