బెల్లంపల్లిలో టీఆర్ఎస్ జెండా పండుగ
తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన పార్టీ చీఫ్ కవిత
(తెలంగాణ రక్షణ సేన, బెల్లంపల్లి)
బెల్లంపల్లిలో సోమవారం తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ జెండా ఎగురవేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. పార్టీ జెండా ఎగురవేయడానికి బెల్లంపల్లికి వచ్చిన కవితకు కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరై ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ పట్టణ నడిబొడ్డున తెలంగాణ రక్షణ సేన జెండా ఎగురవేయటం గర్వంగా ఉందన్నారు. బెల్లంపల్లి ప్రజల ఆశీస్సులు కావాలని వినమ్రంగా కోరుకుంటున్నానన్నారు. ఇక్కడి ఎమ్మెల్యే రెండు నెలలకు ఒక్కసారి కూడా ప్రజలకు దర్శనం ఇవ్వటం లేదని, ఇక్కడకు వస్తుంటే కోర్టు రోడ్డు చాలా ఆధ్వాన్నంగా ఉందన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇస్తామన్న ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. పెన్షన్ పెంచలేదు, రైతుల వడ్లు కొనటం లేదు.. వారిని ఇబ్బంది పెడుతున్నదన్నారు. ఈ కర్కోటపు కాంగ్రెస్ ప్రభుత్వంపై మనమంతా పోరాడాల్సిన సమయం వచ్చిందని కవిత పిలుపునిచ్చారు. బెల్లంపల్లిలో కచ్చితంగా ఎమ్మెల్యే సీటును టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రక్షణ సేన ముఖ్యంగా ఐదు కీలక అంశాలను పాంచజన్యం పేరుతో ప్రాధాన్యంగా పెట్టుకుందని వివరించారు. స్కూళ్లు ప్రారంభం కావడంతో తల్లిదండ్రులకు ఆందోళన మొదలైందన్నారు. స్కూల్ ఫీజులు తగ్గించాలని కోరినప్పటికీ ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని చెప్పారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చాక ఉచిత విద్య, వైద్యం అందిస్తామని తెలిపారు. యువతకు రూ. 2 లక్షల నుంచి రూ. 20 కోట్ల రూపాయల వరకు ఋణాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
వారికి ఉద్యోగాలు వచ్చేలా అన్ని చర్యలు తీసుకుంటామని వివరించారు. రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో గౌరవం ఉంటుందన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో రైతుల కోసం ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేస్తామని కవిత చెప్పారు. అదే విధంగా సామాజిక న్యాయం కోసం కూడా మా పార్టీ పోరాటం చేస్తుందన్నారు.
ఆసిఫాబాద్ లో పార్టీ కార్యాలయం ప్రారంభం
టీఆర్ఎస్ బాయిబాటలో భాగంగా ఆసిఫాబాద్ లో పర్యటించిన కవిత డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్, కొమురం భీమ్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ ఎగురవేశారు. ఆసిఫాబాద్ లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.










