నీ గుండాగిరి బంద్ చెయ్

మంచిర్యాల ఎమ్మెల్యే కు కల్వకుంట్ల కవిత వార్నింగ్

ఈ గడ్డ మీది నుంచే తెలంగాణ రక్షణ సేన రాజకీయం చేస్తుంది

కాంగ్రెస్ పార్టీ అవినీతి కారణంగానే సింగరేణికి నష్టాలు

సంస్థను ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తున్నారు

గుంటనక్క మాయలో పడ్డ కిషన్ రెడ్డి

మంచిర్యాలలో కవిత ప్రెస్ మీట్

(తెలంగాణ రక్షణసేన, మంచిర్యాల)

మంచిర్యాల ఎమ్మెల్యే గుండాగిరి బంద్ చెయ్యాలి..మంచిర్యాల కేంద్రంగా తెలంగాణ రక్షణ సేన రాజకీయం చేయబోతున్నది.. ఇక మీ గుండాగిరి నడవదు అంటూ టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా ప్రజల ప్రేమను పొంది ఇక్కడి అన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్ జెండా ఎగిరేస్తామని స్పష్టం చేశారు. గుంటనక్క ట్రాప్ లో పడి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగమాగమవుతున్నాడని చెప్పారు. టీఆర్ఎస్ బాయిబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం కవిత మంచిర్యాలలో మీడియాతో మాట్లాడారు. 

కార్మికులకు అధికారుల వేధింపులు

“ఇవ్వాళ సింగరేణిలో చాలా మంది కార్మికులను తగ్గించే కుట్ర చేస్తున్నారు. ఓపెన్ కాస్ట్ అంటూ కార్మికులను తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు. కానీ అండర్ గ్రౌండ్ మైనింగ్ ద్వారా ఇంకా ఎక్కువ మైనింగ్ చేయవచ్చు. అదే విధంగా తెలంగాణ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించవచ్చు. కానీ సింగరేణిలో కార్మికులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించటం లేదు. ఆఫీసర్లకు ఒక న్యాయం, కార్మికుడికి ఒక న్యాయం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కొంచెం లేట్ అయినా సరే గైర్హాజరు వేస్తామని వేధిస్తున్నారు. సింగరేణిలో ప్రతి శనివారం ఉద్యోగాల జాతర జరగాలి. కానీ ఇక్కడ ఎంత మందిమందిని సస్పెండ్ చేద్దామా అని లెక్కలు వేస్తున్నారు. ప్రభుత్వం అలసత్వం కారణంగానే ఈ పరిస్థితి వచ్చింది. సింగరేణికి ఇవ్వాల్సిన బకాయిలు అన్నీ ఇచ్చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంతా తన కనుసన్నల్లోనే జరగాలనే ప్రయత్నం చేస్తున్నారు. కార్మికుల హక్కులను హరిస్తూ వారిపై శాడిజం చూపిస్తున్నారు. సింగరేణి కార్మికులకు సరైన వసతులు కల్పిస్తే బంగారం పండిస్తారు. ప్రతి గనిలో పరిస్థితిని మేము గమనించాం. కార్మికులకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కార్మికులతో వెట్టి చాకిరి చేయించటం సరికాదు.”

కాంగ్రెస్ స్కాంతో తెలంగాణకు నష్టం

“గుజరాత్ లో గుజరాత్ మినరల్స్ అనే కార్పొరేషన్ ఉంది. మైనింగ్, మినరల్స్ అన్ని కూడా దాని ద్వారానే నడుస్తాయి. అదే విధానంలో మనం కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసుకోవాలి.

తెలంగాణలో మేము ఒక ప్రాంతీయ పార్టీగా తెలంగాణ రక్షణ సేనను ప్రారంభించాం. 

రైతులు, సింగరేణి కార్మికులు ఇలా ఎన్నో అంశాలపై మాట్లాడుతున్నాం. మేము కచ్చితంగా అధికారంలోకి వస్తాం. వచ్చాక గుజరాత్ లో మాదిరిగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. సింగరేణిలో మైన్ డెవలప్ మెంట్ విధానం తెస్తే అండర్ గ్రౌండ్ మైనింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఉండే ఎండీవో సిస్టమ్ ను పూర్తిగా రద్దు చేయాలి. సింగరేణి విషయంలో నిజాం రాజు చాలా గొప్ప పని చేశారు. తెలంగాణలో గోదావరి పరివాహకంలో ఉన్న బొగ్గు అంతా కూడా సింగరేణికే రాసిచ్చారు. కానీ కాంగ్రెస్ చేసిన స్కాం కారణంగా మనకు నష్టం వచ్చింది. ఆ బొగ్గు కుంభకోణాన్ని సాకుగా చూపి…బీజేపీ అధికారంలోకి వచ్చాక 250 బ్లాకులను జాతీయం చేసింది. మన సత్తుపల్లిలో కోల్ మైన్స్ పోతే సింగరేణి కూడా నష్టపోవల్సి ఉంటుంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ భూమి పుత్రుడే..ఆయనకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణకు ఎక్కువ కోల్ బ్లాకులు కేటాయించాలి.  సింగరేణి కార్మికులకు ఐటీ లేకుండా చేయాలి. పెన్షన్ కూడా రివిజన్ చేయాలి. మన కార్మికులకు ఐటీ తీసేయాలని మేము డిమాండ్ చేస్తే…అధికారంలోకి వచ్చాక తీసేస్తామని కిషన్ రెడ్డి చెబుతున్నాడు. అసలు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటం కల్ల. కానీ బీజేపీ విధానం ఏ విధంగా ఉందో కార్మికులు అర్థం చేసుకోవల్సిన అవసరం ఉంది.” 

జీఎం చేయాల్సిన పనులు సీఎం చేస్తున్నాడు

“కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ చట్టాలను మేము వ్యతిరేకిస్తున్నాం. 

ఆ నాలుగు లేబర్ కోడ్ చట్టాలను తెలంగాణలో అమలు చేయమని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయాలి. కిషన్ రెడ్డి కూడా గుంటనక్క మాయలో పడ్డారు. గుంటనక్క లేఖ రాయగానే ఆయన కూడా లేఖ రాశారు. మేము సింగరేణికి వస్తున్నామని తెలిసి… గుంటనక్క హడావుడిగా ఇక్కడకు వచ్చారు. గుంటనక్క లేఖ రాయగానే బొగ్గు బ్లాకుల గురించి కిషన్ రెడ్డి ఆరా తీస్తున్నారు. కానీ ఎప్పుడో జరిగిన విషయంపై మేము వస్తున్నామని తెలిసి ఇప్పుడు లేఖ రాశారు. మన కార్మికులం కష్టాల్లో ఉంటే ఏఐటీయూసీ దొంగ సమ్మెకు దిగింది. కార్మికుల ఐక్యతను, సమ్మె స్ఫూర్తిని దెబ్బ తీసేలా సమ్మె చేయాలని నిర్ణయించటం కార్మికులకు అన్యాయం చేయటమే. ముఖ్యంగా మనం డిపెండెంట్ ఉద్యోగాలను సాధించుకోవల్సిన అవసరముంది. దానికోసం మనం, బీఆర్ఎస్ విపక్షాలుగా వచ్చాం. కానీ ప్రభుత్వం కూడా వచ్చి దొంగ నాటకాలు ఆడుతున్నది. గతంలో సింగరేణిలో వచ్చే పోస్టులను జీఎం ఇచ్చే వారు కానీ ఇప్పుడు వాటిని సీఎం ఇస్తున్నాడు. జీఎం చేయాల్సిన పనులను సీఎం చేస్తుంటే…క్లర్క్ చేయాల్సిన పనులను డిప్యూటీ సీఎం చేస్తున్నాడు. ముందు ఈ ప్రభుత్వం సింగరేణికి బకాయి ఉన్న మొత్తం అప్పు కట్టాలి. నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలి. కానీ ప్రతిపక్షాల మాదిరిగా మీరే కార్మికుల వద్దకు తిరుగుతామంటే కుదరదు. అదే విధంగా కార్మికులకు గతంలో హయ్యెస్ట్ వాటా ఎప్పుడు ఇచ్చారో దాని మీద రూ.10 వేలు ఎక్కువగా ఇవ్వాలి. “

అర్హత లేని కంపనీకి కాంట్రాక్టు

“సింగరేణి కార్మికులకు అన్యాయం చేసిన విద్రోహ పార్టీ కాంగ్రెస్ పార్టీయే. అలియాస్ నేమ్స్ విషయంలో కార్మికులను ఇబ్బంది పెట్టకుండా వారికి మంచి చేయాలి. అదే విధంగా సింగరేణి కార్మికులకు సొంత ఇల్లు ఉండాల్సిన అవసరం ఉంది. అందుకోసం ప్రభుత్వం వారికి 250 గజాల స్థలం ఇవ్వాలి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కార్మికులకు ఇళ్లు కట్టుకునేందుకు 250 గజాల స్థలం ఇస్తాం. సింగరేణిలో విజిలెన్స్ అనేది జోక్ గా మారింది. పదో తరగతి పాసయ్యారో లేదో విజిలెన్స్ చూస్తుందంట. అసలు సింగరేణి కార్మికులు పదో తరగతి పాస్ కావాలన్న నిబంధన ఎక్కడ ఉంది. సింగరేణిలో చదువు ప్రామాణికం కాదు. మ్యాన్ పవర్ తగ్గించేందుకు ఈ కుట్ర చేస్తున్నారు. మ్యాన్ పవర్ తగ్గించే కుట్రను మేము అడ్డుకుంటాం. డిస్మిసల్ కార్మికులు డిపెండెంట్ వాళ్లు పెండింగ్ లో ఉన్నారు. సింగరేణిలో ఇవ్వాల్సిన ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలి. సూపర్ వైజర్లను ఈ2 లోకి తీసుకోవాలి. అప్పుడు మాత్రమే వాళ్లు ఈ5 వరకు వెళ్తారు. అదే విధంగా జనరల్ అసిస్టెంట్ సిస్టమ్ ను తేవాలి. 

క్లర్క్ పోస్టులకు 9 నెలల క్రితం నోటిఫికేషన్ వేసి ఇప్పటి వరకు కూడా ఎగ్జామ్ పెట్టలేదు. 

సింగరేణిలో ఉద్యోగాలు లేక యువత ఇబ్బంది పడుతోంది. వెంటనే ఎగ్జామ్ ను నిర్వహించాలి. సింగరేణిలో మెషీన్స్ రిపేర్ చేసేందుకు యువతకు అవకాశం ఇవ్వాలి. వారికి లోన్లు ఇచ్చి పరిశ్రమలు పెట్టిస్తే యువతకు ఉపాధి దొరుకుతుంది. మేము అధికారంలోకి వచ్చాక యువతకు రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు ఋణాలు ఇచ్చి సింగరేణిలో మెషీన్లు రిపేర్ చేసే పరిశ్రమ పెట్టుకునేలా చేస్తాం. రూ.33 వేల కోట్ల రెవెన్యూ ఇచ్చే సంస్థ కళ్లముందే పాడవుతుంటే మాకు చాలా బాధగా ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి కారణంగానే సింగరేణి సంస్థకు నష్టం జరుగుతున్నది. గతంలో నైనీ బ్లాక్ ను ఏదో చేద్దామని చూస్తే మనందరం పోరాటం చేస్తే వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ రాజస్థాన్ లో నష్టాల్లో ఉన్న సంస్థతో కలిసి సోలార్ ప్లాంట్ పెడుతున్నారు. అదే సోలార్ ప్లాంటును మన దగ్గర పెట్టవచ్చు కదా? రాజస్థాన్ లో పెట్టాలని భావిస్తున్న సోలార్ ప్లాంట్ ను వెంటనే విరమించుకోవాలి. ఇప్పటికే మేము డీజిల్ కుంభకోణం గురించి చెప్పాం. పేపర్లు కూడా రాసి రాసి అలసిపోయాయి. కానీ ఇప్పటి వరకు దాని మీద ఒక్క చర్య కూడా తీసుకోలేదు. 

రూ.10 లక్షల విలువ లేని సంస్థతో లిథియం ఆయాన్ బ్యాటరీ సంస్థ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము వ్యతిరేకించటంతో అది ఆగింది. కానీ క్యాన్సిల్ కాలేదు. ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి.”

భూ నిర్వాసితులకు ఉద్యోగం

“సింగరేణి సొమ్మును సీఎం సరాదాల కోసం ఫుట్ బాల్ మ్యాచుల కోసం ఖర్చు చేస్తున్నారు. ఆ నిధులను కనీసం కొడంగల్  కోసం కూడా కాకుండా తన సరదాలకు ఖర్చు చేస్తున్నాడు. మంచిర్యాలలో ఓసీపీలో కాంట్రాక్ట్ కార్మికులకు రూ.20 వేలు మాత్రమే వస్తున్నాయి. గోదావరిఖని, రామగుండంలో మాత్రం రూ. 25 వేలు ఇస్తున్నారు. అక్కడి ఎమ్మెల్యేలు కొట్లాడి రూ.25 వేలు ఇప్పిస్తున్నారు. అలా అని వాళ్లు సొక్కమైన వాళ్లు కాదు. 

వాళ్లు చేసే భారీ అవినీతి గురించి కూడా త్వరలోనే బయటపెడతా. కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయాలని ఇక్కడి ఎంపీని డిమాండ్ చేస్తున్నా. తాళ్లపల్లిలో సింగరేణి కోసం భూములు ఇచ్చిన ప్రజలకు పరిహారం ఇవ్వలేదు. సింగరేణికి భూమి ఇచ్చిన కుటుంబాలకు పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలి. కానీ వాళ్లకు ఏమీ ఇవ్వలేదు. అన్ని రాష్ట్రాల్లో మన కన్నా కూడా కార్మికులకు ఎక్కువ జీతాలు ఉన్నాయి. అయ్యప్ప దీక్ష స్వాముల కోసం మన దగ్గర రైలు ఆగే పరిస్థితి లేదు. రైలు ఇక్కడ ఆగే విధంగా ఎంపీ ప్రయత్నం చేయాలి. సింగరేణి ప్రాంతంలో ప్రజలు మొత్తం కాంగ్రెస్ నే గెలిపించారు. కానీ వాళ్లకు కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం మేలు చేయలేదు. గోదావరిలో కరకట్ట కట్టలేదు. ఇక్కడ ఎమ్మెల్యే గుండాగిరి చేస్తానంటే ఊరుకునేది లేదు. మీ గుండాగిరి బంద్ చేసి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోండి. 

తెలంగాణనే కొట్లాడి తెచ్చుకున్నోళ్లం మీరు గుండాగిరికి బయపడతామా? “