సింగరేణిలో ఇప్పటికీ బ్రిటీష్ పాలన నడుస్తున్నది
నాది కార్మికుల పక్షం..గుంటనక్కది కాంట్రాక్టర్ల పక్షం
మా కారణంగా జరిగిన తప్పులకు క్షమించండి
-తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత
(తెలంగాణ రక్షణసేన, రామగుండం)
ప్రశ్నించు, పోరాడు, పరిష్కరించు అనే విధానంతో ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నో సమస్యల పరిష్కరానికి తెలంగాణ రక్షణ సేన కృషి చేసిందని పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత తెలిపారు. టీఆర్ఎస్ సింగరేణి బాయిబాటలో భాగంగా కవిత గురువారం రామగుండం ఓసీపీ -3, బేస్ వర్క్ షాపులను సందర్శించి, కార్మికులతో మాట్లాడారు. కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..తానెప్పుడూ కార్మికుల పక్షానే ఉన్నానని, కానీ ఒక గుంటనక్క కాంట్రాక్టర్ల పక్షాన ఉందని కవిత ఆరోపించారు. సింగరేణిలో ఇప్పటికీ కూడా బ్రిటీష్ పాలన నడుస్తున్నదని ఆరోపించారు. ఆఫీసర్ మాట కాదని ప్రశ్నిస్తే ఛార్జ్ షీట్ ఇస్తున్నారని చెప్పారు. కార్మికులను ఆఫీసర్లు పెడుతున్న ఇబ్బందితో ఒత్తిడిలో కార్మికులు ఆందోళనతో ఉన్నారని తెలిపారు. ఆఫీసర్లేమో వాళ్ల హక్కుల కోసం నిన్న ధర్నా చేశారంట.. అదే కార్మికులు ధర్నా చేస్తే మాత్రం మెమోలు ఇస్తున్నారని కవిత విమర్శించారు. ఇది సరికాదని, ఆఫీసర్లు, ప్రభుత్వం తీరు మారాలన్నారు. తాను టీజీబీకేఎస్ లో ఉన్నప్పుడే ప్లే డే, ఎన్ మైనస్ పద్దతి, పీహెచ్డీ లో 50 శాతం ఇచ్చే విధానం వచ్చిందని గుర్తు చేశారు. దీని కారణంగా కార్మికులు రూ. 2 నుంచి 3 లక్షల వరకు నష్టపోతున్నారని తెలిసిందన్నారు. కార్మికులకు ఇంత నష్టం జరుగుతుందని అప్పుడు తాము ఊహించ లేదన్నారు. తమ కారణంగా జరిగిన తప్పునకు కార్మికులకు కవిత క్షమాపణ చెప్పారు. కచ్చితంగా జరిగిన తప్పులను సవరించుకుంటామని, ఆత్మ పరిశీలన చేసుకుంటామని ప్రకటించారు. మళ్లీ పీహెచ్డీ పూర్తిస్థాయిలో వచ్చే హక్కును కార్మికులకు తెచ్చి పెడతానని మాట ఇచ్చారు.
కేసులు పెట్టవద్దు
కార్మికులకు మెడికల్ స్కీమ్ అందరికీ ఒకేలా వర్తించాలని కవిత కోరారు. ఒక్కొక్కరికీ ఒక్కో న్యాయం ఉండొద్దని సూచించారు. మెడికల్ స్కీమ్ పారదర్శకంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల నుంచి రిఫరల్ హాస్పిటల్స్ డబ్బులు వసూలు చేయకుండా చూడాలని కోరారు. ఒకప్పుడు సింగరేణి కార్మికుల కోసం మంచి స్కూళ్లు ఉండేవి, కానీ ఇప్పుడు సిబ్బందే లేరు. కొన్నేళ్లుగా ప్రభుత్వాల విధానాల కారణంగా ఈ పరిస్థితి వచ్చిందని కవిత విమర్శించారు. సింగరేణి కార్మికులు కూడా విద్య, వైద్యం కోసం భారీగా ఖర్చు చేసే పరిస్థితి తెచ్చారన్నారు. ఇక అలియాస్ పేర్లకు సంబంధించి చాలా ఇబ్బంది పెడుతూ విజిలెన్స్ కేసులు పెడుతున్నారని చెప్పారు. గతంలో మేము అలియాస్ పేర్ల విషయంలో చూసి చూడనట్లు వ్యవహరించాలని యాజమాన్యానికి చెప్పి ఎంతో మందికి మేలు చేశామని గుర్తు చేశారు. కానీ ఉద్యోగాలు ఇవ్వవద్దన్న కారణంతో అలియాస్ పేర్ల విషయంలో విజిలెన్స్ కేసులు పెడుతున్నారని చెప్పారు. టెన్త్ పాస్ అంటూ కొర్రీలు పెడుతున్నారన్నారు. సింగరేణి కార్మికులకు చదువు ప్రామాణికం కాదని కవిత స్పష్టం చేశారు. కానీ ఉద్యోగాలు ఇవ్వొద్దన్న కారణంతో ఇవన్నీ చేస్తున్నారని ఆరోపించారు. డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు.
ఇప్పటి వరకు ఇంకా 2 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వకుండా పెండింగ్ లో ఉంచారని తెలిపారు.


పోరాడితేన్ మెడికల్ బోర్డు
నాలుగు నెల క్రితం తాము హైదరాబాద్ లో సింగరేణి భవన్ ను ముట్టడిస్తే మెడికల్ బోర్డు పెట్టారని కవిత గుర్తు చేశారు. కానీ దాని వల్ల ఎవరికీ ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. కచ్చితంగా నెలకు రెండుసార్లు సింగరేణి మెడికల్ బోర్డును నిర్వహించాలని సూచించారు. నాలుగైదు నెలల్లో రిటైర్ మెంట్ అవుతున్న వాళ్లు డిపెండెంట్ ఉద్యోగం కోసం టెన్షన్ పడవద్దని చెప్పారు. హెచ్ఎంఎస్ గెలిచిన వెంటనే కార్మికుల అప్లికేషన్ డేట్ ను ప్రామాణికం చేసేలా చేస్తామని స్పష్టం చేశారు. సింగరేణలో ఓపెన్ కాస్ట్, అండర్ గ్రౌండ్ మైనింగ్ రెండు ఉండాలనే పాలసీ తమకు ఉందన్నారు. ఇక్కడ ఓసీ-3 మన సంస్థ ఆధ్వర్యంలో నడవటం కారణంగానే ఇక్కడ ఎక్కువ మంది పర్మినెంట్ ఎంప్లాయిస్ ఉన్నారని తెలిపారు. అదే ప్రైవేట్ వాళ్లు నిర్వహించే మైనింగ్ లో ఎక్కువ మంది కాంట్రాక్ట్ కార్మికులే ఉంటారని వివరించారు. ఫ్యూచర్ లో ఓపెన్ కాస్ట్ గనులను కూడా సింగరేణియే నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ముఖ్యంగా ఈపీ ఆపరేటర్లకు చాలా ఇబ్బందులు ఉన్నాయన్నారు. ప్రమోషన్ల కోసం వాళ్లు 12 ఏళ్లు వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అలా కాకుండా వాళ్లు రిక్రూట్ అయ్యేప్పుడే బీ గ్రేడ్ విధానంలో రిక్రూట్ చేసుకుంటే వాళ్లకు మేలు జరుగుతుందని కవిత అభిప్రాయపడ్డారు. ఇక వాళ్లు నడిపే వెహికిల్స్ నాసిరకంగా ఉంటున్నాయి. దీంతో ఆపరేటర్లు ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తోంది. ఏడాది క్రితం జరిగిన ప్రమాదంలో గాయపడ్డ ఒక ఈపీ ఆపరేటర్ ఇప్పటికీ కూడా కోమాలో ఉన్నారని తెలిపారు. వాళ్లు చేసేది హైరిస్క్ జాబ్ అని, అందుకే వారి భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కార్మికుల పట్ల మానవత్వంతో ఉండాలి
ఓపెన్ కాస్ట్ లో దుమ్ము సమస్య ఉందని.. వాటర్ ట్యాంకర్లతో నీళ్లు కొట్టాల్సి ఉన్నా పట్టించుకోవటం లేదని కవిత అన్నారు. వాటర్ ట్యాంకర్లను యూనియన్ లీడర్లు నిర్వహిస్తుండటంతో వాళ్లు సరిగా పనిచేయటం లేదని విమర్శించారు. కానీ హెచ్ఎంఎస్ గెలిస్తే అలా ఉండదని.. మా నాయకులు కార్మికులతో కలిసి పనిచేస్తారని చెప్పారు.
యూనియన్ లీడర్లు అయ్యామని పని వదిలే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. తిలక్ నగర్ లో వెళ్లి సింగరేణి కార్మికుల క్వార్టర్స్ చూశానని.. చాలా చిన్నగా ఉన్నాయని చెప్పారు.
పక్కన ఒక షెడ్ వేసుకుంటే వాటిని కూడా తొలగిస్తున్నారని తెలిపారు. సింగరేణిలో 80 వేల క్వార్టర్లు ఉంటే 40 వేల మంది కార్మికులే ఉన్నారన్నారు. మిగిలిన క్వార్టర్లను డబుల్ బెడ్ రూం మాదిరిగా చేసి కార్మికులకు ఇవ్వాలని సూచించారు. లేదంటే వాళ్లు వేసుకున్న షెడ్ జోలికి వెళ్లకుండా మానవత్వంతో వ్యవహరించాలని కోరారు.









