జులై 2న జరిగే భూ పోరాటాన్ని విజయవంతం చేయండి
తెలంగాణ స్థానికత విషయంలో మళ్లీ మొదలైన కుట్ర
ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఎక్కడ చదివినా తెలంగాణలో స్థానికులేనని కోర్టు చెప్తున్నది
తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలు దక్కాలి.. మన వాళ్ల హక్కులు కాపాడటంలో వెనక్కి తగ్గేది లేదు
-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
ఖైరతాబాద్ లోని ఎంఎస్ మక్తాలో పార్టీ జెండా ఆవిష్కరించిన టీఆర్ఎస్ చీఫ్
హైదరాబాద్ :
తెలంగాణ ఉద్యమకారులకు ఇంటి స్థలాల సాధన కోసం జూలై 2న ఉప్పల్ భగాయత్ లో చేపట్టనున్న భూపోరాటాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ రక్షణ సేచ చీఫ్ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. బుధవారం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఎంఎస్ మక్తాలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు రాజ్ భవన్ ఎదురుగా గల రైల్వే గేట్ నుంచి జెండా గద్దె వరకు పాదయాత్ర నిర్వహించి బస్తీలోని ప్రజలతో ముచ్చటించారు. జెండా ఆవిష్కరించిన తర్వాత కవిత మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల చొప్పున ఇంటి స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా దానిని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యిందన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ప్రతి ఉద్యమకారుడికి ఇంటి స్థలం సాధనే ధ్యేయంగా తాము భూపోరాటానికి పిలుపునిచ్చామని చెప్పారు. రాష్ట్ర ప్రజలు, ఉద్యమకారులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు భూపోరాటంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ స్థానికతపై మళ్లీ కుట్రలు
తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలు దక్కాలన్న రాష్ట్ర స్థానికత అంశంపై మళ్లీ కుట్రలు మొదలయ్యాయని కవిత అన్నారు. తెలంగాణలో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఇక్కడ చదివిన వారినే రాష్ట్ర స్థానికులుగా గుర్తించాల్సి ఉందన్నారు. దానికి విరుద్ధంగా ప్రొఫెషనల్ కోర్సులు ఇక్కడ చదివిన వారిని కూడా స్థానికులుగా పరిగణించాలన్న హైకోర్టు తీర్పు తెలంగాణ బిడ్డలను కలచి వేసిందన్నారు. హైకోర్టు తీర్పుపై లీగల్ ఫైట్ చేయబోతున్నామని చెప్పారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న రోజుల్లో హైదరాబాద్ ను ఫ్రీ జోన్ గా పేర్కొంటూ కోర్టు తీర్పు వెలువరిస్తే యావత్ రాష్ట్రం భగ్గుమందని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన సమయంలోనూ హైదరాబాద్ ను కామన్ క్యాపిటల్ చేయాలనే డిమాండ్ ను తెరపైకి తీసుకువచ్చిప్పుడు కూడా బరిగీసి కొట్లాడి ఆ ప్రయత్నాలను విరమింపజేశామని చెప్పారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో స్థానికత అంశంపై కొట్లాడాల్సిన సమయం వచ్చిందన్నారు.
తెలంగాణ సాధించుకున్న తర్వాత మనం ఒకటి నుంచి 7 వ తరగతి వరకు ఇక్కడ చదివిన వాళ్లకే స్థానికత వర్తిస్తుందని పెట్టుకున్నామని చెప్పారు. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఎక్కడ చదివినా సరే తెలంగాణలో ప్రొఫెషనల్ కోర్సులలో చేరవచ్చని, ఆ డిగ్రీలతో రాష్ట్రంలో ఉద్యోగాలు దక్కించుకోవచ్చని కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. దీనిపై లీగల్ గా తెలంగాణ రక్షణ సేన పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ రక్షణ సేన అంటేనే తెలంగాణను రక్షించేందుకు పుట్టిన పార్టీ అని అన్నారు. స్థానికత, తెలంగాణ ప్రజల హక్కుల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటుతాం
ఖైరతాబాద్ లోని ఎంఎస్ మక్తాలో మొట్ట మొదటి సారిగా పార్టీ జెండా ఎగురవేస్తున్నామని కవిత చెప్పారు. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటుతామన్నారు. ఆ తర్వాత ఖైరతాబాద్ అసెంబ్లీ సీటును గెలుచుకుంటామన్నారు. అత్యంత పేదల పక్షాన తమ పార్టీ పోరాడుతుందన్నారు. తెలంగాణ వచ్చిన 12 ఏళ్ల తర్వాత కూడా ఎంఎస్ మక్తా వాసులకు ఇండ్ల పట్టాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు, డ్రెయినేజీలు ఇతర అనేక సమస్యలతో ఇక్కడి ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. టీఆర్ఎస్ ద్వారానే ఈ ప్రాంత ప్రజల సమస్యలు తీరుతాయన్నారు. సాంప్రదాయ పార్టీల మాదిరిగా కాకుండా ప్రజల్లో ఉండి వారికోసం పనిచేయాలని టీఆర్ఎస్ నాయకులకు కవిత సూచించారు.








