లక్ష్యంపైనే దృష్టి పెట్టాలి
ఈ ప్రపంచమే మహిళలకు వ్యతిరేకంగా ఉంది
సమాజంలో మార్పు కోసం అందరూ కృషి చేయాలి
-కల్వకుంట్ల కవిత
( తెలంగాణ రక్షణసేన, జూబ్లీహిల్స్)
మహిళలు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే తన మాట తానే వినకుండా ముందుకు సాగాలని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. నిర్ణయం తీసుకునే ముందే లక్ష్యాన్ని నిర్ధేశించుకుని పక్కాగా ఆలోచించాలని, వెనక్కు తిరిగి చూడవద్దని సూచించారు. జుబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్ లో బుధవారం వెటా ఇండియా ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. మహిళ సాధికారత కోసం వెటా ఇండియా సంస్థ, ఆ సంస్థ అధినేత ఝాన్సీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మహిళల కోసం మనం ఎంత చేసినా సరే ఒక్క అడుగు మిగిలే ఉంటుందన్నారు. ఎంతో మంది మహిళలను పది మందికి ఉద్యోగాలు ఇచ్చే పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
మహిళలంతా కూడా ఒక్కటేనని, మనమంతా ఒక్కటే కులమన్నారు. ఇక్కడ ఉండేవి రెండే కులాలని, ఒకటి మహిళల కులం, ఇంకొకటి మగవాళ్ల కులమని చెప్పారు.
టాలెంట్, కష్టపడే గుణం ఉన్నప్పటికీ వాటి ఆధారంగా మహిళలకు అవకాశాలు రావటం లేదన్నారు. అయినా సరే ఎంతో మంది మహిళలు ఇంటి పనులు చేసుకుంటూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారని వివరించారు. మగవాళ్లతో పోటీ పడి మరీ కష్టపడుతున్నారు.. కానీ మనకు ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట ఉంటుందన్నారు.
మంచి జాబ్ చేస్తూ ప్రమోషన్ వచ్చే సమయంలో పెళ్లి చేస్తారని కవిత తెలిపారు.
పెళ్లి, పిల్లలు అంటూ కొన్ని సంవత్సరాలు గ్యాప్ ఇచ్చాక మళ్లీ పని చేయాలంటే జూనియర్లుగా చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంటే ఈ ప్రపంచమే మనకు బయాస్డ్ గా ఉందన్నారు. ఆడ, మగ సమతౌల్యం అనేది లేదని చెప్పారు.
మహిళ సాధికారత జరగాలంటే ప్రభుత్వం, ఫ్యామిలీ, సోసైటీ అందరూ హెల్ప్ చేయాలని కోరారు. అన్ని రంగాల్లో 50 శాతం మహిళా ఉద్యోగులు ఉండాలని ప్రభుత్వం ఒక ఆర్డర్ ఇచ్చినా సరే ఫ్యామిలీ సహకరించదని తెలిపారు. తెలంగాణ వచ్చాక పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు సాధించుకున్నామన్నారు. కానీ ఆ 33 శాతం కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ కావటం లేదని చెప్పారు. అంటే మహిళలకు ఇంట్లో గాని, సోసైటీ నుంచి గానీ సపోర్ట్ ఉండటం లేదని కవిత వివరించారు. ఇప్పటికీ కొంచెం భిన్నంగా ఉంటే అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. నేను ఒక రాజకీయ నాయకురాలిగా ఏదైనా మాట్లాడితే లక్ష మంది వరకు నన్ను ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారని చెప్పారు. తాను మాట్లాడిన అంశంపై కాకుండా జెండర్ బేస్డ్ గా మాట్లాడుతుంటారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంకా బాల్య వివాహాలా..
ఈ ప్రపంచమే మహిళలకు వ్యతిరేకంగా ఉందన్నారు. వెటా లాంటి ఆర్గనైజేషన్స్ ద్వారా కొంత మార్పు వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికీ 2026 లో కూడా మన రాష్ట్రంలో 15-19 ఏళ్లలో పెళ్లై అమ్మలు అయిన వాళ్లు 7.2 శాతం ఉన్నారని కవిత వెల్లడించారు. ప్రభుత్వాలు టీనేజ్ మ్యారేజీలను తగ్గించేందుకు ఎంత ప్రయత్నం చేసినా సరే పెద్దగా మార్పు రావటం లేదని చెప్పారు. హైదరాబాద్ లో కూడా టీనేజ్ మదర్స్ 2.7 శాతం ఉన్నారని వివరించారు. అంటే ఆడపిల్లలకు పెళ్లి చేసి పంపిస్తే మన బాధ్యత తీరిందని తల్లితండ్రులు భావిస్తున్నారని తెలిపారు. సమాజంలో ఒక్కరోజులో మార్పు రాదని, అందుకు ఆడ, మగ అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఇప్పుడున్న యువత సోషల్ మీడియాలో ఫాలోవర్స్, లైక్స్ కోసం ఆలోచిస్తోందని,
అది అల్గరిథమ్ బేస్డ్ గా ఉంటుందని కవిత చెప్పారు. అలా కాకుండా ఆత్మవిశ్వాసంతో ఉండాలని సూచించారు. ఇంటర్ నెట్, ఇప్పుడొచ్చిన ఏఐ కూడా బయాస్డ్ గా ఉంటున్నదన్నారు. అంటే గతంలో మహిళల మీద ఉండే వార్తలను, అభిప్రాయాలను బట్టే ఏఐ సమాచారం అందిస్తుందన్నారు. అందుకే మీరు ఎలా ఉన్నారన్నది మ్యాటర్ కాదని, మీ మనసులో ఉన్న లక్ష్యం కోసం ఎలా కష్టపడతారన్నదే మ్యాటరని కవిత స్పష్టం చేశారు.








