అన్నలు లేరనుకుంటున్నారమో.. వాళ్లంతా మా పార్టీలోనే ఉన్నారు
సింగరేణి కార్మికుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి
సింగరేణికి ఎక్కువ బ్లాకులు వచ్చేలా కిషన్ రెడ్డి కృషి చేయాలి
మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడితే ఊరుకోం
సింగరేణి కార్మికుల కోసం హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ నిరంతరం కొట్లాడుతాయి
-తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత
(తెలంగాణ రక్షణసేన, శ్రీరాంపూర్)
“అన్నలు లేరని ఆఫీసర్లు భయం లేకుండా ఉన్నారేమో..ఇప్పుడు అన్నలంతా మా పార్టీలోనే ఉన్నారు ..జాగ్రత్త” అంటూ తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత సింగరేణి అదికారులకు వార్నింగిచ్చారు. ఇప్పుడు అన్నలు పోయారని మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు.. ఆ అన్నలంతా ఇప్పుడు మా పార్టీలో ఉన్నారు. మానవ హక్కుల ఉల్లంఘన చేస్తామంటే ఊరుకునేది లేదు.. అని స్పష్టం చేశారు. “టీఆర్ఎస్ సింగరేణి బాయిబాట” కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆమె శ్రీరాంపూర్ ఆర్కే7 మైన్ సందర్శించారు. బొగ్గుబాయి లోకి వెళ్లడానికి ప్రయత్నించిన కవితను, టీఆర్ఎస్ నయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు పక్షాలు తోసుకున్నాయి. టీఆర్ఎస్ కార్యకర్తలు బలవంతంగా గేట్లు తెరవడంతో కవిత లోపలికి వెళ్లారు. కార్మికులతో కలిసి మాట్లాడారు.
కార్మికుల బాధలు పట్టవా
మేము మైన్ దగ్గర వెళ్తే నిన్న, ఇవ్వాళ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారని కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మైన్ మీద మీటింగ్ లు పెట్టలేదా అని ప్రశ్నించారు. మీ రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ మీటింగ్ లు పెట్టలేదా..కార్మికులను కలిసి అడిగితేనే కదా వారి బాధలు తెలిసేదన్నారు. కార్మికుల బాధలను తెలుసుకుని పోరాటం చేస్తేనే కదా చట్టాలు వచ్చేదన్నారు. తల్లి కాంగ్రెస్ తో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం.. ఇప్పుడున్న పిల్ల కాంగ్రెస్ తో కొట్లాడలేమా అన్నారు. సింగరేణిలో ప్రస్తుతం చాలా మంది యువ వయసు ఉన్న వాళ్లు పనిచేస్తున్నారని కవిత చెప్పారు. ఇప్పటికే ఐటీ కారణంగా రెండు నెలల జీతం పోతున్నదన్నారు. ఇంకా పిల్లలను మంచి స్కూల్లో చదివించే పరిస్థితి ఎక్కడ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి పిల్లల కోసం మంచి స్కూళ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందిని చెప్పారు. ఆఫీసర్లకు, కాంట్రాక్టర్లకు కావల్సిన అవసరాలు తీర్చేందుకు మాత్రం డబ్బు ఉంటుంది.. కానీ కార్మికుల కోసం ఉండదా.. ఇలాంటి వాటిని ప్రశ్నించేందుకే మేము వచ్చామని కవిత స్పష్టం చేశారు. గతంలో అన్నలు ఉండటంతో కార్మికుల విషయంలో ఆఫీసర్లు కొంత పద్ధతిగా వ్యవహరించే వారని ఇప్పుడు ఆ భయం లేక కార్మికులను వేధిస్తున్నారని తెలిపారు. కార్మికులను వేధించే అధికారులపై కేసులు పెడతామని హెచ్చరించారు. 40 వేల మంది కార్మికులకు 80 వేల క్వార్టర్లు ఉన్నాయని, రెండు క్వార్టర్లకు ఒకరి చొప్పున ఇవ్వొచ్చని సూచించారు. కానీ అలా చేయకుండా కార్మికులను అఫీసర్లు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. కార్మికులకు మంచి చేసే పనులు చేయండని.. వారిని ఇబ్బంది పెడితే ఏమొస్తదని చెప్పారు.
లాభాల పంపకంలో మోసం
సింగరేణి లాభాల్లో కార్మికులకు ఇచ్చే వాటా విషయంలోనూ మోసం చేస్తున్నారని కవిత విమర్శించారు. లాభాలను సగానికి పైగా దాచేస్తున్నారని, అందుకే తాను ఒక ప్రతిపాదన పెడుతున్నానని తెలిపారు. గతంలో అత్యధికంగా వాటా ఇచ్చిన దానికన్నా పదివేలు ఎక్కువ ఇవ్వమని కోరుతున్నానన్నారు. లాభాల్లో 42 శాతం వాటా అంటే కూడా మన అకౌంట్లోకి తక్కువ డబ్బులు వస్తాయని కవిత చెప్పారు. అలియాస్ పేర్ల విషయంలో కూడా కేసులు పెడుతున్నారని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కార్మికులను వేధించవద్దని కోరారు. అలియాస్ పేర్ల అంశంపై కూడా మేము పోరాటం చేస్తున్నామని వివరించారు. మైన్ మీటింగులు పెట్టుకోవటం కార్మికుల హక్కు అని, దాన్ని అడ్డుకుంటామంటే ఊరుకునేది లేదన్నారు. హెచ్ఎంఎస్ అధ్యక్షులు రియాజ్ కార్మికుల కోసం పోరాటం చేసే నాయకులని తెలిపారు. ఆయనతో కలిసి టీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ను, హెచ్ఎంఎస్ ను ఆశీర్వదించాలని కోరారు.
ఇంకా పాత టెక్నాలజీయేనా
మైన్ వద్దకు వస్తుంటే మహిళా సూపర్ వైజర్లు ఎదురయ్యారని, ఆనాడు సింగరేణిలో మహిళలు ఉండాలని తాము పార్లమెంటులో ఫైట్ చేశామని కవిత గుర్తుచేశారు. ఇవ్వాళ సింగరేణిలో మహిళా ఉద్యోగులను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. అయితే ఇక్కడున్న మహిళా ఉద్యోగులకు సరైన సౌకర్యాలు లేవని చెప్పారు. సింగరేణి చరిత్రలో ఇప్పుడిప్పుడే మహిళా ఉద్యోగులు వస్తున్నారని, వారికి సరైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరముందని కవిత సూచించారు. ఉద్యమంతో పాటు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కార్మికులతో కలిసి పనిచేశానని, వివిధ కారణాలతో కొత్తగా పార్టీ పెట్టాక కూడా కార్మికులతో పనిచేసేందుకు వచ్చానని కవిత వివరించారు. సింగరేణిలో కార్మికులకు ఏ చిన్న కష్టం వచ్చినా డబ్బులు ఇచ్చేందుకు యాజమాన్యం నిరాకరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
కానీ కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు మాత్రం డబ్బులు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు మాత్రం మెషీన్లను రిపేర్ చేసుకుంటూ వాడుకోవల్సిన పరిస్థితి తెచ్చారన్నారు.
కార్మికులకు సరైన భద్రత లేదని, కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వటం లేదన్నారు. వేరే చోట అత్యాధునిక టెక్నాలజీ వాడుతుంటే ఇక్కడ మాత్రం పాత టెక్నాలజీ వాడుతున్నారని మండిపడ్డారు. మైన్ లోకి వెళ్లే కార్మికులకు గాలి కూడా ఇవ్వటం లేదనని, గాలి, నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత సింగరేణిదేనని స్పష్టం చేశారు. ఇప్పటికీ పాత టెక్నాలజీ వాడుతున్న సింగరేణి యాజమాన్యం సిగ్గుపడాలన్నారు. కనీసం సరైన మంచి నీళ్లు కూడా ఇవ్వకపోవటమనేది మానవ హక్కుల ఉల్లంఘననే అని దుయ్యబట్టారు.
పోరాడితేనే ఫలితం
సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో అన్యాయం చేస్తున్నారని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఆనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లను కూడా అన్ ఫిట్ చేయటం లేదని చెప్పారు. మొన్న డిప్యూటీ సీఎం వచ్చి 350 మందికి అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇచ్చారని, కానీ 2 వేల మంది ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నారని గుర్తు చేశారు. నాలుగు నెలల్లో సర్వీస్ అయిపోతున్న పెద్ద మనిషి కలిసి తన బాధ వెల్లబోసుకున్నాడని కవిత చెప్పారు.
ఇప్పటి వరకు కూడా ఆయనను అన్ ఫిట్ చేయలేదని, వాళ్ల పిల్లలకు ఉద్యోగం ఎప్పుడు వస్తుందని ప్రశ్నించారు. మెడికల్ బోర్డు పాలసీ ఉంది కదా.. నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు పెట్టాల్సి ఉన్నా ఎందుకు పెట్టడం లేదన్నారు. ఇక్కడకు వచ్చి పోరాటం చేస్తేనే సీఎం, డిప్యూటీ సీఎంలు స్పందిస్తారని తాము ఇక్కడకు వచ్చామని కవిత చెప్పారు. శ్రీరాంపూర్ ఆర్కే7 మైన్ ను కూడా మూసేసే ప్రయత్నం చేస్తే కార్మికులు అడ్డుకొని కాపాడుకున్నారని గుర్తు చేశారు. మన గోదావరి వ్యాలీలో ఉన్న బొగ్గు మనకే కేటాయించాలని, కోల్ బ్లాక్స్ కోసం సింగరేణి ప్రైవేట్ సంస్థలతో పోటీ పడే పరిస్థితి లేకుండా చేయాలని చెప్పారు. కిషన్ రెడ్డి ఇప్పుడు బొగ్గుశాఖ మంత్రిగానే ఉన్నారని, మనకు ఎక్కువ బ్లాకులు కేటాయించే ప్రయత్నం కిషన్ రెడ్డి చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో చాలా మంది స్కిల్డ్ కార్మికులు ఉన్నారని, సంస్థను చాలా బాగా నడిపే పరిస్థితి ఉన్నప్పటికీ యాజమాన్యానికి ఆ మనసు రావటం లేదని కవిత విమర్శించారు. మేము కచ్చితంగా అధికారంలోకి వస్తామని, అండర్ గ్రౌండ్ మైనింగ్ ను తెరుస్తామని హామీ ఇచ్చారు. దాని ద్వారా లక్ష మంది ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందని వివరించారు.








