పవన్ కల్యాణ్ పై దేశ ద్రోహం కేసు పెట్టాలి

ప్రజల కోసం పోరాటం చేసే మాపై కేసులు పెడతారు? పవన్ కళ్యాణ్ పై కేసు పెట్టేందుకు చేత కావటం లేదా?

రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఆనవాళ్లను పక్కన పెడుతున్నాడు

అందుకే పక్క రాష్ట్రం నుంచి మళ్లీ పెత్తనం కోసం వస్తున్నారు

కరీంనగర్ లో ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత

కవిత గారి కామెంట్స్

(తెలంగాణ రక్షణసేన, కరీంనగర్)

ఉద్యమకారులకు అన్నీ చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకు చలనం లేదని కవిత విమర్శించారు. మనం పోరాటం చేస్తే కమిటీలు అని వేస్తారని, ఆ తర్వాత రోజే మర్చిపోతారన్నారు. ఉద్యమకారులను గుర్తించటానికి కూడా ఈ ప్రభుత్వం 30 నెలలు కాలం గడిపేసిందన్నారు. 1200 మంది అమరులైతే పట్టించుకోలేదంటూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇదే కాంగ్రెస్ ఆడిపోసుకుందని గుర్తు చేశారు. కానీ వాళ్లు అధికారంలోకి వచ్చి 30 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు పట్టించుకోలేదని విమర్శించారు. కొత్త రాష్ట్రాన్ని సాధించుకున్న ఝార్ఖండ్… వాళ్ల ఉద్యమకారుల కోసం ఎంతో చేస్తున్నదని చెప్పారు. 

స్వాతంత్ర్య సమరయోధులను గుర్తించి గౌరవించినట్లుగా వాళ్ల రాష్ట్ర సాధన కోసం పోరాడిన వాళ్లను గౌరవించుకుంటున్నదని తెలిపారు. రైల్వే, బస్సు ప్రయాణాల్లో డిస్కౌంట్, ఉద్యోగాల్లో  రిజర్వేషన్లు కల్పించిందని చెప్పారు. అక్కడి ప్రభుత్వం మాదిరిగా చేయాలంటూ ఆ జీవోలను కూడా ఈ ప్రభుత్వానికి తెచ్చి ఇచ్చామన్నారు. కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఉద్యమకారులను కనీసం గుర్తించటం లేదని చెప్పారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మన భావజాలంపై దాడి చేస్తున్నాడని ఆరోపించారు. మన రాష్ట్ర చిహ్నంలో ఉన్న కాకతీయుల చిహ్నం రాచరిక పోకడ అంటూ తీసేశాడని దుయ్యబట్టారు. చార్మినార్, పూర్ణకుంభం కూడా తీసేసే ప్రయత్నం చేస్తే వ్యతిరేకత రావటంతో ఆగిపోయారని గుర్తు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో ఇలాగే చేశారని, తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ లేకుండా చేశారని తెలిపారు. ఉద్యమ తల్లి విగ్రహానికి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదన్న సాకుతో ఈ ప్రభుత్వం కొత్త విగ్రహాన్ని తెచ్చిందన్నారు. ఆ విగ్రహంలో బతుకమ్మ లేకుండా చేసి తెలంగాణను అవమానించారని కవిత విమర్శించారు. తెలంగాణ తల్లి విగ్రహం కోసం అసెంబ్లీ లో చర్చ పెడితే మేము వెళ్లామని, కానీ మమ్మల్ని రాకుండా చేసి… ఎలాంటి చర్చ లేకుండానే విగ్రహాన్ని మార్చేశారని ఆరోపించారు. ఇప్పుడు మనం గూగుల్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని వెతికితే ఉద్యమ కాలం నాటి విగ్రహం కనిపించకుండా చేశారన్నారు. 

K Kavitha addresses Telangana movement activists during the Telangana Udyamakarulu Round Table meeting held in Karimnagar

తెలంగాణ తల్లి కనుమరుగు

తెలంగాణ వాదానికి అడ్డా కరీంనగర్ లో తెలంగాణ తల్లి విగ్రహం లేకుండా చేశారని కవిత మండిపడ్డారు. మొన్నటి జూన్ 2 లోపు విగ్రహాన్ని పెట్టాలని తెలంగాణ రక్షణ సేన తరఫున ధర్నాలు చేసినా పట్టించుకోలేదని చెప్పారు. సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన ప్లేస్ లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారని తెలిపారు. జయశంకర్ సార్ విగ్రహాన్ని అప్పటి ప్రభుత్వం పెట్టలేదు.. ఈ ప్రభుత్వం కూడా పెట్టడం లేదని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే మేము తెలంగాణ జాగృతి తరఫున అసెంబ్లీలో అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టించామని, కానీ మన తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా విగ్రహాల కోసం పోరాటం చేయటం ఆవేదన కలిగిస్తున్నదన్నారు. మహత్మా ఫూలే విగ్రహం పెట్టాలని పోరాటం చేస్తే ఇప్పటి వరకు విగ్రహం పెట్టలేదన్నారు. రవీంద్రభారతిలో బాల సుబ్రమణ్యం విగ్రహం పెట్టారని, బాల సుబ్రమణ్యం విగ్రహం పెట్టాలంటే  ఏ ఫిల్మ్ సిటీలోనో, థియేటర్లలోనో పెట్టుకోవాలని సూచించారు. రవీంద్ర భారతి అంటే తెలంగాణ కళాకారులకు అడ్డాగా ఉండాలన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు మన మీద ఆంధ్రా పెత్తనం ఉందని చెప్పాం కదా..కానీ తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా అదే పెత్తనం నడుస్తున్నదని తెలిపారు. మన గద్దరన్న పేరుతో సినిమా అవార్డులు ఇస్తున్నారు.. అసలు సినిమాలతో గద్దరన్నకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ఆయన పేరుతో ఒక జానపద అకాడమీ పెట్టి కళాకారులకు అవార్డులు ఇవ్వాలని సూచించారు. ఇక కరీంనగర్ లో కూడా తెలంగాణ చౌక్ లో అభివృద్ధి కార్యక్రమం పేరుతో మనం 2009 లో పెట్టుకున్న తెలంగాణ తల్లి విగ్రహం తీసేశారు. 

పిస్స కల్యాణ్

తెలంగాణ వాదాన్ని ఉగ్రవాదంతో పోల్చిన సినీనటుడు పవన్ కల్యాణ్ మీద దేశ ద్రోహం కేసు పెట్టాలని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తెలంగాణవాదులను ఉగ్రవాదులు, వేర్పాటు వాదులతో పోల్చినా అతనిపై కేసు పెట్టడం  ప్రభుత్వానికి  ఎందుకు చేతకావడం లేదని ప్రశ్నించారు.. తెలంగాణ ఉద్యమకారులు ఆకాంక్షు-సాధన అనే అంశంపై గురువారం కరీంనగర్ లో తెలంగాణ రక్షణసేన ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకాలం నాటి ఆనవాళ్లను పక్కన పెట్టడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. అందుకే పక్క రాష్ట్రం నుంచి మళ్లీ మనం మీద పెత్తనం చేసేందుకు వస్తున్నారని మండిపడ్డారు. జూన్ 2 న మన రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజునే ఓ సినిమా యాక్టర్ ఇక్కడ సభ పెట్టి తెలంగాణవాదులను అవమానించే సాహసం చేశాడని చెప్పారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వారిని వేర్పాటువాదులు అని పవన్ కల్యాణ్ సంబోధించడం దుర్మార్గమని చెప్పారు. వేర్పాటు వాదం అంటే దేశం నుంచి వేరుపడటం.. మనం ఎప్పుడైనా దేశం నుంచి వేరు అవుతామని అన్నమా..? తలకాయ లేని సినిమా స్టార్ ఏదీ పడితే అది మాట్లాడితే ఆయనపై దేశద్రోహం కేసు పెట్టాల్సిన ప్రభుత్వం ఏమీ చేయటం లేదని ధ్వజమెత్తారు. వేర్పాటు వాదం అన్న పవన్ కళ్యాణ్ పై దేశ ద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.  ఈ ప్రభుత్వం పై చాలా సీరియస్ గా కొట్లాడాల్సిన అవసరం ఉందని కవిత పిలుపునిచ్చారు. 

Telangana Udyamakarulu Round Table: Kavitha Demands Action Against Pawan Kalyan, Raises Telangana Identity Concerns

తెలంగాణపై బీజేపీ కుట్ర

తెలంగాణ సాధించుకున్న మనకు వేరే రాష్ట్రం నుంచి వచ్చే వాళ్ల కుట్రలు ఎలా ఉంటాయో తెలుసని కవిత చెప్పారు. వాళ్లతో ఎన్నో ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామని, కానీ బీజేపీ ఏదో విధంగా తెలంగాణను హస్తగతం చేసుకోవాలని చూస్తున్నదని ఆరోపించారు. తమిళనాడును కూడా హస్తగతం చేసుకుని సౌత్ లో పాగా వేయాలని చూస్తున్నదని విమర్శించారు. ఈ పిస్స పవన్ కళ్యాణ్ వెనుకాల బీజేపీ ఉందన్న అనుమానం వస్తున్నదన్నారు. బీజేపీ డైరెక్ట్ గా పోటీ చేస్తే 8 సీట్లు కూడా రావని స్పష్టం చేశారు. అందుకే పవన్ కల్యాణ్ ను మన మీదకు వదులుతోందని ఆరోపించారు. ఆయనతో ఏదో మాట్లాడిస్తే తెలంగాణ ప్రజలు ఆవేశంగా స్పందిస్తారని భావిస్తున్నదని చెప్పారు. అదే విధంగా జీహెచ్ఎంసీ లో చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ విలీనం చేయటం వెనుక కూడా కుట్ర ఉన్నట్లు అనుమానం కలుగుతున్నదని కవిత చెప్పారు. కచ్చితంగా మనకు ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలుస్తున్నదన్నారు. మన భద్రతకు, అస్తిత్వానికి ప్రమాదం వస్తుందని తెలిస్తే కట్టె పట్టుకొని కన్నెర్ర జేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. నిజంగా తెలంగాణకు ప్రమాదం వస్తే ప్రాణాలు అర్పించైనా తెలంగాణను కాపాడేందుకు తెలంగాణ రక్షణ సేన ఉందని వెల్లడించారు. సినిమా యాక్టర్ల మాయలో పడవద్దని తెలంగాణ యువతకు రిక్వెస్ట్ చేశారు. మన చరిత్రను అవమానించేందుకు వస్తున్న సంప్రదాయ శక్తులను మనం గమనించాలని హెచ్చరించారు. సినిమా యాక్టర్ల డ్యాన్స్, ఫైట్లు చూసి ఎంజాయి చేయండి… కానీ వాళ్ల మాయలో పడవద్దని, వాళ్లు ఎంటర్ టైన్ మెంట్ ఫ్యాక్టర్సే తప్ప పొలిటికల్ ఫ్యాక్టర్స్ కాదని స్పష్టం చేశారు. తెలంగాణ మీద వాళ్లు కూడా ఒక పథకం ప్రకారం కుట్ర చేస్తున్నట్లు తెలుస్తున్నదని, ఈ మాయను, కుట్రను అర్థం చేసుకుంటే పవన్ కళ్యాణ్ పోటీ చేసి తలకిందులుగా తపస్సు చేసినా అయ్యేదేమీ లేదని కవిత చెప్పారు. మొదటి నుంచి తాను కల్చర్ కోసం పోరాటం చేసిన వ్యక్తినని, బీజేపీ గానీ వస్తే మన మైసమ్మ, దుర్మమ్మ లాంటి దేవతలు ఉండరని కవిత హెచ్చరించారు. ఒకటి, రెండు దేవుళ్లను మాత్రమే పూజించాల్సి ఉంటుందని,  తెలంగాణలో ఎవరి దేవున్ని వాళ్లు పూజించుకునే మంచి సంస్కృతి ఉందని చెప్పారు. అలాంటి సంస్కృతిని చెడగొట్టాలనుకుంటున్న బీజేపీని పొలిమేర దాక కూడా రానివ్వొద్దని పిలుపునిచ్చారు. పవన్ కల్యాణ్ రూపంలో మేక వన్నె పులి రూపంలో బీజేపీ వస్తోంది.. వారి కుట్రలను తెలంగాణ ప్రజలను గమనించి అర్థం చేసుకోవాలని కోరారు. 

మహిళలకు 50 శాతం

 కరీంనగర్ లో చూస్తే ఉద్యమకారుల మీద జులుం చేసిన గంగుల కమలాకర్ ను బీఆర్ఎస్ నెత్తిన పెట్టుకుందని కవిత తెలిపారు. చాలా చోట్ల ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్లకే బీఆర్ఎస్ టికెట్లు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇక ఎన్నికలు చాలా కాస్లీ అయ్యాయని చెబుతున్నారు.. అవును ఖర్చు తగ్గించే రాజకీయాలు చేయాలని కోరారు. బీసీలు కూడా జనరల్ సీట్లలో పోటీ చేసే పరిస్థితి రావాలన్నారు. ఎక్కడైనా బీసీలు, ఎస్సీలు పోటీ చేయగలిగితేనే అది మంచి తెలంగాణ అవుతుందని సూచించారు. ఇన్నాళ్లు మగ నాయకుల పాలన చూశారు. వాళ్లు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేదు.. మీ ఆడబిడ్డగా నాకు ఒక అవకాశం ఇవ్వండి. మార్పు ఎలా ఉంటుందో చూపిస్తానని విజ్ఞప్తి చేశారు. మా పార్టీలో కచ్చితంగా 33 శాతం సీట్లను మహిళలకు ఇస్తామని, మహిళ నాయకులను తయారు చేసి భవిష్యత్ లో 50 శాతం సీట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తామని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయి నిపుణులతో చాలా సార్లు మాట్లాడిన తర్వాతే ఉచిత విద్య, వైద్యం గురించి చెప్పానని కవిత తెలిపారు. దానికి కావల్సిన బడ్జెట్, ప్రణాళిక అన్ని తెలుసుకున్నాకే ప్రకటించానని వెల్లడించారు. మా తోవ అందరినీ కలుపుకొని పోయే విధంగా ఉంటుందని,  

మాకు మేధావులు, రిటైర్డ్ ఎంప్లాయిస్, మాజీ మావోయిస్టుల భావజలం ఇలా అన్ని వర్గాలు కావాలన్నారు. ఒంటరిగా రాజకీయాలు చేస్తామంటే కుదరదని, అన్ని వర్గాలను కలుపుకొని, అందరికీ మేలు చేసే రాజకీయాలు చేస్తామని ప్రకటించారు. 

At a Telangana Rakshana Sena meeting in Karimnagar, Kavitha attacked Pawan Kalyan's remarks on Telangana and accused the government of neglecting Telangana movement activists and symbols.

రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానాలు

1. 1200  అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. 

2. ఉద్యమకారుల హక్కుల సాధన కోసం ఇక్కడున్న వాళ్లందరం పోరాటం చేస్తాం. వాటిని సాధించుకుంటాం. 

3. తెలంగాణను అవమానించేలా మాట్లాడిన పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలి. 

4. తెలంగాణ ద్రోహులకు వత్తాసు పలికే వాళ్లు మన తెలంగాణ వాళ్లైనా సరే వాళ్లను ద్రోహులుగానే భావిస్తాం. 

5. కరీంనగర్ లోని జాలిగుట్టలో  ఉద్యమకారులకు 250 గజాల చొప్పున పట్టాలు పంపిణీ చేయాలి.

6. కరీంనగర్ పట్టణంలో ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహాన్నిపెట్టాలి.