ఇంద్రవెల్లి అమరులే స్ఫూర్తి

టీఆర్ఎస్ అధ్యక్షులు కవిత  

 స్థూపం వద్ద ఆదివాసీ అమరులకు నివాళులు అర్పించిన కవిత

(తెలంగాణ రక్షణసేన, ఇంద్రవెల్లి)

ఇంద్రవెల్లి విషాదాన్ని, వారి త్యాగాలను తెలంగాణ ఎన్నటికీ మరిచిపోదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల అన్నారు. టీఆర్ఎస్ సింగరేణి బాయిబాట కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా  పర్యటనలో ఉన్న కవిత ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఆదివాసీ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తిగా, మన ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ ఆవిర్భవించిందని చెప్పారు. బాయిబాట కార్యక్రమం ద్వారా కార్మికుల కష్టాలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇంద్రవెల్లి అంటేనే స్ఫూర్తినిచ్చే ఒక పోరాటం గుర్తుకు వస్తుందన్నారు. మా నినాదం కూడా సామాజిక తెలంగాణయేనని, అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా మేము పోరాటం చేస్తామని తెలిపారు. ముఖ్యంగా ఆదివాసీల అంశంపై పోరాటం చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. ఆ స్ఫూర్తిని పొందేందుకు ఇంద్రవెల్లి వద్ద నివాళులు అర్పించేందుకు వచ్చామన్నారు. 

వేరే ఏ పార్టీలో లేని విధంగా తెలంగాణ రక్షణసేనలో ఆదివాసీల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. ఆదివాసీల్లో ఉన్న 9 తెగలను కలుపుకొని వారి కోసం బలంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఆదివాసీల ఆశీర్వాదం  కోసం ఇక్కడకు వచ్చామని వివరించారు. మీకు ఏ సమస్య వచ్చినా సరే టీఆర్ఎస్ ఉందని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఆదివాసీల తరఫున టీఆర్ఎస్ పోరాడుతుందని హామీ ఇచ్చారు. 

 తెలంగాణ సాధించుకున్న 12 ఏళ్ల తర్వాత కూడా ఆదివాసీల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తిర్యాణి లాంటి మండల్లాల్లో రోడ్లు సరిగా లేవని, కరెంట్ రాని చాలా గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయన్నారు. ఈ చేదు నిజాలను మాట్లాడుకని ఆ దుఖం నుంచి సమస్యలను పరిష్కరించుకునే శక్తి తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ బిడ్డలకు ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, వ్యాపారాలు చేసుకునేందుకు ఏం చేయాలనే దానిపై టీఆర్ఎస్ సుదీర్ఘంగా ఆలోచిస్తోందని కవిత వెల్లడించారు. భవిష్యత్తులో ఆదివాసీ పెద్దలతో ఈ అంశాలపై చర్చిస్తామని తెలిపారు. తెలంగాణ రక్షణసేన ప్రధానంగా ఐదు అంశాలను ఎజెండాగా పెట్టుకుందని చెప్పారు. అందులో ఉచిత విద్య, ఉచిత వైద్యం కీలకంగా పెట్టుకున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడకు వచ్చి చాలా హామీలు ఇచ్చాడని, ఆదివాసీల కోసం సపరేట్ గా డీఎస్సీ కూడా వేస్తామని చెప్పాడన్నారు. దాని కోసం ఆదివాసీ బిడ్డలు ఎదురుచూస్తున్నారని ప్రభుత్వానికి గుర్తు చేశారు. ఆదివాసీ బిడ్డలకు న్యాయం జరిగే విధంగా ఒక మంచి ప్రతిపక్షంగా ఇప్పుడు పనిచేస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక ఆదివాసీలను అగ్రభాగాన అభివృద్ధి పథంలో నడిపిస్తామని స్పష్టం చేశారు.

నాగోబా సందర్శన

అనంతరం కేస్లాపూర్ లోని ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబాను కవిత దర్శించుకున్నారు. నాగోబా దేవుడు అంటే తనకు చాలా సెంటిమెంటని, పార్టీ పెట్టక ముందు ఇక్కడ వచ్చి పార్టీ పెట్టిన తర్వాత మళ్లీ వస్తానని మొక్కుకున్నానన్నారు.