రేవంత్ రెడ్డి.. తెలంగాణ నీటి హక్కులను శాశ్వతంగా సమాధి చేస్తున్నారు
ముఖ్యమంత్రి అయి 30 నెలలు అయినా నీళ్లపై అవగాహన పెంచుకోలేదు
హోస్పేట సభలో కర్నాటక అక్రమ ప్రాజెక్టులపై ఎందుకు నోరు మెదపలేదు
తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు కామెర నవీన్ కుమార్
(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్) :
తెలంగాణ నీటి హక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాశ్వతంగా సమాధి చేస్తున్నారని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు కామెర నవీన్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ లోని టీఆర్ఎసుఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. నీళ్ల కోసం దశాబ్దాలుగా అరిగోస పడుతున్న తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరిన్ని కష్టాలను మూటగట్టుకుంటున్నదని అన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు గేట్ల ప్రారంభోత్సవానికి కర్నాటకలోని హోస్పేటకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆ రాష్ట్రం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులపై ఎందుకు నోరు మెదపలేదో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఆర్డీఎస్ మోడ్రనైజేషన్ పనులు ఏళ్లకేళ్లుగా పూర్తి కాక 15.90 టీఎంసీల నీళ్లలో ఐదు నుంచి ఆరు టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకుంటున్నామని.. ఆర్డీఎస్ ఆధునీకరణ పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో ఎందుకు కర్నాటక ముఖ్యమంత్రిని ప్రశ్నించలేదని నిలదీశారు.
ఆర్డీఎస్ కు ఎగువ ఒక ఎత్తిపోతల పథకం, రోడ్ కమ్ బ్యారేజీ, దిగువన మరో రోడ్ కమ్ బ్యారేజీలతో 10 టీఎంసీలకు పైగా కర్నాటక వినియోగించుకునే ప్రయత్నాలు చేస్తుంటే వాటి గురించి ప్రస్తావించకపోవడం అంటే తెలంగాణ నీటి హక్కులను కాలరాయడమేనన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంపుపై పల్లెత్తు మాట మాట్లాడలేదని నడిగడ్డతో పాటు కృష్ణా బేసిన్ లోని మొత్తం తెలంగాణ భూభాగాన్ని ఎడారిగా మార్చే ప్రాజెక్టుల గురించి కనీసం ప్రస్తావించకపోవడం విచారకరమన్నారు. ముఖ్యమంత్రికి, ఇరిగేషన్ శాఖ మంత్రికి నదీ జలాలు, జల వివాదాలపై అవగాహన లేకపోవడంతో తెలంగాణ రాష్ట్రం భవిష్యత్ లో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన నాలుగు రోజులకే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించేందుకు ఒప్పుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలంతా ఏకమై నిలదీస్తే తాము బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించట్లేదని నాలుక మడతేసిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసన్నారు.
పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని రేవంత్ రెడ్డి ఒక్క రోజు డిమాండ్ చేయలేదన్నారు. చంద్రబాబు ఒత్తిడితో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి వెళ్లి రేవంత్ రెడ్డి ఆ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వాచ్చారని తెలిపారు. ఆ సమావేశం తర్వాత పోలవరం – బనకచర్ల లింక్ పై అసలు చర్చే జరగలేదని మన ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తే .. నిపుణుల కమిటీకి తెలంగాణ ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారని కేంద్ర జలశక్తి శాఖ అధికారికంగా ప్రకటించిందన్నారు. రేవంత్ ఒప్పుకోవడంతోనే పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై కేంద్రం, ఏపీ సీఎం చంద్రబాబు వేగం పెంచారని అన్నారు. తెలంగాణకు ముష్టివేసినట్టు సమ్మక్క సాగర్ నుంచి నాగార్జున సాగర్ కు లింక్ ప్రాజెక్టు చేపడుతామని.. అక్కడి నుంచి తరలించే 45 టీఎంసీల గోదావరి జలాలపై హక్కులు వదులుకోవాల్సి ఉంటుందని మెలిక పెట్టినా నోరు విప్పని సీఎం మన రాష్ట్రానికి ఉండటం దురదృష్టకరమన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వ చర్యలతో ఎగువన మహారాష్ట్ర, కర్నాటక, దిగువన ఏపీ కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణను దోపిడీ చేస్తున్నాయని తెలిపారు. కర్నాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోకపోతే ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలు శాశ్వతంగా ఎడారిగా మారే ప్రమాదముందన్నారు. ఇప్పటికే హైదరాబాద్ ప్రజలు వాటర్ ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తుందని.. ఎగువన చేపడుతున్న ప్రాజెక్టులతో తాగునీటి కోసం హైదరాబాద్ ప్రజలు తండ్లాడాల్సి వస్తుందన్నారు. నదుల అనుసంధానం పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న చర్యలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు సంబంధించిన జల వివాదాలను పరిష్కరించేందుకు కనీసం ప్రయత్నం చేయడం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు మార్చుకోకుంటే తెలంగాణ మరింత జలదోపిడీకి గురవుతుందని హెచ్చరించారు. ఇకనైనా కృష్ణా, గోదావరి జలాల్లో మన హక్కులను కాపాడుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు.








