యువతతోనే తెలంగాణ భవిత
-కల్వకుంట్ల కవిత
టీఆర్ఎస్ లో చేరిన బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యుడు వేణుమాధవ్
(తెలంగాణ రక్షణసేన కార్యాలయం, బంజారాహిల్స్)
తెలంగాణ అస్తిత్వ పరిరక్షణకు యువత కలిసి రావాలని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యుడు సదాశివపేటకు చెందిన నెమలికొండ వేణుమాధవ్ బుధవారం బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో కవిత సమక్షంలో పార్టీలో చేరిన సందర్భంగా ఆమె మాట్లాడారు. వేణుమాధవ్ తో పాటు పలువురికి కవిత కండువా కప్పి టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. అమరుల ఆశయాలు నెరవేర్చి తెలంగాణ పునర్నిర్మాణానికి సహకరించాలని ఆమె కోరారు. బీజేపీతో రాష్ట్రానికి ఒరిగేది లేదన్న సత్యం అందరూ గ్రహిస్తున్నారని, అందుకే వేణుమాధవ్ లాంటి సీనియర్లు ఆ పార్టీని వదిలి టీఆర్ఎస్ లో చేరుతున్నారని చెప్పారు. పార్టీలో చేరిన సందర్భంగా వేణుమాధవ్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటైన 12 ఏండ్లలో పాలకుల చేతగానితనం వల్ల మళ్లీ వలసవాదులు రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. అలాంటి శక్తులను అడ్డుకోవాలంటే కవిత లాంటి సాహసులే ముందుండి ఉద్యమించ గలరని చెప్పారు. తెలంగాణ రక్షణ సేన ద్వారా రానున్న రోజుల్లో తెలంగాణవాదులంతా ఏకం కానున్నారని స్పష్టం చేశారు. కవిత చేపడుతున్న కార్యక్రమాలు ప్రభుత్వాన్ని కదిలిస్తున్నాయని తెలిపారు. ఆమెతో కలిసి సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెదక్ జడ్పీ మాజీ ఛైర్మన్ బాలయ్య, సంగారెడ్డి ఇంఛార్జి దయాకర్ రెడ్డి, సయ్యద్ ఇస్మాయిల్, లోక రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.









